జాగరణం
రాత్రి మేల్కొని పగలు నిద్రపోతున్న కొత్త తరం ఇది. బ్రేక్‌ఫాస్ట్‌కు లంచ్ కలుపుకొని బ్రంచ్‌లు చేసి, గుడ్మార్నింగ్‌కు బదులు గుడ్‌నైట్ అంటూ విష్ చేసుకునే విచిత్ర ‘కాల’మిది.సిటీలో నైట్ డ్యూటీలు సర్వసాధారణమయ్యాయి. చందమామ అంతకంతకూ కొలీగ్స్‌ను పెంచుకుంటున్నాడు. ప్రతి రాత్రీ ఓ శివరాత్రిలా... నగర జీవనం నిత్య జాగారంలామారిపోతోంది.
..:: ఎస్.సత్యబాబు
ఒకప్పుడు రాత్రి డ్యూటీలంటే గూర్ఖాలో, లారీ క్లీనర్‌లో... అందరూ నిద్రపోయే వేళలో పని చేసుకునే వారిని చూసి జాలిపడని వారుంటే ఒట్టు. రాత్రిపూట ఉద్యోగం చేసే అబ్బాయికి పెళ్లి సంబంధం దొరకడం కూడా కష్టమయ్యేది. మరిప్పుడో... ఫైన్ పేమెంట్ ఉంటే.. నైన్ టు ఫైవ్ అనేది పగలైనా, రాత్రయినా ఓకే అంటున్నారు. డ్యూటీస్‌కి మాత్రమేనా డ్యాన్సులకి కూడా డార్క్‌టైమ్ బెస్ట్ అనుకుంటున్నారు. దీంతో పబ్‌లూ, క్లబ్‌లూ, ఆఖరికి కాలనీలూ, సినీ స్టార్ల డాబాలు సైతం తెల్లవార్లూ గానా బజానాలకు వేదికలుగా మారిపోతున్నాయి. మొత్తం మీద నిశాచరత్వమే... నిత్యకృత్యం అయిపోయింది.
సరదాలకూ సరే...
బైక్ రేసింగ్‌ల నుంచి మల్టీఫ్లెక్స్ సినిమా హాళ్ల దాకా రకరకాల యాక్టివిటీస్‌కి రాత్రి వేదికగా మారిపోయింది. ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో సెలబ్రిటీస్‌తోపాటు యూత్ కూడా నైట్ లైఫ్ అనుభూతిని సొంతం చేసుకోవడానికి రోడ్డెక్కుతోంది. ఇక ఇలా వచ్చేవారికోసం కాఫీషాప్‌లు, చాయ్ బండ్లు, సిగరెట్ కొట్లు అందుబాటులో ఉంటున్నాయి. రాత్రి పది పన్నెండింటిదాకా రెండో షిఫ్ట్ ఉద్యోగాలు చేసి ఇంటికి చేరినా వెంటనే నిద్రా దేవి ఒడిలోకి చేరుకోవడం లేదు జనం. టీవీ మొదలుకుని ఇంటర్నెట్‌లో సోషల్‌నెట్‌వర్క్‌లతో తెల్లవారుజాము దాకా జాగారాలు చేస్తున్నారు. వీటికి తోడు అప్పుడప్పుడు వచ్చే అకేషన్స్‌కి కూడా అర్ధరాత్రి రోడ్లు వేదికలవుతున్నాయి. అంతేనా... ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రాత్రి సమయంలో షాప్‌లు, నైట్ బజార్‌లు అందుబాటులోకి వచ్చాయి. రెస్టారెంట్స్‌లో మిడ్‌నైట్ బిర్యానీలు సరేసరి. మొత్తం మీద అటు కెరీర్, ఇటు కేరింతలు కలిసి నగరజీవిని నిశాచరిగా, నిత్య జాగారమూర్తిగా
మార్చేస్తున్నాయి.
సూర్యదర్శనం అరుదు...
రాత్రివిధులకు సిటిజనులు ఎంతగా అలవాటు పడిపోతున్నారంటే...‘పగలు తప్ప నైట్స్‌లో ఖాళీ దొరికినా నిద్రరాదు. ఆ టైమ్‌లో రోడ్లన్నీ సర్వే చేయడమే పని’అని సతీష్ అనే బీపీఓ ఉద్యోగి చెప్పాడు. ఇదే పరిస్థితి సరదాల కోసం తెల్లార్లూ తిరిగే వారికీ తప్పడం లేదు. సాధారణంగా నైట్‌షిప్ట్స్ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతాయి. చివరగా ప్రారంభమయ్యే 12.30 గంటల షిఫ్ట్‌ని ‘దెయ్యాలు తిరిగే టైమ్’ అని మనం ఎలా అంటామో... కార్పొరేట్ ప్రపంచం ‘గ్రేవ్ యార్డ్ షిఫ్ట్’ అని దీన్ని పిలుస్తుంది. నైట్‌జాబ్స్ చేసేవాళ్లలో చాలామందికి సూర్యదర్శనం అరుదే. ‘రాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ పనిలో ఉంటాను. సూర్యుడు వచ్చేవేళకు ఇంట్లో నిద్రపోతుంటాను. వీకెండ్స్‌లో కూడా పగటి నిద్రే కాబట్టి... సూర్యుడ్ని కలవడం తక్కువే’అంటున్నాడు ఓ పబ్‌లో పని చేసే డీజే వంశీ. ‘మొదట షిఫ్ట్ టైమింగ్స్ చూసి భయం వేసింది. తొలి రోజుల్లో నిద్ర పెద్ద సమస్య అయింది. కాని తప్పదు కదా. మారిన దినచర్యకు అలవాటు పడడానికి 2 నెలలు పట్టింది’అని చెప్పాడు ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ కంపెనీలో నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే సత్యేంద్రసింగ్ ఠాకూర్.
జాగ్రత్తలు ప్లీజ్...
పగలు పని చేయాలని, రాత్రి విశ్రమించాలని ప్రకృతి నిర్ధ్ధేశించింది. తప్పనిసరిగా రాత్రిళ్లు మేలుకుని ఉండేవాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ ‘అకాల’విధులు నిర్వహించే తొలిదశలో అలసట, తలనొప్పి, అజీర్తి... వెంటాడతాయి. అందుకే శారీరక మానసిక సమస్యలపై అవగాహన పెంచుకోవాలంటున్నారు వైద్యులు. వ్యాయామం తప్పనిసరని సూచిస్తున్నారు. ‘సరైన సమయానికి నిద్ర లేకపోతే పనిమీద ఏకాగ్రత చూపకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోలేకపోవడం, లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం వంటి సమస్యలు సంభవిస్తాయి. అయితే ఏ పనైనా 20 రోజులు చేస్తే తర్వాతి రోజు నుంచి అలవాటుగా మార్చుకునే శక్తి మన దేహానికి ఉంది. కాబట్టి మరీ బెంబేలెత్తాల్సిన పనిలేకపోయినా... జాబ్ టైమింగ్స్‌కు తగ్గట్టుగా బాడీక్లాక్‌ని అడ్జెస్ట్‌మెంట్ చేసుకోవడం, ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త అవసరం’ అని చెబుతున్నారు ఆరెంజ్ క్లినిక్స్‌లో పనిచేస్తున్న ఫిజిషియన్ డాక్టర్ పాపారావు.
జాగారపు జాబ్‌లెన్నో...
ఒకప్పుడు రాత్రి మేల్కొని ఉండే జాబ్స్ అంటే... పొలీసులు, జైలు అధికారులు, గార్డులు, ైఫైర్ ఫైటర్స్, ప్రైవేట్ సెక్యూరిటీ, ప్రైవేట్ డిటెక్టివ్స్. ఇక హెల్త్‌కేర్‌లో డాక్టర్స్, నర్సుల నుంచి పలు విభాగాల్లో దిగువ స్థాయి సిబ్బంది దాకా రాత్రి విధుల అవసరం ఉంటుంది. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో బౌన్సర్స్, బార్‌టెండర్స్, రెస్టారెంట్ కుక్స్, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, మీడియా... ఇలా అనేక రంగాల్లో నైట్ జాబ్స్ చేస్తున్నవారు అనేకం. మరోవైపు సాఫ్ట్‌వేర్, కాల్‌సెంటర్స్, బీపీఓలు, షాపింగ్ మాల్స్, కల్చరల్ సెంటర్లు... వంటి సరికొత్త, రాత్రి ఆధారిత కెరీర్‌లు కూడా ఒకటొకటిగా వీటికి జత కలుస్తున్నాయి. కాలానికి ఎదురీదుతూ నిర్వహించే ఈ విధులు కఠినమైనవైనా... మిగతా వాటితో పోల్చితే మెరుగైన ఆదాయం వస్తుండడంతో ఈ జాబ్స్‌పై మోజు పెరుగుతోంది. డే టైమ్‌లో జాబ్ చేసేవారు సైతం రాత్రి సగభాగం నిద్రపోవడం మానేసి, మంచి ఆదాయం కోసం మాల్స్‌లోనో, పబ్స్‌లోనో రాత్రివేళల్లో పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తున్నారు.