నేను, మా బుడ్డోడూ... నా నైట్‌డ్యూటీల కథ! | I ... our buddodu The story of my night duty! | Sakshi
Sakshi News home page

నేను, మా బుడ్డోడూ... నా నైట్‌డ్యూటీల కథ!

Published Sat, Dec 28 2013 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

I ... our buddodu The story of my night duty!

‘‘అందరూ నిద్రపోయే వేళల్లో మీరు మేల్కొని పని చేస్తుంటారు. అందరూ మేల్కొనే టైమ్‌లో నిద్రపోతుంటారు. ఎందుకండీ పాపం అలా’’ అని నన్నడుగుతుంటారు చాలా మంది. పైగా నేను ఇంటికొచ్చే టైమ్‌కు మా బుడ్డోడు నిద్రపోతుంటాడనీ, వాడితో ఆడుకునేందుకు నాకు టైమే ఉండదనీ జాలి పడుతుంటారు.


 పైకి వాళ్ల మాటలతో ఏకీభవిస్తున్నట్లు నటిస్తుంటా. నేనెంతో అమితంగా బాధపడుతున్నట్లు ఫేసు పెడుతూ, పోజు కొడుతూ... లోలోన మాత్రం నా టైమింగ్స్ పట్ల అనంతంగా ఆనందపడుతుంటా. జర్నలిస్టునై రాత్రి డ్యూటీలు  చేస్తూ బతికిపోతున్నాను గానీ... అలాక్కాకుండా అందరిలా మామూలు టెన్ టు ఫైవ్ డ్యూటీ చేస్తే అదెంత నరకమో కదా అనుకుంటూ ఉంటా. కారణం బయటకు వెల్లడించాలని లేకపోయినా, మనసాగదు కాబట్టి రహస్యంగా మీకు చెబుతున్నా. మీరెక్కడా దీన్ని బయటపెట్టొద్దు... నా గుట్టు విప్పొద్దు. మాటివ్వండి ప్లీజ్.
    *********        
 పిల్లలకు కథలు చెప్పే రోజులవీ పోతున్నాయని బాధపడుతుంటారు మేధావులు. ఆ రోజులన్నీ మళ్లీ రావాలన్నది బోల్డుమంది సాహిత్యవేత్తల కోరిక. పెద్దల మాట చద్ది మూట కదా. అందుకే పాటిద్దామని మా బుడ్డోడి దగ్గర ప్రయత్నం మొదలుపెట్టా.  మనం ఏదో ఉద్ధరించేస్తున్నాం... చాలా గొప్పపని చేస్తున్నాం అన్న ఫీలింగ్‌తో మా ఎనిమిదేళ్ల బుడ్డోడికి కథ చెప్పడం మొదలుపెట్టా. దాహంగా ఉన్న కాకి కుండలో రాళ్లు వేసి, నీళ్లు పైకొచ్చేలా చేసి ఎలా దాహం తీర్చుకుందో చెప్పా. కథతో పాటు యుక్తి కూడా నేర్చుకోవాలని చిన్న సైజు ఉపన్యాసం కూడా ఇచ్చా. రాయి ఆక్రమించిన చోటు మేరకు నీళ్లు పైకి లేస్తాయనీ, ఈ సత్యాన్ని అప్పట్లో ఆర్కిమెడిస్సూ, ఈ కథలో సైన్సు ఉందన్న సంగతిని నేను మాత్రమే కనిపెట్టాననీ, ఇలా పిల్లల కథల్లో సైన్సు సంగతులు కూడా ఉంటాయని బోధించా. ఒక్క కాకి కథలోనే కాస్త యుక్తి, కొంచెం సైన్సు, బోలెడంత సమయస్ఫూర్తి ఉన్నాయనీ... అందుకే ఈ కాకి కథ తరతరాలుగా అలా కొనసాగుతోందని చెప్పా. వాడు ఈ కథను తన పిల్లలకూ చెప్పాలన్న ఆశాభావం వ్యక్తం చేశా. మా బుడ్డోడికి కథ చెబుతూ ఏదో దేశ సేవ చేస్తున్నానన్న ఫీలింగ్‌ను ఓ ప్రశ్నతో ఒక్కసారిగా దెబ్బకొట్టాడు మావాడు. అదేంటంటే...
  ‘‘నాన్నా... కాకి ఇంటెలిజెంటా? లేక నీలాగే మొద్దా?’’ అని అడిగాడు వాడు. ‘‘ఎందుకురా... నీకలాంటి డౌటెందుకు వచ్చింది’’ నోరెండిపోతుండగా అడిగా.
 ‘‘మరి మా ఈవీఎస్ (ఎన్విరాన్‌మెంట్ స్టడీస్) బుక్‌లో ‘బిజీమంత్’ అనే ఒక లెసన్ ఉంది. అందులో ఏ పక్షి ఎలాంటి గూడు కడుతుందో ఉంది. కోయిల గూడు కట్టదట. కాకి గూట్లో అది తన గుడ్లు పెడుతుందట. కాకి వాటిని కూడా గుర్తుపట్టక పొదిగి, పిల్లలు పుట్టాక కూడా కొంతకాలం పెంచుతుందని ఉంది. మరి అప్పుడు కాకి ఇంటెలిజెంట్ అంటూ నువ్వు చెప్పిన కథ రాంగ్ కదా? అది నీలాగే మొద్దే కదా’’ అంటూ లాజిక్ పాయింట్ తీశాడు.
 నాకేం చెప్పాలో అర్థం కాలేదు. మళ్లీ వాడే అందుకున్నాడు.
 ‘‘నీకు మ్యాథ్స్ రావని చెబుతుంటావు కదా. అలాగే తాను ఎన్ని గుడ్లు పెట్టిందో... ఎగస్ట్రా మరెన్ని గుడ్లు తోడయ్యాయనే అడిషన్స్ తెలియనప్పుడు, కాకి కూడా నీలాగే డల్ అన్నట్టే కదా’’ అన్నాడు వాడు. దాంతో నన్నూ, కాకినీ ఒకే చేత్తో విదిలించేసినట్లుగా ఫీలై ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయా.
 నా బిక్కమొహం చూసి వాడికే జాలేసినట్లుంది. అందుకే మళ్లీ నన్ను ఓదార్చుతున్నట్లు వాడే ఒక మాట అన్నాడు.
 ‘‘నువ్వు చెప్పిందాన్ని బట్టి నాకొకటి అనిపిస్తోంది నాన్నా...’’ సాలోచనగా అంటున్నట్లు ఒక పోజు పెట్టి... ‘‘కుండ అడుగుకు చేరిన రాయి పరిమాణమూ ఈజీక్వొల్ టూ పైకి లేచిన నీళ్ల పరిమాణమూ అని గుర్తుపట్టింది. గూట్లో  టోటల్ గుడ్లు ఎన్నున్నాయనేది మాత్రం లెక్కపెట్టలేకపోయింది కాబట్టి... కాకి  సైన్సులో సమ్‌వాట్ బెటర్. కానీ మ్యాథ్స్‌లో పూర్ నాన్నా’’ అంటూ తేల్చాడు.
 హమ్మయ్య! మరీ నన్ను కాకిలా తీసిపారేయలేదంటూ నిట్టూర్చేలోపు ఫినిషింగ్ టచ్ ఇలా ఇచ్చాడు...
 ‘‘కాబట్టి... లెక్కలూ, కూడికలూ చక్కగా రాకపోయినా కాకి ఎంతో కొంత ఇంటెలిజెంటే... నీలాగ మొద్దు కాదు’’ అంటూ తేల్చిపారేశాడు. దానికీ కారణం ఉంది.
      *********      
 ‘‘కాకుల రంగు మారి అవి తెల్లగా కావాలంటే ఏం చేయాలో తెలుసా నాన్నా?’’ అడిగాడు వాడు.
 కాకి అంటేనే నాలాగే కారునలుపుగా ఉంటుందని, నలుపు నాణ్యమైనది కాబట్టి ఒక పట్టాన వదిలిపోదని అని వాడికి అర్థమయ్యేలా శాస్త్రీయంగా చెప్పాలని అనుకున్నా. కానీ ఈలోపే వాడు బాంబు పేల్చాడు.
 ‘‘సింపుల్... కాకికి ఫెయిర్ అండ్ లౌలీ రాస్తే సరి’’ అన్నాడు.
 దాంతో నేను ఒకటి నిశ్చయించుకున్నా. ఇకపై మా బుడ్డోడికి కాకమ్మ కథలు  చెప్పొద్దని.
  *********   
 ‘‘నీ తలలో అంతా చెత్తే ఉంది కదా నాన్నా’’ అన్నాడు మా బుడ్డోడు. ఆ దెబ్బకే నేను అద్దిరిపోతుంటే... ‘‘అన్నట్టు నాన్నా ఆ చెత్తనంతా అక్కడికి వెళ్లేలా ఎలా మేనేజ్ చేశావు?’’ అంటూ మళ్లీ ఇంకోప్రశ్న.
 ‘‘ఎందుకురా ఇలా అడిగావు’’ అంటే దానికి ఓ ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు వాడు.
 ఓరోజున... ‘అవ్మూ...! కడుపు నొప్పి’ ఏడుస్తూ వచ్చాడు మావాడు.
 ‘అన్నం తినవు. నేను చేత్తో కలిపి పెడతానన్నా వినవు. ఉంచితే కడుపును ఖాళీగా ఉంచుతావు. లేదంటే... అడ్డమైన చెత్తాచెదారం అందులో పడేస్తావు. ఆ చెత్త  వల్లనే  నీకు ఆ నొప్పి’ అంది మా ఆవిడ మా బుడ్డోడికి కడుపునొప్పి మందు తాగిస్తూ విసుగ్గా.
 ఇదంతా తెలియని నేను మామూలుగా వచ్చేసి ‘అబ్బా... తలనొప్పి, కాస్తంత కాఫీ ఇవ్వు’ అన్నా మా ఆవిడతో.
 అంతే... ‘తల్లోని ఆ ఖాళీ ప్లేస్‌కి చెత్తా చెదారాన్ని ఎలా పంపించగలిగావు నాన్నా.?’ అంటూ బోలెడంత క్యూరియస్‌గా అడిగాడు.
 అక్కడితో ఆగలేదు వాడు... ‘కాకి స్కావెంజర్ అన్నావు కదా... నీ తల మీద పొడిచి లోపలి చెత్తను క్లీన్ చేసే అవకాశం ఉంటుందంటావా?’’ అని అడిగాడు.


 దాంతో అసలు తలనొప్పికి తోడు.. మా బుడ్డోడి షాక్‌తో తగిలిన తలబొప్పితో కణతలూ, తలా ఇత్యాది అవయవాలన్నింటినీ ఏకకాలంలో తడుముకున్నా. ఇకపై ఒక విషయంలో భీషణ ప్రతిజ్ఞ చేసుకున్నా. ఎక్కడ, ఎంతగా నొప్పి వచ్చినా మా బుడ్డోడి ముందు అస్సలు బయట పడొద్దని.
       
 ఇలాంటి ఎన్నో సంఘటనల తర్వాత నాకు అర్థమైన విషయం ఒక్కటే... అవును. నేను నేననుకున్నంత తెలివైన వాడిని కాదు. పైగా ఆ విషయాన్ని పసిగట్టగల పసివాడు కాని పసివాడు మా బుడ్డోడు. అందుకే వాడికి కథలూ, కబుర్లూ చెబితే అవి నా పట్ల కాకరకాయలవుతున్నాయి. అందుకే వాడికి కాకమ్మ కథలూ, కబుర్లూ, పాఠాలు, గీఠాలూ చెప్పకుండా ఉండేందుకు వీలుగా, నేను ఇంటికి వెళ్లేసరికి వాడు పడుకుని ఉండేలా... రాత్రి డ్యూటీలున్న జర్నలిస్టు ఉద్యోగం చేస్తున్నందుకు లోలోపల హ్యాపీగా ఫీలవుతుంటా. బయటకు మాత్రం ‘‘అదేం ఉద్యోగం లెండి. పెళ్లాం పిల్లలతో గడుపుదామంటే టైమే ఉండదు. మా బుడ్డోడికి లెసన్స్  చెబుదామంటే వీలే ఉండదు’’ అంటూ పత్తిత్తు కబుర్లు చెబుతూ ఉంటా.

 - యాసీన్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement