ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు
* ప్రాణలు ఫణంగా పెట్టి.. సమయస్ఫూర్తితో వ్యవహరించి..
* 58 మంది ప్రయాణికులు సురక్షితం
రాజుపాలెం, న్యూస్‌లైన్: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సమయస్ఫూర్తితో స్టీరింగ్‌ను నియంత్రిస్తూ బస్సులోనే కుప్పకూలి మృతిచెందాడు. బస్సులో ఉన్న 58 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడి తాను మాత్రం కానరాని లోకాలకు తరలిపోయారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం బస్టాండ్ సెంటర్‌లో గురువారం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల డిపోకు చెందిన బస్సు(ఏపీ21జెడ్81 నంబరు)కు డ్రైవర్‌గా ఎస్.డి.దస్తగిరి(54), కండక్టర్‌గా నారయ్య బుధవారం మధ్యాహ్నం 1.40 గంటలకు డ్యూటీ ఎక్కారు. గుంటూరు వెళ్లి అక్కడి నుంచి దుర్గి మండలం లోయపల్లిలో నైట్ హాల్ట్ చేశారు.
ఉదయాన్నే గుంటూరుకు బయలుదేరే సమయంలో డ్రైవర్ తనకు రాత్రి రెండు మూడుసార్లు విరేచనాలు అయ్యాయని, నీరసంగా ఉన్నట్లు కండక్టర్‌కు తెలిపారు. బస్సు గుంటూరు చేరుకుని తిరిగి పిడుగురాళ్ల బయలుదేరింది. మార్గమధ్యలో సత్తెనపల్లి బస్టాండ్‌కు చేరుకోగానే నీరసంగా ఉందంటూ డ్రైవర్ కొబ్బరినీళ్లు తాగారు. ధూళిపాళ్ల దాటిన తరువాత ఛాతిలో నొప్పిగా ఉందని బస్సును నెమ్మదిగా నడపడంతో.. రెడ్డిగూడెంలో వైద్యుడు ఉన్నారని, త్వరగా వెళితే అక్కడ చూపించుకోవచ్చని ఓ ప్రయాణికురాలు సలహా ఇచ్చి, 108కు ఫోన్ చేశారు. గుండెనొప్పితో బాధపడుతూనే దస్తగిరి పంటిబిగువున బస్సును రెడ్డిగూడెం బస్టాండ్ సెంటర్ వరకు పోనిచ్చి నిలిపారు. సీటులోంచి లేవబోయిన డ్రైవర్ కుప్పకూలి ప్రాణాలొదిలాడు.