డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణం): సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు... వస్తువులు ఏమైనా దొరికితే మెల్లగా జేబులో పడేసేవారు కొందరు. దొరికిన సొమ్ము పోలీసులకు అందజేస్తే నొక్కేస్తారేమోనన్న భయంతో వారికి అందజేయకుండా ఉండిపోయిన వారు మరికొందరు. దొరికిన సొమ్ము/వస్తువులు పోగొట్టుకున్న వ్యక్తులకు అందజేయాలన్న తపన ఇంకొందరిది. ఈ కోవకే చెందుతారు విజయవాడ గవర్నర్‌పేట్ ఆర్టీసీ డిపో డ్రైవర్లు. డబ్బులు, బ్యాంకు ఏటీఎం కార్డులు పోగొట్టుకున్న ఆర్టీసీ ప్రయాణికుడికి అందజేసి వారి నిజాయితీ నిరూపించుకోవడమే గాక ఆర్టీసీకి పేరు తెచ్చిపెట్టారు. వివరాల్లోకి వెళ్తే... విశాఖపట్నం కోటపాడు మండలం కె.గుల్లేపల్లికి చెందిన షేక్ రసూల్ ఈ నెల 2న సాయంత్రం విశాఖ వచ్చేందుకు విజయవాడ – విశాఖపట్నం బస్సు (సర్వీస్ నంబరు 95449, ఏపీ16జెడ్0227))లో ప్రయాణం చేశారు. సీటు నంబరు 30లో కూర్చున్నారు.
విశాఖపట్నం ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద ఆ ప్రయాణికుడు బస్సు దిగిపోయారు. ఆతృతగా దిగిన ఆ వ్యక్తి తను కూర్చున్న సీటులో మనీపర్స్, ఏటీఎం కార్డులు మరచిపోయారు. విశాఖపట్నం ద్వారకా బస్సు స్టేషన్‌కు ఆ బస్సు చేరింది. బస్సు దిగినప్పుడు డ్రైవర్లు ఎం.వి.కాసులు(ఎంప్లాయి నంబరు 370550), ఎం.దానయ్య (ఎంప్లాయి నంబరు 371520) బస్సును పరిశీలించారు. సీటు నంబరు 30లో ప్రయాణికుడు మరచిపోయిన మనీపర్సును గుర్తించారు. ఆ మనీపర్సులో రూ.8,500 నగదు, ఏటీఎం కార్డులు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉన్నాయి. వాటిని ఆ డ్రైవర్లు ఇద్దరూ భద్రపరచి మనీపర్సు పోగొట్టుకున్న రసూల్‌కు ఫోన్‌చేసి ద్వారకా బస్టేషన్‌కు పిలిపించి వాటిని స్టేషన్ మేనేజర్ ద్వారా మంగళవారం అందజేసి నిజాయితీ చాటుకున్నారు. డ్రైవర్ల నిజాయితీని ఇటు ప్రయాణికుడు, అటు ఆర్టీసీ మేనేజర్ అభినందించారు.
ఆర్టీసీ డ్రైవర్ల నిజాయితీ
Published Wed, Oct 4 2017 10:12 AM | Last Updated on Wed, Oct 4 2017 10:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment