‘పోటె’త్తిస్తున్న పని ఒత్తిడి | RTC Drivers And Staff Shortage in Hyderabad | Sakshi
Sakshi News home page

‘పోటె’త్తిస్తున్న పని ఒత్తిడి

Published Thu, Feb 28 2019 6:15 AM | Last Updated on Thu, Feb 28 2019 6:15 AM

RTC Drivers And Staff Shortage in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఆర్టీసీ  డ్రైవర్లపై జీవన శైలి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని తీవ్ర ఒత్తిళ్ల నడుమ డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు.  సిబ్బంది కొరత, డబుల్‌ డ్యూటీలు, సకాలంలో సెలవులు లభించకపోవడం, నగరంలోని  ట్రాఫిక్‌ రద్దీలో గంటల తరబడి బస్సులు నడపడం తదితర కారణాలతో  డ్రైవర్లు చిన్న వయస్సులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. రాణిగంజ్‌ డిపోకు చెందిన మల్లారెడ్డి 42 ఏళ్ల వయస్సులోనే తీవ్రమైన గుండెపోటు కారణంగా  మంగళవారం చందానగర్‌లో మృతి చెందిన ఉదంతం  ఆర్టీసీ కార్మికులను కలవరానికి గురిచేస్తోంది. కేవలం  పని ఒత్తిడి వల్లనే  డ్రైవర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని,  అధిక రక్తపోటు, షుగర్, పైల్స్‌ వంటి జీవన శైలి  వ్యాధులతో పాటు గుండె జబ్బులు కూడా  కబలిస్తున్నాయని  కార్మికసంఘాలు   పేర్కొంటున్నాయి.

ఇటీవలి కాలంలో తరచూ ఎక్కడో ఒక చోట  డ్రైవర్లు  గుండెపోటుతో మృతి చెందుతున్నారని  తెలంగాణ ఆర్టీసీ  ఎంప్లాయీస్‌ యూనియన్‌  ప్రధానకార్యదర్శి రాజారెడ్డి  ఆవేదన  వ్యక్తం చేశారు. డ్రైవర్లకు సకాలంలో సరైన వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం, వ్యాధులను ముందస్తుగా  గుర్తించి  చికిత్సలను అందజేసే సదుపాయం  ఆర్టీసీ ఆసుపత్రిలో  లేకపోవడంతో పాటు   డిపోల్లో సిబ్బంది కొరత, విధుల్లో  ఉన్న వారే అదనపు పని గంటలు పని చేయాల్సి రావడం వంటి అంశాల కారణంగా  చిన్నవయస్సులోనే  తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ‘గతంలో  50 ఏళ్లు దాటిన డ్రైవర్లు మాత్రమే  గుం డెపోటు వంటి సమస్యలను ఎదుర్కొనేవారని, ప్రస్తుతం పని ఒత్తిడి కారణంగా  40 ఏళ్లకే వ్యాధుల భారిన పడుతున్నారన్నారు. సకాలంలో వ్యాధులను గుర్తించకపోవడం,  సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల   డ్రైవర్లు  తీవ్రమైన ఆరోగ్యం బారిన పడుతున్నారు’ అని  తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి చెందిన సీనియర్‌ వైద్య నిపుణులు ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. 

ఏటా పెరుగుతున్న డ్రైవర్ల కొరత...
గ్రేటర్‌లో మొత్తం 29 డిపోల నుంచి  3850 బస్సులను నడుపుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు, తదితర సిబ్బంది అంతా కలిసి   సుమారు 18000 మందికి  పైగా  ఉన్నారు.  వీరిలో  8000 మందికి పైగా  డ్రైవర్లు ఉన్నట్లు అంచనా. అయితే ఏటా వందలాది మంది  పదవీ విరమణ చేస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించకుండా  డిపోల్లో  ఉన్న డ్రైవర్లకే అదనపు విధులను అప్పగిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కనీసం  1000 మంది  డ్రైవర్లను భర్తీ చేయాల్సి ఉంది. సిబ్బంది కొరత కారణంగా ఏడున్నర గంటలు పని చేసే కార్మికుడు  డబుల్‌ డ్యూటీ పేరిట  15 గంటల నుంచి  16 గంటల వరకు పని చేయాల్సి వస్తుంది. సాయంత్రం  విధుల్లో చేరిన వారు  తీవ్రమైన ట్రాఫిక్‌ రద్దీ కారణంగా గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి రావడంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.‘‘ సిటీలో  ఏడున్నర  గంటల డ్యూటీ మాత్రమే అంటారు. కానీ ఏ డ్రైవర్‌ కూడా ఏ ఒక్క రోజు ఏడున్నర  గంటల్లో డ్యూటీ ముగించుకొని డిపోకు చేరుకోవడం సాధ్యం కాదు. డబుల్‌ డ్యూటీ చేసినప్పుడు కచ్చితంగా  ఉదయం నుంచి  రాత్రి వరకు, లేదా మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు   బస్సు నడపాల్సిందే..’’ అని  ఉప్పల్‌ డిపోకు చెందిన డ్రైవర్‌ ఒకరు తెలిపారు. డబుల్‌ డ్యూటీకి  అంగీకరించకపోయినా, సెలవులు  తీసుకొన్నా అధికారులు  చార్జీషీట్లతో వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. 

అరకొర వైద్య సదుపాయాలు...
గుండెపోటు ముప్పును గుర్తించడంలో ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌ (టీఎంటీ) ఎంతో ముఖ్యమైంది. అప్పటి వరకు ఉన్న బలహీనతను గుర్తించడంతో పాటు రాబోయే ముప్పును కూడా ఈ పరీక్ష ద్వారా వైద్యులు గుర్తిస్తారు.  
50 వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులకు వైద్య సదుపాయాలను అందజేసే  తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో ఈ సదుపాయం లేదు. ఇదొక్కటే కాదు. చాలా పరీక్షల కొరకు  కార్పొరేట్, ప్రైవేట్‌ ఆసుపత్రులపైనే ఆధారపడాల్సి వస్తోంది.
డ్రైవర్లకు ప్రతి మూడేళ్లకు ఒకసారి  అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాల్సి ఉంది. 45 ఏళ్లు దాటిన వారికి ఏటా వైద్య పరీక్షలు నిర్వహించాలి. కొంతకాలంగా పెరిగిన గుండె జబ్బుల ముప్పు ను పరిగణనలోకి తీసుకొని  40 ఏళ్లు దాటిని ప్రతి ఒక్కరికీ ఏటా అన్ని రకాల వైద్య పరీక్షలు (టీఎంటీతో సహా) చేయాలని  నిర్ణయించారు. అయితే ఏడాది దాటినా ఇది అమలుకు నోచుకోలేదు.
టీఎంటీ సదుపాయం లేకపోవడంతో ప్రసు ్తతం ఈసీజీ వంటి సాధారణ పరీక్షలకే పరిమితమవుతున్నారు. దీంతో వ్యాధుల ముప్పును సకాలంలో  పసిగట్టలేకపోతున్నట్లు  వైద్య నిపుణులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తార్నాక ఆసుపత్రిలో 40 మంది పారామెడికల్‌ సిబ్బందికి గాను కేవలం 20 మందే ఉన్నారు. 45 మంది వార్డుబాయ్‌లు పనిచేయాల్సి ఉండగా  18 మంది మాత్రమే ఉన్నారు. 45 మంది వైద్య నిపుణులకు గాను ప్రస్తుతం 28 మంది మాత్రమే పని చేస్తున్నారు.
వైద్యులు, సిబ్బంది కొరత, సరైన లాబొరేటరీ సదుపాయాలు లేకపోవడం వేలాది మంది కార్మికుల పాలిట శాపంగా మారాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement