జైపాల్ అనే కరుడుగట్టిన ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ పట్టుబడ్డాడు. హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లా నవరంగ్‌పూర్‌లో జిల్లాకు చెందిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు.
కడప క్రైం : జైపాల్ అనే కరుడుగట్టిన ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ పట్టుబడ్డాడు. హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లా నవరంగ్‌పూర్‌లో జిల్లాకు చెందిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై శనివారం కడపకు తీసుకువచ్చారు. ఇతని వివరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ మీడియాకు వివరించారు. జిల్లాలోని బొడ్డె పెద్ద వెంకట రమణ, జంగాల శివశంకర్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఫయాజ్ షరీఫ్, రియాజ్ షరీఫ్, ఫైరోజ్‌ఖాన్, ముక్తియార్ ఖాన్‌ల వద్ద నుంచి ఇతను ఎర్రచందనం దుంగలను కొనుగోలు చేసేవాడు.
వాటితో పూసల దండలు తయారు చేసి చైనా తదితర దేశాలకు ఎగుమతి చేసేవాడు. ఇప్పటిదాకా రూ.60-70 కోట్ల విలువైన దుంగలను తరలించాడు. ఇప్పటికే ఇతనిపై ఓబులవారిపల్లె, పెండ్లిమర్రి పోలీసుస్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఇతని అరెస్టులో కీలకపాత్ర పోషించిన పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, టాస్క్‌ఫోర్స్ సీఐ రాజేంద్రప్రసాద్, రైల్వేకోడూరు సీఐ రసూల్‌సాహెబ్, ఎస్‌ఐలు శివశంకర్, ఎస్‌కే రోషన్, రాజరాజేశ్వరరెడ్డి తదితరులను ఎస్పీ అభినందించారు.