Double duty
-
నిద్రలేమి.. అయినా డ్యూటీ!
శుక్రవారం సాయంత్రం 5:18 గంటలు.. 64 కి.మీ. వేగంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వోల్వో రాజధాని బస్సు వెనుక నుంచి ఓ ట్యాంకర్‌ను బలంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ చనిపోగా ముగ్గురు ప్రయాణికులు గాయమపడ్డారు. ఇంకా చీకటి పడనప్పటికీ డ్రైవర్ ట్యాంకర్‌ను గుర్తించలేకపోవడం గమనార్హం. శనివారం తెల్లవారుజాము 2:20 గంటలు.. విజయవాడ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి ప్రాంతం.. గంటకు 80 కి.మీ. వేగంతో రాజధాని వోల్వో బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్.. ఆగి ఉన్న లారీని గమనించక వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సాక్షి, హైదరాబాద్: వరుస డ్యూటీలతో డ్రైవర్ల నిద్రలేమి, తీవ్ర అలసట, పని ఒత్తిడి వల్ల ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత ఆరు నెలల్లో దా దాపు 300 వరకు బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా గంటల వ్యవధిలో రెండు రాజధాని బస్సులు ప్ర మాదానికి గురై రెండు బస్సుల డ్రైవర్లు దుర్మరణం చెందడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే అన్ని డిపోల్లో గేట్ మీటింగ్స్ ఏర్పాటు చేసి డ్రైవర్లలో అవగాహన కల్పించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. లెక్క తప్పినా... ఆర్టీసీ కొన్ని దశాబ్దాల క్రితమే శాస్త్రీయ అధ్యయనంతో ఓ నిబంధన ప్రవేశపెట్టింది. దీని ప్రకారం బస్సు–డ్రైవర్ల దామాషా 1:2.6. అంటే ప్రతి 10 బస్సులకు 26 మంది డ్రైవర్లు ఉండాలి. మూడు షిఫ్టుల్లో బస్సు నడవాలంటే అందరు డ్రైవర్లు ఉండాల్సిందే. డ్రైవర్ల సెలవులను దృష్టిలో పెట్టుకొని ఈ దామాషా రూపొందించారు. కానీ ప్రస్తుతం 10 బస్సులకు 23 మంది మాత్రమే ఉన్నారు. టీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 6,375 బస్సులు ఉండగా వాటికి 14,894 మంది డ్రైవర్లు ఉన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం నేపథ్యంలో ఇటీవలే దాదాపు 400 మంది డ్రైవర్లకు అసిస్టెంట్ డిపో క్లర్కులుగా పదోన్నతి కల్పించారు. దీంతో వారి సంఖ్య అంతమేర తగ్గింది. అయినప్పటికీ అప్పటికప్పుడు సెలవుల్లో ఉన్న వారితోపాటు అనారోగ్యం నుంచి ఇంకా కోలుకోని వారికి, డ్యూటీ దిగిన వారికి డబుల్ డ్యూటీలు చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో డ్యూటీకి వచ్చిన డ్రైవర్లు నడిపే బస్సులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయిన డ్రైవర్ పగలు ఓ వేడుకలో ఎక్కువ సేపు గడిపి నేరుగా డ్యూటీకి వచ్చినట్లు తెలిసింది. దీంతో అతనికి కావాల్సినంత నిద్ర లేకుండా పోయింది. తీవ్ర ఒత్తిడిలో డ్రైవర్లు.. కొన్ని గంటలపాటు బస్సును నడపటమే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం. ఇది చాలదన్నట్లు డబుల్ డ్యూటీలు వేస్తుండటంతో డ్రైవర్లు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల ఓ డ్రైవరు 7–8 గంటలపాటు డ్రైవింగ్ అనంతరం తాను తీసుకుంటున్న చికిత్సలో భాగంగా మాత్ర వేసుకొని నిద్రపోయాడు. కానీ డ్రైవరు కొరతతో అధికారులు అతనికి డబుల్ డ్యూటీ వేశారు. అయితే తాను మాత్ర వేసుకున్నందున నిద్ర వస్తుందంటూ డ్యూటీకి డ్రైవర్ నిరాకరించడంతో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని కారి్మక సంఘాలు పేర్కొంటున్నాయి. డబుల్ డ్యూటీ చేయకుంటే చర్యలు తీసుకుంటున్నారన్న భయంతో విధులకు వెళ్లకతప్పని పరిస్థితి వారికి ఎదురవుతోందంటున్నారు. ఇది ప్రమాదాలకు కారణమవుతోందన్నది వారి మాట. ఆదాయం కోసం... ఆర్టీసీ యాజమాన్యం 100 రోజుల ఫెస్టివల్ చాలెంజ్ పేరుతో డిపోలవారీగా ఆదాయాన్ని పెంచుకొనేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తోంది. దీంతో ఫిట్‌గా లేడన్న కారణంతో డ్రైవర్లకు డ్యూటీలు వేయకుండా కొన్ని బస్సు ట్రిప్పులను రద్దు చేస్తే ఇది తమ రీజియన్ పరిధిలో ఆదాయంపై ప్రభావం చూపుతుందని ఉన్నతాధికారులు డిపో మేనేజర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. దూరప్రాంతాలకు బస్సులు ఎక్కువగా తిప్పే డిపోల్లో ఒకటైన బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన బస్సులు ఏడాది కాలంలో ఎక్కువ ప్రమాదాలకు గురయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక విజయవాడ దారిలో ప్రమాదానికి గురైన బస్సు కూడా ఆ డిపోదే కావటం గమనార్హం. గుర్తించే పద్ధతి ఏది? దూరప్రాంతాలకు డ్రైవింగ్‌కు వెళ్లి వచ్చాక ఆ డ్రైవర్ తగినంత నిద్రపోవాల్సి ఉంటుంది. అందుకే అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేశారు. నిద్రలేమి ఉంటే ఆ విషయాన్ని అధికారులకు చెప్పాలి. అతని పరిస్థితిని పరిశీలించాకే బస్సును కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఆర్టీసీలో ప్రస్తుతం ఆ పద్ధతి అమలు కావట్లేదు. మద్యం తాగాడా లేదా అన్నది మాత్రమే బ్రీథ్ అనలైజర్‌తో తనిఖీ చేస్తున్నారు తప్ప మిగతా విషయాలను గుర్తించలేకపోతున్నారు. -
బాబోయ్ డ్యూటీనా?
ఖమ్మంమామిళ్లగూడెం: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో పనిచేస్తున్న డ్రైవర్లపై ఇటీవల కాలంలో పనిభారం అధికమవుతోంది. సిబ్బంది కొరతతో అదనంగా విధులు నిర్వహించాల్సి వస్తోందని, అలసిపోతున్నామని, ఒత్తిడితో ఆందోళన చెందుతున్నామని కొందరు ఆవేదన చెబుతున్నారు. ఒక డ్రైవర్చేతనే రెండు మూడు రోజులు డబుల్ డ్యూటీ (డీడీ)ల పేరుతో వరుస డ్యూటీలు చేయించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల తీరుతో అద్దె బస్సుల డ్రైవర్లు వారంపది రోజులు వరుస డ్యూటీలు చేస్తున్నారు. డ్రైవర్లకు విశ్రాంతి తీసుకునే సమయం లేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఖమ్మం రీజియన్‌లో రోడ్డు రవాణా సంస్థకు సిబ్బంది కొరత సమస్య తీవ్రంగా పీడిస్తోంది. డ్రైవర్, కండక్టర్ పోస్టుల ఖాళీలు భర్తీ చేయట్లేదు. రీజియన్‌లో 1117 డ్రైవర్లు విధులు నిర్వహిస్తుండగా 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 1136 కండక్టర్లు విధులు నిర్వహిస్తుండగా, 12 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే..ఇంకా అదనంగానే సిబ్బంది అవసరమవుతారని కార్మిక సంఘాల నాయకులంటు న్నారు. మొత్తం 630 బస్సులకు గాను 600కు పైగా సర్వీసులు నడుస్తున్నాయి. ఈ లెక్క ప్రకా రం 1400 మంది డ్రైవర్లు అవసరం. ఖమ్మం డిపోలో అయితే డ్రైవర్ డ్యూటీ దిగడమే ఆలస్యం గేటువద్ద అధికారులు వారిని అడ్డుకొని అదనపు డ్యూటీ చేస్తే అడిగినప్పుడు సెలవు ఇస్తామని, డీడీ నగదు ఇస్తామని ఆశలు చూపించి డ్రైవర్ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా అదనపు ట్రిప్పులు తిప్పిస్తున్నారు. అనారోగ్యంపాలైన కార్మికుడు సెలవు అడిగితే కుదరదు అంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఓటీలు, డీడీలతో కార్మికులకు విశ్రాంతి అనేది లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికుల్లో అధికశాతంమంది అనారోగ్యాలపాలై ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందనేది బహిరంగ రహస్యమే. అధికారుల అవగాహన లేమి.. రీజియన్ పరిధిలోని డిపోల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులకు రూట్లపై సరైన అవగాహన లేకపోవడంతో కార్మికుల పట్ల శాపంగా మారింది. పలు రూట్లలో కిలోమీటర్లు పెంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు. రోడ్లు బాగాలేకపోయినా సమయం తగ్గించి, కిలోమీటర్లు పెంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఖమ్మం నుంచి రాజమండ్రి, సూర్యాపేట, కోదాడ రూట్లలో తిరగే బసుల సమయం తగ్గించారు. రాజమండ్రి రోడ్డు బాగాలేకపోయినా గతంలో ఉన్న ప్రయాణ సమయం తగ్గించడంతో సకాలంలో చేరుకునేందుకు డ్రైవర్ ఒత్తిడికి గురవుతున్నాడు. 40 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న కోదాడ ప్రాంగణానికి 1:15 గంటల సమయం మాత్రమే ఇవ్వడంతో..స్టాప్ల వద్ద ప్రయాణికులను ఎక్కించుకుంటూ నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేరుకునేందుకు అతివేగంగా వెళ్లి ప్రమాదాల బారినపడుతున్నారు. విశ్రాంతి ఎక్కడ ? సంస్థలోని కార్మికులు రాత్రి, పగలు అనే తేడాలేకుండా విధులు నిర్వహిస్తుంటే..వారు విశ్రాంతి తీసుకునేందుకు సరైన వసతులే లేవు. రిజియన్లో ఆరు డిపోలు ఉండగా వాటిలో సగానికి పైగా విశ్రాంతిగదులు లేనివే. డబుల్ డ్యూటీలు చేసే డ్రైవర్లు ఉన్న గంట, రెండు గంటల సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళా కండక్టర్ల పరిస్థితి మరీ దారుణం. వారికైతే రెస్ట్ రూముల్లో కూర్చునేందుకు కుర్చీలు కూడా ఉండవు. నైట్ అవుట్ బస్సుల డ్యూటీ చేసే కార్మికుల ఇబ్బందులైతే అన్నీఇన్నీ కావు. రాత్రి వేళ..గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపై, పంచాయతీ కార్యాయాల బయట నిద్రిస్తున్నారు. గది సౌకర్యం లేకపోవడంతో విష పురుగుల భయంతో నిద్రలేని రాత్రులను గడపాల్సిన పరిస్థితి పోవట్లేదు. డ్రైవర్లకు శిక్షణే లేదు.. ఆర్టీసీలో పని చేసే డ్రైవర్, కండక్టర్లకు సంస్థ నెలకోమారు డిపోల్లో తరగతులు, 6 నెలలకోసారి రీజియన్ స్థాయిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కానీ..ప్రసతం శిక్షణ తరగతులే లేవు. రెండు సంవత్సరాలుగా డ్రైవర్లకు ట్రైనింగ్ నిలిచిందంటే సంస్థ పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శిక్షణలో ప్రతి కార్మికుడికీ నూతన మెళకువలు నేర్పడంతో పాటు రోడ్డుపై వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తుంటారు. ఇలాంటి తరగతులు లేకపోవడంతో డ్రైవర్లు తమకు ఇస్తున్న బస్సులతో రోడ్లపై ఉన్న ట్రాఫిక్‌ను అధిగమించి పోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఏపీఎస్ఆర్టీసీలో డబుల్ డ్యూటీలు రద్దు!
-
ఆర్టీసీ డ్రైవర్ల డబుల్ డ్యూటీలు రద్దు!
సాక్షి, అమరావతి: ఆర్టీసీ డ్రైవర్లకు డబుల్ డ్యూటీ బాధ తప్పింది. డబుల్ డ్యూటీలను రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు అందాయి. దీంతో రీజినల్ మేనేజర్లు డబుల్ డ్యూటీలు రద్దు చేసి డ్రైవర్లకు లింకు డ్యూటీలు వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా డిపోల్లో అధికారులు లింకు డ్యూటీలపై యూనియన్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. లింకు డ్యూటీలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సును జగ్గయ్యపేట వరకు ఓ డ్రైవరు తీసుకొస్తే, అక్కడి నుంచి మరో డ్రైవరు తీసుకెళ్లేలా డ్యూటీలు వేయనున్నారు. డబుల్ డ్యూటీలతో డ్రైవర్లకు విశ్రాంతి లేకుండా బస్సులను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని యాజమాన్యం నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో వాటిని రద్దు చేస్తున్నారు. డ్రైవర్లను డబుల్ డ్యూటీలకు అధికారులు బలవంతంగా పంపుతున్నారు. ఆ డ్యూటీకి వెళ్లకుంటే లీవు కూడా ఇవ్వని పరిస్థితి పలు డిపోల్లో నెలకొంది. మోటారు వాహన చట్టం ప్రకారం బస్సు నడిపే డ్రైవరుకు ప్రతి గంటకు 15 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. కానీ ఆర్టీసీలో డ్రైవర్లకు విశ్రాంతి లేకుండా డ్యూటీలకు పంపుతున్నారు. ఉదయం ఆరు గంటలకు విజయవాడ నుంచి ఒంగోలు మీదుగా నెల్లూరు వెళ్లే డ్రైవరు సాయంత్రం ఆరు గంటలకు తిరిగి విజయవాడకు చేరుకుంటారు. మళ్లీ రాత్రి పది గంటలకు అదే డ్రైవరు హైదరాబాద్‌కు వెళ్లాలి. చెన్నై, బెంగుళూరు దూర సర్వీసులకు కూడా ఒక్క డ్రైవరే వెళుతుండటం గమనార్హం. ఆర్టీసీలో 800 డ్రైవర్ల పోస్టులు ఖాళీ 13 జిల్లాల్లోని డిపోల్లో మొత్తం 800 డ్రైవర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయకుండా ఇన్నాళ్లూ డ్రైవర్లకు డబుల్ డ్యూటీలు వేశారు. డబుల్ డ్యూటీలకు గాను ఒక్కో డ్రైవరుకు రూ. 350, కండక్టర్‌కు రూ.300 ఇచ్చేవారు. చట్టం ప్రకారం ఓటీ చేస్తే రూ.1,200 ఇవ్వాలి. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రెండేళ్ల క్రితం ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ కింద 200 మంది డ్రైవర్లను తీసుకున్నారుకానీ, ఇంతవరకు వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లను ఇప్పటివరకు 700 మందిని తొలగించారు. అధ్వానంగా విశ్రాంతి గదులు రాష్ట్రంలో డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు ఒక్క విజయవాడ మినహా ఇతర చోట్ల విశ్రాంతి గదులు అధ్వానంగా ఉన్నాయి. డ్రైవర్లకు విశ్రాంతి గదులను నిర్మిస్తామని మేనేజ్మెంట్ చెబుతున్నా.. ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. చెన్నై, బెంగళూరు వెళ్లే డ్రైవర్లకు సరైన విశ్రాంతి గదులు లేక ఇబ్బందిపడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్లోనూ, బీహెచ్‌ఈఎల్‌లోనూ విశ్రాంతి గదులు అధ్వానంగా ఉన్నాయని డ్రైవర్లు వాపోతున్నారు. -
బస్సెక్కాలంటేనే.. భయం భయం
12 లక్షల కి.మీ.లకు పైబడి తిరిగిన ఆర్టీసీ బస్సులు 30 శాతంపైనే ఘాట్‌రోడ్లు, మలుపులు... కానరాని హెచ్చరికలు డ్రైవర్స్ ఏకాగ్రతను దెబ్బతీస్తున్న టిమ్స్ ఓవర్ టైంల పేరుతో డబుల్ డ్యూటీలు.. ఒకప్పుడు ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం.. సుఖమయం... సుఖవంతం అనేవారు. కానీ ఇప్పుడు గాలిలో దీపమవుతోంది. భయం..భయంగా సాగుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక వైపు కాలం చెల్లిన, కండిషన్ లేని బస్సులు..మరొక వైపు రోజురోజుకు పెరుగుతున్న పని ఒత్తిడితో డ్రైవర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ ప్రాణనష్టానికి దారితీస్తున్నది. అనంతపురం జిల్లాలో బస్సు ప్రమాద ఘటనతో ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమా కాదా అన్న అంశంపై సర్వత్రా చర్చ మొదలైంది. విశాఖపట్నం: జిల్లాలో తొమ్మిది ఆర్టీసీ డిపోల పరిధిలో 1017 బస్సులున్నాయి. వీటిలో 650కు పైగా బస్సులు గ్రేటర్ విశాఖ పరిధిలోనే నడుస్తున్నాయి. ఈ బస్సులు ప్రతిరోజు 6.5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. సుమారు లక్షన్నర నుంచి రెండులక్షల మంది వి ద్యార్థులే ఉంటారు. అత్యధిక గి రిజన జనాభా ఉన్న జిల్లా మన ది. ఏజెన్సీలోని పాడేరు, అరకు, చోడవరం, మాడుగుల తదితర పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ప్రతి ఏటా వెళ్లే లక్షలాదిమంది పర్యాటకుల్లో ఎక్కువమంది ఆశ్రయించేది ఆర్టీసీ బస్సులనే. మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహణ ఎలా ఉందో ఓసారి పరిశీలిస్తే... పనిఒత్తిడికి గురవుతున్న డ్రైవర్లు బస్సుల పరిస్థితి ఇలా ఉంటే డ్రైవర్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. గతంలో 8 గంటలు మాత్రమే పనిచేసే వీరు నేడు 10 నుంచి 12 గంటలు ఏకబికిన డ్రైవింగ్ చేస్తూనే ఉంటున్నారు. పైగా రెస్టాఫ్ డ్యూటీలు చేసే వారికి కూడా రెస్ట్ లేకుండా మర్నాడు మళ్లీ డ్యూటీ లు వేసేస్తున్నారు. ఉదాహరణకు గతంలో బెంగుళూరు డ్యూటీ ఐదు రోజులుండేది. దీన్ని నాలుగు రోజులకు కుదించేశారు. ఇక కాకినాడ నాన్ స్టాప్ సర్వీసు నడిపే డ్రైవర్లకు అసలు రెస్టే లేకుండా ఉం టుంది. ఇక ఓవర్ టైంలు.. డబుల్ డ్యూటీల తో డ్రైవర్లకు క్షణం తీరిక చేస్తున్నారు. వీటికితోడు కండక్టర్ల స్థానంలో టికె ట్ ఇష్యూ మిషన్స్ (టిమ్స్) ప్రవేశపెట్టడంతో డ్రైవర్లు ఒత్తిడికి గురవుతున్నారు. ఒక పక్క బస్సులు నడుపుతూనే టికెట్లు ఇచ్చుకోవడం, పైగా నిర్ణీత సమయంలోగా డిపోలకు చేరకుంటే క్రమశిక్షణ చర్యలకు గురికావల్సి వస్తుందనే భయంతో డ్రైవర్లు వలన డ్రైవింగ్‌పై ఏకాగ్రత పెట్టలేక ప్రమాదాలకు గురికావాల్సి వస్తుంది. ఏ ప్ర మాదం జరిగినా బస్సుల కండిషన్, పని ఒత్తిడిని పక్కదారి పట్టించేందుకు ఈ నెపా న్ని డ్రైవర్లపై నెట్టడం పరిపాటిగా మారుతోం దని కార్మిక సంఘ నేతలు వాపోతున్నారు. ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఇలా ఉంటే ప్రైవేటు, స్కూల్ బస్సుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటున్నాయి. కాలం చెల్లిన వాటిని స్కూల్ బస్సులుగా నడుపుతున్న పలు కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. గడిచిన 3 నెలల్లో 21 ప్రైవేటు, స్కూల్ బస్సులను సీజ్ చేయగా, కండిషన్ లేని మరో 30 బస్సులపైగా రవాణా శాఖ కేసులు నమోదు చేసింది. ఆర్టీసీ బస్సులన్నీ కండిషన్లోనే ఉన్నాయని, 12 లక్షల కి లోమీటర్ల పైబడి నడిచిన బస్సులను తొలగిస్తామని ఆర్టీసీ ఆర్ఎం జగదీష్‌బాబు తెలిపారు. ఒకప్పుడు ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం.. సుఖమయం... సుఖవంతం అనేవారు. కానీ ఆ ప్రయాణం భయం..భయంగా సాగుతుంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఒక వైపు కాలం చెల్లిన, కండిషన్ లేని బస్సులు..మరొక వైపు రోజురోజుకు పెరుగుతున్న పని ఒత్తిడితో డ్రైవర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ ప్రాణనష్టానికి దారితీస్తుంది. అనంతపురం జిల్లా జరిగిన బస్సు ప్రమాద ఘటనతో ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమా కాదా అన్న అంశంపై సర్వత్రా చర్చ మొదలైంది. డొక్కు బస్సులతో చిక్కులు యలమంచిలి: అనంతపురం రోడ్డు ప్రమాదం నేపథ్యంలో కాలం చెల్లిన బస్సుల వల్ల ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం వ్యక్తమవుతోంది. ఊడిన బాడీరేకులు, కమాన్‌పట్టీలు, బస్సులో అడుగు భాగాన పడ్డ రంధ్రాలు... ఇలా ఒక్కో డిపోలో కాలం చెల్లిన బస్సుల సంఖ్య పదుల్లోనే ఉంది. ఇవి తరచూ మొరాయిస్తున్నాయి. అప్పుడప్పుడు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఒక్కో బస్సు 9 లక్షల కిలోమీటర్లు నడపాలి. ఇటీవల దీనిని 10 లక్షల కిలోమీటర్లకు పెంచారు. ఎక్స్‌ప్రెస్ బస్సు 12 లక్షల కిలోమీటర్లు నడపాలి. కాలపరిమితి పూర్తవగానే ఇలాంటి బస్సులను సంబంధిత ఆర్టీసీ వర్క్‌షాపునకు పంపాలి. అక్కడ ఇలాంటి కాలం చెల్లిన బస్సులను ధ్వంసం చేసి ఇంజిన్, ఇతర విడిభాగాలను విక్రయిస్తారు. వాటి స్థానంలో కొత్త బస్సులను డిపోలకు పంపిస్తారు. ఇపుడీ ప్రక్రియ ఏమాత్రం సజావుగా సాగడం లేదు. గత ఆరు నెలల కాలంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పల్లె వెలుగు, మెట్రో, పాసింజర్ బస్సులు అనేకసార్లు ఆగిపోయాయి. వీటికి మరమ్మతు చేపట్టేవరకు, లేదా వేరొక బస్సులోకి ప్రయాణికులను ఎక్కించే వరకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇటీవల యలమంచిలి బస్‌కాంప్లెక్స్‌లో విశాఖ - యలమంచిలి మెట్రో బస్సు ఆగిపోయింది. దీనికి మరమ్మతు పనులు చేపట్టినప్పటికీ స్థానికుల సహాయంతో గంటసేపు అటు ఇటు నెట్టితే తప్ప ఇంజన్ స్టార్ట్ కాలేదు. ఇక పల్లె వెలుగు బస్సుల సంగతి సరేసరి. అవి ఎప్పుడు ఆగిపోతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. మూడేళ్లలో 37 ప్రమాదాలు ద్వారకానగర్: విశాఖ రీజియన్‌కు సంబంధించి మూడు సంవత్సరాలలో 37 ప్రమాదాలు జరిగాయి. సూపర్ డీలక్స్, డీలక్స్, లగ్జరీ బస్సులే ఎక్కువ ప్రమాదాలకు గురయ్యాయని విశాఖపట్నం డిపో మేనేజర్ అల్లాడ గంగాధర్‌రావు తెలిపారు. అనంతపురం ప్రమాదం నేపథ్యంలో గురువారం ఆర్టీసీ అధికారులు బస్సుల భద్రతపై సమీక్ష నిర్వహించారు. వేగాన్ని పెంచకుండా పరిమిత హాల్ట్‌లతో ప్రయాణికులను సకాలంలో గమ్యాలకు చేర్చాలన్నది అధికారుల సరికొత్త వ్యూహం. దూర ప్రాంతాలకు వెళ్లే ఏసీ సర్వీసులన్నింటి వేగాన్ని గంటకు వంద కిలోమీటర్లకు నియంత్రించారు. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని వేగం కంటే భద్రతకే అధిక ప్రాధాన్యతమిస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. జరిగిన ప్రమాదాలివీ... ఏడాదిన్నర క్రితం అరకు నుంచి విశాఖపట్నం వచ్చే డీలక్స్ బస్సు ఘాట్ రోడ్డు నుంచి కిందపడి ప్రమాదానికి గురైంది. ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. గత ఏడాది హైదరాబాద్ నుంచి విశాఖ వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు అతివేగంతో డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి లోనైంది. పాడేరు, నర్సీపట్నం, అనకాపల్లి డిపోల్లో ఎక్కువగా పాడైపోయిన డొక్కు బస్సులను లోతట్టు ప్రాంతాలకు మాత్రమే పరిమితం చే స్తున్నారు. దీంతో అవి బయలు దేరిన వేళా విశేషం బాగుంటే సక్రమంగా తిరిగి వస్తాయి...లేకపోతే ఎక్కడ ఆగిపోతాయో ఎలాంటి ప్రమాదాలకు గురవుతాయో తెలియని పరిస్థితి. సిటీ పరిధిలో తిరిగే సాధారణ సిటీ బస్సుల్లో 45 శాతం కండిషన్ బాగులేనివే. వాల్తేరు, సింహాచలం, గాజువాక డిపోల్లో ఎక్కువగా ఉన్నాయి. ఘాట్ రోడ్డులో దేవుడే దిక్కు పాడేరు: ఏజెన్సీ రోడ్లు అధ్వానంగా ఉండటంతో ప్రయాణం భయానకంగా మారింది. పాడేరు నుంచి సీలేరు వరకు పోయే రోడ్డులో కొక్కిరాపల్లి, జీకేవీధి నుంచి సీలేరు పోయే 50 కి.మీ రోడ్డు పూర్తిగా శిథిలమైంది. రక్షణ గోడలు కూడా ధ్వంసమవడంతో ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు పోయే ఘాట్ రోడ్డులో కూడా పలు చోట్ల రక్షణ గోడలు ధ్వంసమయ్యాయి. ఏసు ప్రభువు విగ్రహం ఉన్న మలుపు వద్ద రక్షణ గోడతోపాటు రోడ్డు కోతకు గురవడంతో ఏడాది నుంచి ఇక్కడ భయంభయంగానే వాహనాలను నడుపుతున్నారు. ఏజెన్సీ 11 మండలాల్లో సర్వీసు చేస్తున్న పాడేరు డిపోకు చెందిన 40 ఆర్టీసీ బస్సుల్లో 22 తరచు మరమ్మతులకు గురవుతున్నాయి. ఘాట్ రోడ్లపై 6 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను వెంటనే మైదాన ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో కొత్తబస్సులను రప్పించాలనే నిబంధనలను ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ బస్సులు నడవని ప్రధాన రోడ్లలో గిరిజనులంతా ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ప్రైవేటు జీపుల ఆపరేటర్లు నిబంధనలకు విరుద్ధంగా 15 మంది ప్రయాణించాల్సిన జీపుల్లో 30 నుంచి 40 మంది వరకు ఎక్కించుకొంటున్నారు. దీంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి