క్రైం (కడప అర్బన్) : ఎర్రచందనం కూలీలకు ఆర్టీసీ డ్రైవర్లు చేయందించారు. కూలీలను వివిధ ప్రాంతాలకు చేరవేడంలో సహకరించారు. ఈ విషయం తమ విచారణలో వెల్లడైందని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ తెలిపారు. కడప జోన్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన కొన్ని బస్సుల డ్రైవర్లు బస్సుల్లో చెన్నై నుంచి కోయంబేడ్ ప్రాంతం వద్ద తమిళ కూలీలను ఎక్కించుకుని జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, కుక్కలదొడ్డి అడవుల వద్దకు చేర్చేవారని నిర్ధారణ అయిందన్నారు.
తమిళ కూలీలను అరెస్టు చేసినపుడు వారి వద్ద ఉన్న బస్సు టిక్కెట్ ఆధారంగా ఆర్టీసీ డ్రైవర్ల ప్రమేయం ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. 11 మంది ఆర్టీసీ డ్రైవర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఐదుగురు తమిళనాడుకు చెందిన కూలీలను సోమవారం సాయంత్రం రాజంపేట-రాయచోటి మార్గంలోని రోళ్లమడుగు రహదారి వద్ద అరెస్టు చేసి విచారించగా ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర ఉన్నట్లు తెలిసిందన్నారు. కూలీల నుంచి రూ.3.30 లక్షల విలువైన 110 కిలోలున్న ఐదు దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన డైవర్లు కూలీలను తరలించడంలో సహకరించారన్నారు. ఇందులో నంద్యాల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ అక్బర్ హుస్సేన్ (54) కీలకపాత్ర పోషించాడన్నారు. ఇతను తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు మధ్యవర్తులుగా ఉండి కూలీలను చెన్నైలోని కోయంబేడు బస్టాండుకు తీసుకు వస్తారని, అక్కడినుంచి ఆర్టీసీ డ్రైవర్లు అక్బర్ హుసేన్, మిగతా డ్రైవర్లు వారినికర్నూలుకు చెందిన పలు సర్వీసుల ద్వారా రాజంపేట, రైల్వేకోడూరు, కుక్కలదొడ్డి వద్దకు కూలీలను మూకుమ్మడిగా తీసుకొచ్చి చేర్చేవారన్నారు. కూలీలను తరలించేందుకు డ్రైవర్లు రూ.1000 నుంచి రూ. 2000 తీసుకునే వారన్నారు. అక్రమాలకుపాల్పడిన ఆర్టీసీ డ్రైవర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని పేర్కొన్నారు.
స్మగ్లర్ల అరెస్టు, ఎర్రచందనం స్వాధీనం
జిల్లాలోని మైదుకూరు రూరల్ పరిధిలో బ్రహ్మంగారిమఠం లింగాలదిన్నె గ్రామంలో భూమిరెడ్డి ప్రతాప్‌రెడ్డి తోటలో దాచిన 75 లక్షల విలువైన 45 దుంగలతోపాటు ముగ్గురు స్మగ్లర్లను, ఖాజీపేట పోలీసుస్టేషన్ పరిధిలోని కోనవారిపల్లె అటవీ ప్రాంతంలో ఆరుగురు ఎర్రచందనం మేస్త్రీ, కూలీలను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
వారి నుంచి రూ. లక్ష విలువైన అయిదు దుంగలను, ఎద్దుల బండిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బి.మఠం మండలం లింగాలదిన్నెలో స్వాధీనం చేసుకున్న డంప్‌లో లింగాల దిన్నెకు చెందిన భూమిరెడ్డి మురళీమోహన్‌రెడ్డి (36), అనంతపురం జిల్లా తాడిమర్రికి చెందిన బండి శివ (35), వనిపెంటకు చెందిన బండారు నరసింహులు (25)లను అరెస్టు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. భూమిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, వజ్రాల సురేష్ పరారీలో ఉన్నారన్నారు. ఖాజీపేట పోలీసుస్టేషన్ పరిధిలో దుంగలను స్వాధీనం చేసుకున్న కేసులో తవ్వా ఓబుల్‌రెడ్డి అలియాస్ మసాల, త్యాగం మాధవరెడ్డి, నలుగురు కూలీలను అరెస్టు చేశామన్నారు.
అలాగే ఒంటిమిట్ట పరిధిలోని పట్రపల్లె సమీపంలోని జర్రిబోడు వద్ద ఒంటిమిట్ట మండలం కోనరాజుపల్లెకు చెందిన మల్లికార్జున (22) అనే స్మగ్లర్‌తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 170 కిలోల బరువున్న నాలుగు దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మోటారు సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారన్నారు. రైల్వేకోడూరు సీఐ మురళీధర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు రామచంద్ర, శివప్రసాద్ కోడూరు మండలం బాలుపల్లె సమీపంలో తుండుకొండ చెక్‌డ్యాం వద్ద దుంగలు తరలిస్తుండగా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 338 కిలోల బరువున్న రూ. 6.76 లక్షలు విలువైన 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
పోస్టర్ల విడుదల
ఎర్రచందనం కూలీలను హెచ్చరిస్తూ ఎస్పీ పోస్టర్లను విడుదల చేశారు. ఎర్రచందనం నరికితే తీసుకునే కఠిన చర్యలను అందులో తెలియజేశారు. ఏఎస్పీ విజయకుమార్, రాజంపేట డీఎస్పీ అరవిందబాబు, మైదుకూరు డీఎస్పీ శ్రీధర్‌రావు, సీఐలు వెంకటేశ్వర్లు, నాగభూషణం, రెడ్డెప్ప, మురళీదర్, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎర్ర కూలీలకు డ్రైవర్లు సహకారం
Published Wed, Dec 3 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement