గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస దాడులపై ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహించారు. మూడు రోజుల క్రితం సయ్యద్ అలీ చబుత్రాలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని శుక్రవారం మధ్యాహ్నం...
చాంద్రాయణగుట్ట: గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస దాడులపై ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహించారు. మూడు రోజుల క్రితం సయ్యద్ అలీ చబుత్రాలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని శుక్రవారం మధ్యాహ్నం మరో డ్రైవర్‌పై దాడి చేయడంతో కార్మికులు మెరుపు ధర్నాకు దిగారు. మధ్యాహ్నం నుంచి డిపోలోని ఒక్క బస్సును కూడా కదలనివ్వలేదు సరికదా, గ్రేటర్ హైదరాబాద్‌లోని ఏ డిపో బస్సు కూడా పాతబస్తీకి రాకుండా యూనియన్ల నాయకులు నిర్ణయం తీసుకున్నారు.
ఫలక్‌నుమా డిపోకు చెందిన 162 బస్సులు మధ్యాహ్నం నుంచి డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వివరాలివీ..ఫలక్‌నుమా డిపోనకు చెందిన కేశంపేట రూట్ బస్సును శుక్రవారం మధ్యాహ్నం డ్రైవర్ మహమూద్ చార్మినార్ వైపు తీసుకెళుతున్నాడు. శంషీర్‌గంజ్ వద్దకు రాగానే గుర్తు తెలియని యువకులు బస్సుపైకి రాళ్లు రువ్వారు. దీంతో డ్రైవర్ తలకు గాయమైంది. వెంటనే బస్సును నిలిపి కిందికి దిగిన డ్రైవర్‌ను ద్విచక్ర వాహనంతో ఢీ కొట్టి పరారయ్యారు. బాధితుడు విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన డిపో మేనేజర్, తోటి కార్మికులు బస్సును డిపోకు తీసుకొచ్చి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై శాలిబండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ధర్నాకు దిగిన కార్మికులు
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి విషయం తెలుసుకున్న వెంటనే ఫలక్‌నుమా డిపోకు చెందిన కార్మికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లనీయకుండా గేట్ ముందు బైఠాయించారు. యూనియన్ల నాయకులు రంగంలోకి దిగి అన్ని డిపోలకు ఈ సమాచారాన్ని చేరవేశారు. దాడులతో సిబ్బంది అభద్రతాభావానికి గురవుతున్నారని వివరించారు.
పాత నగరానికి ఒక్క బస్సును కూడా తీసుకురాకుండా చూడాలని చెప్పడంతో ఇతర డిపోల బస్సులు అటు రాలేదు. ఈ సందర్భంగా యూనియన్ల నాయకులు ఎం.వి.నాథ్, సోమ్‌లాల్, ప్రభాకర్ రెడ్డి, ఆర్.ఎన్.రెడ్డి, జమీర్, హనీఫ్‌లు విలేకర్లతో మాట్లాడుతూ దాడులతో తాము ఉద్యోగాలు చేయలేకపోతున్నామన్నారు. చితకబాదడం సరైంది కాదన్నారు. ఆర్టీసీ కార్మికులకు రక్షణ ఇస్తామని స్పష్టమైన హామీ వచ్చేంత వరకు విధుల్లోకి చేరబోమని వారు స్పష్టం చేశారు.
సంయమనం పాటించాలి: డిపో మేనేజర్
ప్రమాదాల సమయంలో స్థానిక ప్రజలు సంయమనం పాటించాలని డిపో మేనేజర్ బి.రమేష్ కోరారు. సయ్యద్ అలీ చబుత్రాలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని సిబ్బందిపై దాడులు చేసి ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేయడం సరి కాదన్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై పోలీసులకు ఫిర్యాదులు చేయాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదన్నారు.