రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? | RTC exercise towards reducing compensation burden | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది?

Jun 24 2024 3:53 AM | Updated on Jun 24 2024 3:53 AM

RTC exercise towards reducing compensation burden

స్వయంగా శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలు సేకరించనున్న ఆర్టీసీ

ఓ అంతర్జాతీయ సంస్థతో అవగాహన

ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్న పుణెకు చెందిన నిపుణులు

పరిహార భారం తగ్గించుకునే దిశగా కసరత్తు

ఆర్టీసీ బస్సు ఢీకొని  చనిపోయిన సందర్భాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేయటం సహజం. వారి దర్యాప్తు నివేదిక ఆధారంగానే కోర్టులు  తీర్పులు చెబుతాయి .  అయితే ఆ ప్రమాదానికి గల కారణాలపై స్వయంగా ఆర్టీసీ కూడా ఆధారాలు సేకరించి కోర్టులకు సమర్పించాలని నిర్ణయించింది. 

ప్రమాదానికి కారణాలేంటి, అందులో ఆర్టీసీ డ్రైవర్‌ తప్పు లేనప్పుడు.. ప్రమాదానికి ఎదుటివారు ఎలా కారణమయ్యారు? రెండు వైపులా తప్పు ఉంటే.. ప్రమాద తీవ్రతలో ఆర్టీసీ డ్రైవర్‌ తప్పిదం ఎంత.. తదితర వివరాలను శాస్త్రీయంగా సేకరించబోతోంది. దీనికోసం పుణె కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ ప్రారంభించింది.

కొన్ని నెలల క్రితం నగరంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆర్టీసీ బస్సు ఢీకొని చనిపోయాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నందున అతని సంపాదన పెద్దదే. దీంతో అతని కుటుంబానికి ఆర్టీసీ రూ.కోటిన్నర వరకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. సంపాదనతో ప్రమేయం లేకున్నా, ఓ మనిషి చనిపోతే కనిష్టంగా రూ.20 లక్షల వరకు పరిహారం చెల్లించాల్సిన  పరిస్థితి ఉంది.

సాక్షి, హైదరాబాద్‌: రోడ్లు నెత్తురోడుతున్నాయి. పెరిగిన ట్రాఫిక్, అధునాతన వాహనాల వినియోగం, రోడ్డుభద్రత నియమాల ఉల్లంఘన.. వెరసి ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సుల వాటా కూడా ఉంటోంది. తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఢీకొని సంవత్సరానికి సగటున 250 మంది నుంచి 300 మంది వరకు చనిపోతున్నారు. ప్రమాదం జరగ్గానే బస్సు డ్రైవర్‌దే తప్పు అన్న భావన సగటు వ్యక్తిలో కలుగుతుంది. 

పోలీసు విభాగంలో కూడా ఇదే తరహా ముందస్తు భావన కలుగుతోంది. దీన్నే ‘బిగ్‌ వెహికిల్‌ సిండ్రోమ్‌’గా పరిగణిస్తారు. ద్విచక్రవాహనదారు తప్పిదం వల్లనే ప్రమాదం చోటు చేసుకున్నా.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదవుతోంది. సరైన ఆధారాలు లేని సందర్భాల్లో ఆర్టీసీ డ్రైవర్‌కు శిక్ష పడటంతోపాటు, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి సంస్థ భారీగా పరిహారం చెల్లించాల్సి వస్తోంది. 

ఏడాదికి రూ.100 కోట్లు పరిహారం
నాలుగేళ్ల క్రితం నాటి ప్రమాదాల తాలూకు పరిహారాలు ఇప్పుడు (కోర్టు కేసులు ముగిసిన తర్వాత) చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఆ మొత్తం సగటున ఏడాదికి రూ.100 కోట్ల వరకు ఉంటోంది.. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాల్లో మృతి చెందిన వారికి పరిహారం చెల్లించేనాటికి ఆ మొత్తాం రూ.150 కోట్ల వరకు చేరుకుంటుందని అంచనా. అసలే నష్టాల్లో కుదేలవుతున్న ఆర్టీసీకి ఇది పెద్ద భారంగా మారబోతోంది. దానిని భారీగా తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది.

డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నా...  
రోడ్డు ప్రమాదాలను నిరోధించేందుకు డ్రైవర్లకు ఆర్టీసీ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది. ఎప్పటికప్పుడు వారిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది, డిపో స్థాయిలో గేట్‌ మీటింగ్స్‌ ద్వారా డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు అవగాహన కల్పిస్తోంది. అయినా.. ప్రమాదాలు తప్పటం లేదు. 

ప్రమాదాలకు ఆధారాలు సేకరించడంపైనే..
హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమె­రాలు ఉన్నందున.. ప్రమాదానికి కారణాలేంటో స్పష్టంగా తెలుస్తుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ తప్పులేనప్పుడు సీసీటీవీ ఫుటేజీని కోర్టుల్లో ప్రవేశపెట్టి పరిహారం నుంచి బయటపడొచ్చు. కానీ సీసీటీవీ కెమెరాలు లేని ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో, బస్సు డ్రైవర్‌ తప్పు లేకు­న్నా, పెద్ద వాహనం అన్న భావనతో కారణం బస్సు డ్రైవర్‌ మీదకే వస్తోందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. 

ఇలాంటి సందర్భాల్లో ఎదుటి వాహన­దారులు/పాదచారుల తప్పిదంతో ప్రమాదం జరిగి వారు చనిపోతున్నా ఆర్టీసీ డ్రైవర్‌కు శిక్ష పడుతోంది, ఆర్టీసీ పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదానికి కారణాల ఆధారాలను శాస్త్రీయంగా సేకరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ విషయంలో మంచి అనుభవం ఉన్న జేపీ రీసెర్చ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఆర్టీసీ అవగాహన కుదుర్చుకుంది. కోయంబత్తూరు, పూణె కేంద్రాలుగా ఈ సంస్థ నడుస్తోంది. 

పు­ణె కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ నిపుణులు తాజాగా ఆర్టీసీ అధికారులకు ఈ విషయంలో శిక్షణ మొదలు­పెట్టారు. సీసీటీవీ కెమెరాలు లాంటివి లేని ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు.. ప్రమాదానికి కారణా­లను శాస్త్రీయపద్ధతిలో ఎలా గుర్తించాలి అన్న విషయంలో నిపుణులు శిక్షణ కార్యక్రమాల ద్వారా వెల్లడిస్తు­న్నారు. దాదాపు 500 అంశాల ఆధారంగా ప్రమాదానికి కారణాలను కచ్చితంగా గుర్తించే వీలుంటుందని, ఆయా అంశాలు ఐదు భాగాలుగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంటూ వాటిల్లో ముఖ్యమైన అంశాల వారీగా అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. 

డిపో మేనేజర్లు, ట్రాఫిక్‌ సీఐలను మూడు జట్లుగా విభజించి శిక్షణ ఇస్తున్నారు. ఇందులో తొలిదఫా శిక్షణ మూడు రోజులు కొనసాగింది. శిక్షణలో పాల్గొన్న అధికారులు వారివారి డిపోల్లోని ఇతర సిబ్బంది వాటిపై అవగాహన కల్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement