శుక్రవారం సాయంత్రం 5:18 గంటలు.. 64 కి.మీ. వేగంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వోల్వో రాజధాని బస్సు వెనుక నుంచి ఓ ట్యాంకర్‌ను బలంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ చనిపోగా ముగ్గురు ప్రయాణికులు గాయమపడ్డారు. ఇంకా చీకటి పడనప్పటికీ డ్రైవర్ ట్యాంకర్‌ను గుర్తించలేకపోవడం గమనార్హం.
శనివారం తెల్లవారుజాము 2:20 గంటలు.. విజయవాడ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి ప్రాంతం.. గంటకు 80 కి.మీ. వేగంతో రాజధాని వోల్వో బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్.. ఆగి ఉన్న లారీని గమనించక వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: వరుస డ్యూటీలతో డ్రైవర్ల నిద్రలేమి, తీవ్ర అలసట, పని ఒత్తిడి వల్ల ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత ఆరు నెలల్లో దా దాపు 300 వరకు బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా గంటల వ్యవధిలో రెండు రాజధాని బస్సులు ప్ర మాదానికి గురై రెండు బస్సుల డ్రైవర్లు దుర్మరణం చెందడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే అన్ని డిపోల్లో గేట్ మీటింగ్స్ ఏర్పాటు చేసి డ్రైవర్లలో అవగాహన కల్పించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు.
లెక్క తప్పినా...
ఆర్టీసీ కొన్ని దశాబ్దాల క్రితమే శాస్త్రీయ అధ్యయనంతో ఓ నిబంధన ప్రవేశపెట్టింది. దీని ప్రకారం బస్సు–డ్రైవర్ల దామాషా 1:2.6. అంటే ప్రతి 10 బస్సులకు 26 మంది డ్రైవర్లు ఉండాలి. మూడు షిఫ్టుల్లో బస్సు నడవాలంటే అందరు డ్రైవర్లు ఉండాల్సిందే. డ్రైవర్ల సెలవులను దృష్టిలో పెట్టుకొని ఈ దామాషా రూపొందించారు. కానీ ప్రస్తుతం 10 బస్సులకు 23 మంది మాత్రమే ఉన్నారు.
టీఎస్‌ఆర్టీసీలో ప్రస్తుతం 6,375 బస్సులు ఉండగా వాటికి 14,894 మంది డ్రైవర్లు ఉన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం నేపథ్యంలో ఇటీవలే దాదాపు 400 మంది డ్రైవర్లకు అసిస్టెంట్ డిపో క్లర్కులుగా పదోన్నతి కల్పించారు. దీంతో వారి సంఖ్య అంతమేర తగ్గింది. అయినప్పటికీ అప్పటికప్పుడు సెలవుల్లో ఉన్న వారితోపాటు అనారోగ్యం నుంచి ఇంకా కోలుకోని వారికి, డ్యూటీ దిగిన వారికి డబుల్ డ్యూటీలు చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు.
అలాంటి పరిస్థితిలో డ్యూటీకి వచ్చిన డ్రైవర్లు నడిపే బస్సులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయిన డ్రైవర్ పగలు ఓ వేడుకలో ఎక్కువ సేపు గడిపి నేరుగా డ్యూటీకి వచ్చినట్లు తెలిసింది. దీంతో అతనికి కావాల్సినంత నిద్ర లేకుండా పోయింది.
తీవ్ర ఒత్తిడిలో డ్రైవర్లు..
కొన్ని గంటలపాటు బస్సును నడపటమే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం. ఇది చాలదన్నట్లు డబుల్ డ్యూటీలు వేస్తుండటంతో డ్రైవర్లు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల ఓ డ్రైవరు 7–8 గంటలపాటు డ్రైవింగ్ అనంతరం తాను తీసుకుంటున్న చికిత్సలో భాగంగా మాత్ర వేసుకొని నిద్రపోయాడు. కానీ డ్రైవరు కొరతతో అధికారులు అతనికి డబుల్ డ్యూటీ వేశారు.
అయితే తాను మాత్ర వేసుకున్నందున నిద్ర వస్తుందంటూ డ్యూటీకి డ్రైవర్ నిరాకరించడంతో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని కారి్మక సంఘాలు పేర్కొంటున్నాయి. డబుల్ డ్యూటీ చేయకుంటే చర్యలు తీసుకుంటున్నారన్న భయంతో విధులకు వెళ్లకతప్పని పరిస్థితి వారికి ఎదురవుతోందంటున్నారు. ఇది ప్రమాదాలకు కారణమవుతోందన్నది వారి మాట.
ఆదాయం కోసం...
ఆర్టీసీ యాజమాన్యం 100 రోజుల ఫెస్టివల్ చాలెంజ్ పేరుతో డిపోలవారీగా ఆదాయాన్ని పెంచుకొనేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తోంది. దీంతో ఫిట్‌గా లేడన్న కారణంతో డ్రైవర్లకు డ్యూటీలు వేయకుండా కొన్ని బస్సు ట్రిప్పులను రద్దు చేస్తే ఇది తమ రీజియన్ పరిధిలో ఆదాయంపై ప్రభావం చూపుతుందని ఉన్నతాధికారులు డిపో మేనేజర్లపై ఒత్తిడి పెంచుతున్నారు.
దూరప్రాంతాలకు బస్సులు ఎక్కువగా తిప్పే డిపోల్లో ఒకటైన బీహెచ్‌ఈఎల్ డిపోకు చెందిన బస్సులు ఏడాది కాలంలో ఎక్కువ ప్రమాదాలకు గురయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక విజయవాడ దారిలో ప్రమాదానికి గురైన బస్సు కూడా ఆ డిపోదే కావటం గమనార్హం.
గుర్తించే పద్ధతి ఏది?
దూరప్రాంతాలకు డ్రైవింగ్‌కు వెళ్లి వచ్చాక ఆ డ్రైవర్ తగినంత నిద్రపోవాల్సి ఉంటుంది. అందుకే అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేశారు. నిద్రలేమి ఉంటే ఆ విషయాన్ని అధికారులకు చెప్పాలి. అతని పరిస్థితిని పరిశీలించాకే బస్సును కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఆర్టీసీలో ప్రస్తుతం ఆ పద్ధతి అమలు కావట్లేదు. మద్యం తాగాడా లేదా అన్నది మాత్రమే బ్రీథ్ అనలైజర్‌తో తనిఖీ చేస్తున్నారు తప్ప మిగతా విషయాలను గుర్తించలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment