అడవి నిండా స్మగ్లర్లే
►వారాల తరబడి కొండా కోనల్లో మకాం
►అదును చూసి వన సంపదపై వేటు
►నలు దిశలా యథేచ్ఛగా అక్రమ రవాణా
►టాస్క్‌ఫోర్స్ కదలికలపై స్మగ్లర్ల ముందస్తు నిఘా
►ఎదురు పడితే దాడి... క్షణాల్లో కనుమరుగు
►రాత్రింబవళ్లూ కొనసాగుతున్న కూంబింగ్
అడవి తల్లి కన్నీరు పెడుతోంది. కొండల మధ్య పెరుగుతున్న ఎర్ర కూలీల అరాచకాలకూ, అక్రమ రవాణాకు తల్లడిల్లుతోంది. టన్నుల కొద్దీ తరలిపోతున్న ఎర్రచందనాన్ని కాపాడుకోలేక విలవిలలాడుతోంది. పోలీసుల కూంబింగ్ జరుగుతున్నా తెలివిగా తప్పించుకుంటోన్న స్మగ్లర్ల మాయాజాలానికి మూగగా రోదిస్తోంది. మారుతున్న మంత్రులు, ఏడాదికోసారి జరిపే సమీక్షలు, తీసుకునే నిర్ణయాలూ స్మగింగ్‌ను ఏ మాత్రం ఆపలేకపోతున్నాయని పదేపదే ఆక్రోశిస్తోంది.
తిరుపతి : స్మగ్లర్ల గొడ్డళ్ల వేటుకు శేషాచలం నిలువెల్లా వణికిపోతోంది. తిరుపతి, భాకరాపేట, పీలేరు, తలకోన, కరకంబాడి ప్రాంతాలతో పాటు కడప జిల్లా రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో శేషాచలం విస్తరించి ఉంది. రెండు వారాలుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో టాస్క్‌ఫోర్స్, పోలీస్, అటవీ పోలీసుల తనిఖీలు పగటి పూట తగ్గాయి. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళ స్మగ్లర్లు వ్యూహాత్మకంగా అడవిలోకి ప్రవేశిస్తున్నారు. తమిళనాడు నుంచి బస్సుల్లో, కారుల్లో వచ్చే వందలాది మంది ఎర్ర కూలీలు, స్మగ్లర్లు వాటర్ బాటిళ్లు, బియ్యం. పప్పు, బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్, తినుబండారాలతో పాటు పదునైన గొడ్డళ్లు, రంపాలతో అడవిలోకి ప్రవేశిస్తున్నారు.
ప్రధానంగా భాకరాపేట, శ్రీవారిమెట్లు, కరకంబాడి, మామండూరు ప్రాంతా ల్లో ఉన్న కాలి బాటల ద్వారా ఫారెస్టులోకి ప్రవేశిస్తున్న స్మగ్లర్లు మేకలిబండ, సచ్చినోడిబండ, చీకటీగలకోన ప్రాంతాల్లోని కొండ రాళ్లు, చిన్నచిన్న గుహల్లో రోజుల కొద్దీ తలదాచుకుంటూ పగటి పూట ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారు. సుమారు 10 నుంచి 20 చెట్లు నరికాక వాటిని రవాణా చేసే పనుల్లో పడుతున్నారు. అక్రమ రవాణా సమయంలో పోలీసులు ఎదురు పడితే దుంగలను కింద పడేసి అడవిలోకి పారిపోతున్నారు. రోజుకు వంద మందికి పైగా ఎర్ర కూలీలు అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నారని అంచనా. అన్ని ప్రాంతాల్లోనూ సుమారు వెయ్యిమందికి పైగా ఎర్ర కూలీలు అడవిలోనే ఉంటారని పోలీసుల అంచనా.
పారిపోయే వారే ఎక్కువ...
శేషాచలంలో తిరుపతి టాస్క్‌ఫోర్స్ కూంబింగ్ పెరిగింది. మొత్తం 4 బృందాలు ఆయుధాలతో అడవిలో స్మగ్లర్ల కోసం జల్లెడ పడుతున్నాయి. అయితే వీరి రాకను ముందే పసిగడుతున్న స్మగ్లర్లు పోలీసుల కన్నుగప్పి రాళ్లు, గుబురు చెట్ల మధ్య తలదాచుకుంటున్నారు. కొంత మంది తప్పించుకోలేక పోలీసులకు చిక్కుతున్నారు. అయితే పోలీసులకు దొరికేవారి కంటే తప్పించుకుని అడవిలోకి పారిపోయే వారే ఎక్కువ.
పటిష్ట ప్రణాళికలు కరువు...
ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను నిలువరించే విషయంలో ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది. పటిష్టమైన ప్రణాళికలు లేకపోవడం, సరిపడ సిబ్బందిని, ఆయుధాలను సమకూర్చలేకపోవడమే కారణమని తెలు స్తోంది. తిరుపతి టాస్క్‌ఫోర్సుకు కేటాయించిన సిబ్బందిని పూర్తిగా సమకూర్చే విషయంలో సర్కారు మూడేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. ఈ లోగా ఇటీవలనే అటవీ శాఖకు కొత్త మంత్రి వచ్చారు. సీఎంతో చర్చించిన మీదట అదనపు బలగాల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ఈ లోగా జరగాల్సిన స్మగ్లింగ్ మొత్తం జరుగుతూనే ఉంది.
దుంగలు రోజూ దొరుకుతూనే ఉన్నాయ్...
రోజూ ఎక్కడో ఒక చోట టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న ఎర్ర చందనం దుంగలు పెరిగిన స్మగ్లింగ్‌ను తేట తెల్లం చేస్తున్నాయి. దుంగలు దొరుకుతున్నాయి గానీ, వాటిని రవాణా చేసే ఎర్ర కూలీలు, స్మగ్లర్లు మాత్రం దొరకడం లేదు. దీంతో కోట్ల విలువ చేసే వన సంపద యథేచ్ఛగా సరిహద్దులు దాటుతూనే ఉంది. దీనికి ముగింపు ఎలా పలకాలో పోలీసులకు అర్థం కావడం లేదు.