ఏంటి.. నిద్రపోతున్నాడు అనుకుంటున్నారా.. నిద్రే.. కానీ శాశ్వత నిద్ర.. అకస్మాత్తుగా గుండెపోటు వస్తే.. తన ప్రాణాలను ఉగ్గబెట్టుకుని.. మనలాంటి ఎందరో ప్రాణాలను కాపాడిన ధీరుడితడు. తనకు ప్రాణప్రదమైన స్టీరింగ్‌పైనే ప్రాణాలను విడిచిన ఆర్టీసీ డ్రైవర్ ఇతడు..
సాక్షి, హైదరాబాద్: ఒక అరుణాచలం.. ఒక తాజ్‌బాబా.. ఒక విష్ణు.. పేరేదైతేనేం.. ఇలాంటి ఎందరివో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.. మొన్నటికి మొన్న సిద్దిపేట జిల్లా కొండపాక వద్ద బస్సులో టికెట్లు ఇస్తోన్న కండక్టర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
తెలంగాణ ఆర్టీసీలో ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు వందల్లో ఉంటున్నాయి. ప్రాణాంతక వ్యాధులతో చాలామంది ఆయువు ముగియకముందే.. అకాలమరణం చెందుతున్నారు. పని ఒత్తిడి, వేళాపాళాలేని పని వేళల కారణంగా కార్మికులు పలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం కార్మికులను, వారి కుటుంబాలను కబళిస్తున్నాయి. గుండెపోటు కార్మికులను క్షణాల్లో విగతజీవులుగా మారుస్తుంటే.. పక్షవాతం జీవితాంతం జీవచ్ఛవాలుగా మారుస్తోంది.
వీరికే ఎందుకిలా?
ఆర్టీసీలో పని ఒత్తిడి తీవ్రంగా ఉందనేది కాదనలేని వాస్తవం. రెండు, మూడు రోజులు వరుసగా విధులు నిర్వహించాల్సి రావడంతో కార్మికులు శారీరకంగా అలసిపోవడం, కుటుంబానికి దూరమై మానసికంగా కుంగిపోతున్నారు. వీరి జీవనశైలి కూడా శరీరంలోకి పలు రోగాలను మోసుకొస్తోంది. వేళకు తినరు, నిద్రపోరు. దీంతో గ్యాస్, అల్సర్, అజీర్తి వంటి సమస్యలు విధుల్లో చేరిన కొన్ని నెలల్లోనే వచ్చేస్తున్నాయి.
ఇక సుదీర్ఘకాలం కూర్చోవడం వల్ల పైల్స్, గంటల కొద్ది నిద్రను కోల్పోవడంతో కంటి సమస్యలు డ్రైవర్లను పీడిస్తున్నాయి. ఇక కండక్టర్లు నిల్చోవడం వల్ల కీళ్ల నొప్పులు, వెరికోసిస్ లాంటి జబ్బుల బారిన పడుతున్నారు. శరీరంలో సరిపడా నీరు లేక కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. వీటికితోడు అధికారుల వేధింపులు, చలానాలు రాయడం, మెమోలు ఇవ్వడం తదితర సమస్యలు వారిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఇవే దీర్ఘకాలంలో గుండె సమస్యలు, పక్షవాతానికి కారణమవుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
నియామకాలేవీ..?
ఆర్టీసీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ జరిగి దాదాపు ఎనిమిదేళ్లు కావొస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 700 మంది శ్రామిక్‌లు, 440 మెకానిక్‌లు, 460 ఆర్టిజెన్స్ పోస్టులను సంస్థ నేరుగా రిక్రూట్ చేసుకుంది. ఆ తర్వాత ఎలాంటి రిక్రూట్‌మెంట్లు లేవు. 2011 నుంచి నేటి వరకు దాదాపుగా 7 వేల మందికిపైగా ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఇందులో దాదాపుగా 5,000 పోస్టులను భర్తీ చేసేందుకు జూన్‌లో మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. కానీ, ఈ విషయంలో ఎలాంటి పురోగతిలేదు. ఈ భర్తీలు లేకపోవడంతో ఇప్పుడున్న సిబ్బందిపైనే అదనపు పనిభారం పడుతోంది.
ఎన్‌ఐఎన్ సేవలు వద్దా?
ప్రతీరోజు వందలాది మంది కార్మికులు పై సమస్యలతో తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి వస్తున్నారు. చికిత్స కంటే నివారణ మేలు అన్న సూత్రాన్ని ఆర్టీసీ యాజమాన్యం విస్మరిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తార్నాకలోనే ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) సలహాలు తీసుకుంటే తప్పేంటని పలువురు సూచిస్తున్నారు.
ప్రతికూల వాతావరణం, తీవ్ర ఒత్తిళ్ల మధ్య పనిచేసే కార్మికులకు ఎలాంటి డైట్ తీసుకుంటే బావుంటుందన్న సలహాలను తీసుకునే ఓపిక లేదా అని అశోక్ (ఎన్‌ఎంయూ) ప్రశ్నిస్తున్నారు. డైట్ పాటిస్తే కార్మికులకు ఇప్పుడు వస్తున్న చాలా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని అంటున్నారు.
నియామకాలు చేపట్టాలి
ప్రపంచీకరణ వల్ల చాలా మార్పులు వచ్చాయి. దీనిలో భాగంగా 8 గంటల పని విధానాన్ని మార్చాలి. పని గంటలను 6 గంటలకు కుదించాలి. పని భారం తగ్గించాలి. వరుస డ్యూటీలు వేయడం మాను కోవాలి. కొత్త నియామకాలు చేపట్టాలి. –నాగేశ్వరరావు, చైర్మన్, ఎన్‌ఎంయూ
ఎంతమంది మరణించారు?
Comments
Please login to add a commentAdd a comment