నలుగురు ఎర్ర స్మగ్లర్లు అరెస్ట్
11 దుంగల స్వాధీనం
ఉదయగిరి : ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి, తరలించేందుకు సిద్ధంగా 11 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ జి.హరినాథ్‌బాబు తెలిపారు. ఆయన ఉదయగిరి అటవీ రేంజ్ కార్యాలయం లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన 30 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ లారీలో నెల్లూరు నుంచి వైఎస్సార్ జిల్లా బద్వేల్ మండలం ద్వారా వెలుగొండ అడవుల్లోకి ప్రవేశించారన్నారు.
సీతారామపురం మండలంలో దేవమ్మ చెరువు బీట్ పరిధిలో దున్నపోతుల గుండం, కణితిల సిరి ప్రాంతాల్లో చొరపడ్డారని సమాచారం అందిందన్నారు. దీంతో తిరుపతి టాస్క్‌ఫోర్స్, పోలీస్, అటవీ శాఖ సిబ్బంది సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించామన్నారు. తరలించేందుకు సిద్ధంగా ఉన్న 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు స్మగ్లర్లు సెల్వకుమార్, ఎలుమలై, సత్యరాజు, కుమార్‌ను అరెస్ట్ చేశామన్నారు. ఉదయగిరి రేంజ్ అధికారి వెంకటేశ్వరరావు, సీఐ శ్రీనివాసరావు, టాస్క్‌ఫోర్స్ రేంజ్ అధికారి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.