సాక్షి,కడప : టన్నులకు టన్నుల ఎర్రచందనం రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. వందల కొద్దీ కూలీలు ఆడవుల్లోకి చొరబడి ఎర్ర బంగారాన్ని నరికేస్తున్నారు. రోజూ ఏదో ఓ మూలన ఎర్ర చందనం పట్టుబడటం, దాన్ని నరికి తరలించే కూలీలను ఆరెస్టు చేయడం రివాజుగా మారింది. కూలీలను జైళ్లకు పంపిస్తున్న అధికారులు సూత్రధారులను వలపన్ని పట్టుకుందామనే ఆలోచన చేయడం లేదు.
రూ. కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని బడా స్మగ్లర్లు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నా టాస్క్‌ఫోర్స్, అటవీశాఖ అధికారులు మాత్రం కూలీలపైనే తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. అధికంగా కేసులు చూపించుకోవడం, అడవిలోకి దిగుతున్న కూలీలను స్మగ్లర్లుగా చూపుతూ జైలుకు పంపడం తప్ప అసలు స్మగ్లర్లపై నిఘా వేయడం లేదు. గతంలో అసలు సూత్రధారులపై నిఘా పెట్టడంతోపాటు పీడీ యాక్టులు పెట్టి ఊచలు లెక్కింపజేసిన అధికారులు ఉన్నారు. వారికి సహకరించిన అటవీ, పోలీసుశాఖ అధికారులను సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ చొరవే కరవవుతోంది. కూలీల అరెస్ట్‌తోనే అధికారులు సరిపెట్టుతుండటంతో స్మగ్లింగ్‌కు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.
దాడులకు తెగబడుతున్న కూలీలు
ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణకు తిరుపతి కేంద్రంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. చిత్తూరు, వైఎస్సార్‌జిల్లాల ఎస్పీలతోపాటు అటవీశాఖ అధికారులతో కలిసి స్మగ్లింగ్‌పై ప్రత్యేక నిఘాతోపాటు నివారణ చర్యలు చేపట్టాలి. దీనికోసం ఓఎస్‌డీ స్థాయి అధికారిని కూడా ఏర్పాటు చేశారు. అయినా తమిళనాడు నుంచి వస్తున్న ఎర్రచందనం కూలీలు మాత్రం అధికారులపై ఇప్పటికీ దాడులకు దిగుతునే ఉన్నారు.
రాళ్లు రువ్వడం, కొన్నిచోట్ల ఆయుధాలతో కాల్పులకు దిగడం రివాజుగా మారింది. దీనిలో భాగంగానే ఇద్దరు అటవీ అధికారులు మృతి చెందారు. వీరికి చెట్లు కొట్టేపని అప్పజెప్పుతున్నది ఎవరు.. తుపాకులు ఇస్తున్నది ఎవరు.. అనే అంశాలపై లోతైన విచారణ సాగడం లేదు. వాస్తవానికి తమిళనాడు నుంచి రైళ్లలో వందలాది మంది కూలీలు వస్తున్నారన్న సమాచారం తెలుసుకోవడంతోనే అధికారులు ఇక తమ పని అయిపోయిందని భావిస్తున్నారు. దాని ఫలితంగా ఒకరి తర్వాత ఒకరు కూలీలు వస్తున్నారు. అధికారులపై దాడులు చేస్తూనే ఉన్నారు.
రాజకీయ ముసుగులో బడా స్మగ్లర్లు
కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన బడా స్మగ్లర్లు రాజకీయ ముసుగులో యథేచ్చగా తిరుగుతున్నారనేది జగమెరిగిన సత్యం. దీనికి తోడు ఇక్కడి నుంచి రవాణా చేసిన తర్వాత ఎవరు ఆ ఎర్రచందనాన్ని కొనుగోలు చేస్తున్నారు.. ఇతర దేశాలకు ఎలా తరలిస్తున్నారనే విషయమై విచారణ చేయాల్సి ఉంది. మూలాల్లోకి వెళితే అక్రమ రవాణాను అడ్డుకోగలమనే భావన అందరిలో కనిపిస్తున్నా రాజకీయ పలుకుబడి వీరిని కట్టిపడేస్తున్నదనేది నగ్నసత్యం.
కూలీలు సరే...సూత్రధారుల మాటేమిటో..!
Published Thu, May 29 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
Advertisement
Advertisement