సాక్షి, అమరావతి: ఆర్టీసీ డ్రైవర్లకు డబుల్ డ్యూటీ బాధ తప్పింది. డబుల్ డ్యూటీలను రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు అందాయి. దీంతో రీజినల్ మేనేజర్లు డబుల్ డ్యూటీలు రద్దు చేసి డ్రైవర్లకు లింకు డ్యూటీలు వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా డిపోల్లో అధికారులు లింకు డ్యూటీలపై యూనియన్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. లింకు డ్యూటీలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సును జగ్గయ్యపేట వరకు ఓ డ్రైవరు తీసుకొస్తే, అక్కడి నుంచి మరో డ్రైవరు తీసుకెళ్లేలా డ్యూటీలు వేయనున్నారు.
డబుల్ డ్యూటీలతో డ్రైవర్లకు విశ్రాంతి లేకుండా బస్సులను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని యాజమాన్యం నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో వాటిని రద్దు చేస్తున్నారు. డ్రైవర్లను డబుల్ డ్యూటీలకు అధికారులు బలవంతంగా పంపుతున్నారు. ఆ డ్యూటీకి వెళ్లకుంటే లీవు కూడా ఇవ్వని పరిస్థితి పలు డిపోల్లో నెలకొంది. మోటారు వాహన చట్టం ప్రకారం బస్సు నడిపే డ్రైవరుకు ప్రతి గంటకు 15 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. కానీ ఆర్టీసీలో డ్రైవర్లకు విశ్రాంతి లేకుండా డ్యూటీలకు పంపుతున్నారు. ఉదయం ఆరు గంటలకు విజయవాడ నుంచి ఒంగోలు మీదుగా నెల్లూరు వెళ్లే డ్రైవరు సాయంత్రం ఆరు గంటలకు తిరిగి విజయవాడకు చేరుకుంటారు. మళ్లీ రాత్రి పది గంటలకు అదే డ్రైవరు హైదరాబాద్‌కు వెళ్లాలి. చెన్నై, బెంగుళూరు దూర సర్వీసులకు కూడా ఒక్క డ్రైవరే వెళుతుండటం గమనార్హం.
ఆర్టీసీలో 800 డ్రైవర్ల పోస్టులు ఖాళీ
13 జిల్లాల్లోని డిపోల్లో మొత్తం 800 డ్రైవర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయకుండా ఇన్నాళ్లూ డ్రైవర్లకు డబుల్ డ్యూటీలు వేశారు. డబుల్ డ్యూటీలకు గాను ఒక్కో డ్రైవరుకు రూ. 350, కండక్టర్‌కు రూ.300 ఇచ్చేవారు. చట్టం ప్రకారం ఓటీ చేస్తే రూ.1,200 ఇవ్వాలి. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రెండేళ్ల క్రితం ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ కింద 200 మంది డ్రైవర్లను తీసుకున్నారుకానీ, ఇంతవరకు వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లను ఇప్పటివరకు 700 మందిని తొలగించారు.
అధ్వానంగా విశ్రాంతి గదులు
రాష్ట్రంలో డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు ఒక్క విజయవాడ మినహా ఇతర చోట్ల విశ్రాంతి గదులు అధ్వానంగా ఉన్నాయి. డ్రైవర్లకు విశ్రాంతి గదులను నిర్మిస్తామని మేనేజ్‌మెంట్ చెబుతున్నా.. ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. చెన్నై, బెంగళూరు వెళ్లే డ్రైవర్లకు సరైన విశ్రాంతి గదులు లేక ఇబ్బందిపడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్‌లోనూ, బీహెచ్‌ఈఎల్‌లోనూ విశ్రాంతి గదులు అధ్వానంగా ఉన్నాయని డ్రైవర్లు వాపోతున్నారు.
ఆర్టీసీ డ్రైవర్ల డబుల్ డ్యూటీలు రద్దు!
Published Mon, Nov 6 2017 4:05 AM | Last Updated on Mon, Nov 6 2017 3:42 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment