
అయోధ్య: యూపీలోని రామజన్మభూమి అయోధ్య(Ram Janmabhoomi Ayodhya)లో బాలరాముణ్ణి దర్శించుకునే వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయని రామమందిర ట్రస్ట్ తెలిపింది. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరిగిన సమయంలో అక్కడి నుంచి వస్తున్న భక్తుల సౌకర్యార్థం అయోధ్య రామాలయాన్ని ప్రతీరోజూ 19 గంటల పాటు తెరిచివుంచారు. ఇప్పుడు ఈ దర్శన సమయాన్ని తగ్గించారు.
మహాకుంభమేళా(Mahakumbh Mela) జరిగిన సమయంలో ప్రతీరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ భక్తులకు రామ్‌లల్లా దర్శనం కల్పించారు. ఇప్పుడు ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ముగిసిన దరిమిలా అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య కొంతమేరకు తగ్గింది. ఈ నేపధ్యంలో రామజన్మ భూమి తీర్థ ట్రస్ట్ గతంలో మాదిరిగానే దర్శనాల సమయాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో ఇకపై రామభక్తులకు అయోధ్యలో ప్రతీరోజూ 19 గంటలపాటు దర్శనం లభించదని ట్రస్ట్ తెలిపింది.
రామాలయ ట్రస్ట్(Ramalaya Trust) సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ఇకపై ప్రతీరోజూ మంగళ హారతి ఉదయం 4 గంటలకు జరుగుతుందని, ఆ తర్వాత 4:15 నుండి 6 గంటల వరకు తలుపులు మూసివేస్తారన్నారు. తిరిగి ఉదయం ఆరు గంటలకు మరో హారతి ఉంటుందని, అనంతరం భక్తులు 6:30 నుండి 11:50 వరకు దర్శనాలు చేసుకోవచ్చన్నారు. తరువాత ఆలయ తలుపులను మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేస్తారన్నారు.
మధ్యాహ్న రాజభోగం 12 గంటలకు ఉంటుందని, హారతి అనంతరం దర్శనం 12.30 వరకు ఉంటుందని, ఆ తరువాత ఆలయ తలుపులను ఒంటి గంట వరకు మూసివేస్తారన్నారు. అనంతరం సాయంత్రం 6:50 వరకు దర్శనాలు ఉంటాయన్నారు. తరువాత రాత్రి 7 గంటల వరకు తలుపులు మూసివేస్తారని, సాయంత్రం 7 గంటలకు హారతి అనంతరం రాత్రి 9:45 వరకు బాలరాముని దర్శనం ఉంటుందన్నారు. 9:45 నుండి 10 వరకు తలుపులు మూసివేస్తారని, ఆ సమయంలో బాలరామునికి విందు వడ్డిస్తారన్నారు. శయన హారతి అనంతరం రాత్రి 10:15కు ఆలయ తలుపులు మూసివేస్తారన్నారు.
ఇది కూడా చదవండి: World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ
Comments
Please login to add a commentAdd a comment