సాక్షి ప్రతినిధి, కడప: ‘రక్తాన్నైనా చిందిస్తాం...ప్రజల మాన, ప్రాణాలను రక్షిస్తాం’ అనే స్ఫూర్తిని పోలీసుబాస్‌లు విస్మరిస్తున్నారు. ఆదాయం ఉంటే అక్రమార్కులతో చేతులు కలపడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. నవ్విపోదురుగాక నాకేటి అన్నట్లుగా అందివచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా పయనిస్తున్నారు.
రాజ్యాంగ బద్దుడినై.. రాగ ద్వేషాలకు అతీతంగా, చట్టానికి లోబడి విధులు నిర్వర్తిస్తామని బాధ్యతలు స్వీకరించేముందు పోలీసులు ప్రమాణం చేస్తారు. బాధ్యతలు చేపట్టగానే తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా శ్రేయస్సుకంటే ఆదాయం లభించే పోలీసుస్టేషన్‌పై దృష్టిపెడుతున్నారు. అందుకు లకారాలను ముట్టుజెబుతున్నారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్లతో చెలిమి చేసిన 21 మంది పోలీసు అధికారులపై వేటుపడింది. ఓ దొంగతో చోరీలు చేయించిన ఘనత సైతం జిల్లా పోలీసులకు దక్కింది. కిడ్నాపర్ సునీల్ ముఠాతో మరికొంతమంది పోలీసు అధికారులు త్సంబంధాలు కొనసాగించారు.
సంచలనం రేపిన కేసుల్లో కన్పించని పురోగతి....
రాష్ట్రంలో సంచలనం రేపిన అనేక కేసులను జిల్లాలోని కొందరు పోలీసు అధికారులు నీరుగార్చుతున్నారు. అలాంటి కోవలో డీసీఓ చంద్రశేఖర్ కిడ్నాప్ కేసును చెప్పుకోవచ్చు. సహకార ఎన్నికల అనంతరం డీసీసీబ్యాంకు పాలకమండలి ఎంపిక (గత ఏడాది ఫిబ్రవరి20న) సందర్భంగా ఎన్నికల అధికారి అయిన డీసీఓ కిడ్నాప్ ఉదంతం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈఘటనలో అప్పటి అధికారపార్టీ నేతల ప్రమేయం ప్రత్యక్షంగా ఉంది. గుట్టు చప్పుడు కాకుండా అధికార పార్టీ నేతలు సూచించిన ముగ్గురిని అరెస్టు చేసి మమ అన్పించారు. ఏడాది తర్వాత ’కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా’ ఛార్జిషీట్ దాఖలు చేశారు. అలాగే విద్యాధికురాలైన లలితారాణి (అగ్రికల్చర్ ఎమ్మెస్సీ) హత్యోందతాన్ని సైతం నీరుగార్చారు. రాజంపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు దోపిడీ కేసులో ఎలాంటి పురోగతి లేకపోయింది.
అసాంఘీక కార్యకలాపాలకు పడని బ్రేక్ ...!
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్స్‌తో పాటు మట్కా కంపెనీలను యధేచ్ఛగా నిర్వహిస్తున్నారు. వీటి వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా కొందరు పోలీసు అధికారులు, త్రీస్టార్ బాస్‌ల ఐడీ పార్టీలు ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు ఉన్నతాధికారులు వీటిని కట్టడి చేయాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ క్రింది స్థాయి యంత్రాంగం ఏ మాత్రం సహకరించడం లేదు. ఆకస్మిక దాడులు చేయాలని భావిస్తే అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి క్షణాలలో తెలిసిపోవడమే ఇందుకు ఉదాహరణగా పోలీసు వర్గాలే వెల్లడిస్తున్నాయి.
అదాయవనరులపై ప్రత్యేక దృష్టి...
జిల్లాలోని కొందరు పోలీసు అధికారులకు ప్రకృతి సంపద సైతం అక్రమ ఆదాయవనరుగా మారింది. ఇటీవల ఇసుక, ఎర్రచందనం విషయంలో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉండడంతో ప్రస్తుతం సెటిల్‌మెంట్లలో నిమగ్నమయ్యారు. అందివచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా కొందరు డబుల్, త్రిబుల్ స్టార్ అధికారులు తలమునకలవుతున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే డబ్బుంటేనే పోలీసుస్టేషన్‌కు వెళ్లాలనే భావనను కలుగజేస్తున్నారు. సివిల్ కేసుల్లో సైతం ఉన్నతాధికారులకు పిటీషన్ పెట్టించడం, దాని ఆధారంగా దండుకోవడం రివాజుగా మారింది. సివిల్ కేసుల్లో తలదూర్చమంటూ బోర్డులు పెట్టుకున్న చోటే యధేచ్ఛగా పంచాయితీలు నడుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇటీవల సీఐల బదిలీలు అయ్యాయి. స్టేషన్‌లో రిపోర్టు చేసుకుంటూనే కొందరు అధికారులు సివిల్ పంచాయితీలలో తలదూర్చి లబ్ధిపొందే ఎత్తుగడలకు పాల్పడినట్లు తెలుస్తోసంది. జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీ శాంతి భద్రతల పరిరక్షణకోసం కృషి చేస్తున్నప్పటికీ కిందిస్థాయి యంత్రాంగంలో ఆశించిన మార్పు కన్పించడంలేదని పలువురు చెప్పుకొస్తున్నారు.
దోస్త్ మేరా దోస్త్
Published Mon, Dec 22 2014 3:37 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM
Advertisement
Advertisement