
గోవిందరావుపేట: ‘మేము కేసు పెట్టేదాకా చూడాలె.. అంతేగానీ వాళ్లతో.. వీళ్లతో పైరవీలు చేయిస్తార్రా? అంటూ పస్రాకు చెందిన యువకులపై అటవీశాఖ డిప్యూటీ రేంజర్ మైసయ్య జులుం ప్రదర్శించాడు. కార్యాలయానికి పిలిపించి కర్రతో చావబాదాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పస్రాలో గురువారం జరిగింది. 18 రోజుల క్రితం నాలుగు ఎడ్లబండ్లలో కలపతరలిస్తుండగా, అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా డిప్యూటీ రేంజర్ మైసయ్య నిందితులను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. దీంతో ఆ యువకులు ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు.
వారి కోసం ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్లు వస్తుండడంతో డిప్యూటీ రేంజర్‌కు కోపమొచ్చింది. గురువారం నిందితులు బైరబోయిన నరేశ్, పులుగుజ్జు సురేశ్, దామ సారంగంను కార్యాలయానికి పిలిపించిన ఆయన చితకబాదాడు. వారిలో సురేశ్, సారంగంలకు తీవ్ర గాయాలు కాగా, వారు పస్రా సీఐ బాలాజీకి ఫిర్యాదు చేశారు. వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయమై డిప్యూటీ రేంజర్ మైసయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా, తాను వారిని కొట్టాననటం నిజం కాదన్నారు. కలప స్మగ్లింగ్ వెనుక వేరే వ్యక్తులు ఉన్నారని, వారి వివరాలు చెప్పాలని ప్రశ్నించినట్లు తెలిపారు. కాగా, అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసిన కేసులో ఈ ఇద్దరు ఇప్పటికే నిందితులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment