ఆబిద్ అలీ అస్తమయం
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఆబిద్ అలీ (83) కన్నుమూశారు. సుదీర్ఘ కాలంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఆయన అక్కడే తుది శ్వాస విడిచారు. 1960వ, 1970వ దశకాల్లో భారత క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆబిద్ అలీ అంతర్జాతీయ కెరీర్ ఎనిమిదేళ్ల పాటు సాగింది. 1967–1975 మధ్య కాలంలో భారత్ తరఫున 29 టెస్టుల్లో ఆయన 20.36 సగటుతో 1018 పరుగులు చేశారు.ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మీడియం పేసర్ అయిన అలీ 42.12 సగటుతో 47 వికెట్లు కూడా పడగొట్టారు. ఆయన వన్డే కెరీర్ 5 మ్యాచ్‌లకే పరిమితమైంది. 5 వన్డేలు కలిపి ఆయన 93 పరుగులు చేయడంతోపాటు 7 వికెట్లు తీసుకున్నారు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆబిద్ అలీకి ఘనమైన రికార్డు ఉంది. ఏకంగా 212 మ్యాచ్‌లు ఆడిన ఆయన 8732 పరుగులు చేయడంతో పాటు 397 వికెట్లు తీశారు. రిటైర్మెంట్ తర్వాత ఆబిద్ అలీ కొన్నేళ్ల పాటు విరామం తీసుకున్నారు. ఆ తర్వాత కోచింగ్ వైపు మళ్లారు. ఆంధ్ర రంజీ టీమ్‌తో పాటు యూఏఈ, మాల్దీవ్స్ జట్లకు ఆబిద్ అలీ కోచ్‌గా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించారు. అమెరికాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న తర్వాత అక్కడి నార్త్ అమెరికా క్రికెట్ లీగ్‌లో ఆటను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. చాలా విషాదకర వార్త. ఆబిద్ అలీ జట్టు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే దమ్మున్న క్రికెటర్. మిడిలార్డర్లో ఆడుతున్నప్పుడు కూడా జట్టు అవసరం కోసం ఓపెనింగ్‌కు కూడా సిద్ధమయ్యాడు. భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో లెగ్ సైడ్‌లో అతను అందుకున్న చురుకైన క్యాచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. టెస్టుల్లో తొలి బంతికే అతను వికెట్ తీసిన రెండు సందర్భాలు నాకు గుర్తున్నాయి. నా తొలి టెస్టులో వికెట్ల మధ్య అతను చురుగ్గా పరుగెత్తిన తీరు ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం నాకు బాగా గుర్తుంది. వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మనిషి. – సునీల్ గావస్కర్హైదరాబాదీ ఆల్‌రౌండర్‘ఆబిద్ అలీ తరహా ఆటకు వన్డే క్రికెట్ సరిగ్గా సరిపోయింది. ఈ ఫార్మాట్లో అతను అత్యుత్తమ ఆటగాడిగా నిలిచేవాడు. కానీ దురదృష్టవశాత్తూ 20 ఏళ్లు ముందుగా అతను పుట్టాడు’... ఆబిద్ అలీ గురించి, ఆయన ఆట గురించి బాగా తెలిసిన సన్నిహితులు చెప్పే మాట ఇది. స్ప్రింటర్లో ఉండే చురుకుదనం, మారథాన్ రన్నర్ తరహాలో శ్రమించే తత్వం, డెకాథ్లెట్ తరహాలో పట్టుదల ఆయనలో కనిపించేది. ఆటపరంగా చూస్తే మీడియం పేస్ బౌలింగ్, లోయర్ ఆర్డర్లో వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం, అద్భుత ఫీల్డింగ్‌తో ఒక వన్డే క్రికెటర్‌కు కావాల్సిన అన్ని అర్హతలు ఆబిద్లో ఉండేవి. వికెట్ల మధ్య పరుగెత్తే చురుకుదనం గురించి ప్రత్యేక ప్రశంస వినిపించేది. అవతలి ఎండ్‌లో ఆబిద్ ఉంటే సహచర బ్యాటర్ కూడా ఆయనతో పోటీ పడి పరుగెత్తలేక జాగ్రత్త పడేవాడు. సౌత్‌జోన్ తరఫున ఆడుతున్నప్పుడు దిగ్గజం గుండప్ప విశ్వనాథ్‌కు కూడా ఇదే అనుభవం ఎదురై రనౌట్ కావాల్సి వచ్చింది. అయితే ఆబిద్ వన్డే కెరీర్ వేర్వేరు కారణాలతో 5 మ్యాచ్‌లకే పరిమితమైంది. భారత జట్టు తొలి వన్డే మ్యాచ్ (1974 జూలై 13న, ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో) ఆడిన జట్టులో భాగంగా ఉన్న ఆయన తొలి బంతిని బౌల్ చేసిన చిరస్మరణీయ ఘనతను సొంతం చేసుకున్నారు. తొలి వన్డే వరల్డ్‌కప్‌లో (1975) భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 బంతుల్లో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచినా... అనూహ్యంగా అదే ఆఖరి వన్డే కూడా అయింది. ఇవన్నీ కూడా భారత జట్టుకు తొలి ఐదు వన్డేలే కావడం గమనార్హం. మరచిపోలేని ప్రదర్శనలు... 1971లో ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు తొలిసారి టెస్టు సిరీస్ నెగ్గింది. తొలి రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగియగా, ఓవల్‌లో జరిగిన చివరి టెస్టులో గెలిచి భారత్ సిరీస్ సొంతం చేసుకుంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో చివరి రోజు ‘విన్నింగ్ షాట్’ బౌండరీ కొట్టిన బ్యాటర్‌గా ఆబిద్ అలీ అందరికీ గుర్తుండిపోయారు. 1971లో వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారత్ గెలిచి ఆపై తొలిసారి సిరీస్ సొంతం చేసుకున్న చిరస్మరణీయ టెస్టులో వరుస బంతుల్లో రోహన్ కన్హాయ్, క్లయివ్ లాయిడ్లను అవుట్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అదే సిరీస్‌లో జార్జ్‌టౌన్ టెస్టులో చేసిన అజేయ అర్ధ సెంచరీ కూడా ఆయన బ్యాటింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఆడిన 29 టెస్టుల్లో 7 టెస్టుల్లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేయడంతో పాటు ఓపెనింగ్ బౌలర్‌గా కూడా ఆడిన ఘనత ఆబిద్ అలీ సొంతం. అరంగేట్రంలోనే సత్తా చాటి... హైదరాబాద్‌లో స్కూల్ క్రికెట్ ద్వారా వెలుగులోకి వచి్చన గత తరం క్రికెటర్లలో ఆబిద్ అలీ ఒకరు. స్కూల్ టోర్నీల్లో ప్రదర్శన ద్వారా హైదరాబాద్ జూనియర్ జట్టులోకి, ఆపై ఉద్యోగరీత్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తరఫున ప్రదర్శనతో హైదరాబాద్ సీనియర్ టీమ్‌లోకి ఆయన ఎంపిక అయ్యారు. దేశవాళీలో నిలకడైన ప్రదర్శన ఆబిద్ అలీకి భారత జట్టులో చోటు దక్కేలా చేసింది. 1967లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో టెస్టుతో ఆయన కెరీర్ మొదలైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ ప్రదర్శనతో ఆయన అరంగేట్రం చేశారు. ఇదే సిరీస్‌లో సిడ్నీ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో 78, 81 స్కోర్లతో టాప్ స్కోరర్‌గా తన ముద్ర వేస్తూ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటారు. ఆ తర్వాత వరుసగా ఏడేళ్ల పాటు ఆబిద్ కెరీర్ నిరాటంకంగా సాగింది. తన మీడియం పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఆబిద్‌కు అప్పటి పరిస్థితుల్లో పెద్దగా బౌలింగ్ చేసే అవకాశాలు రాలేదు. ప్రఖ్యాత భారత స్పిన్ చతుష్టయం శాసిస్తున్న ఆ రోజుల్లో మీడియం పేసర్లు ఆరంభంలో కొన్ని ఓవర్లు బౌలింగ్ వేసి బంతిని కాస్త పాతబడేలా చేయడమే ఉండేది. అక్కడితోనే వారి పని ముగిసేది. అయితే బ్యాటింగ్‌లో మాత్రం చాలా సందర్భాల్లో ఆబిద్ తన ముద్ర వేశారు. ముఖ్యంగా జట్టు అవసరాల కోసం 1 నుంచి 9 వరకు (నాలుగో స్థానం మినహా) అన్ని స్థానాల్లో ఆయన బ్యాటింగ్ చేశారు.