మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్లు..
► ఆర్టీసీలో డ్రంక్ అండ్ డ్రైవ్
► పట్టుబడ్డవారిపై కేసులు
► చర్యలు తీసుకోవద్దంటూ యూనియన్ నేతల బెదిరింపు
హైదరాబాద్: అది చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన ఆర్టీసీ గరుడ బస్సు. ప్రయాణికులతోపాటు, సాంకేతిక అధ్యయనం కోసం అక్కడికి వెళ్లిన కొందరు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఆ బస్సులోనే నగరానికి రావాల్సి ఉంది. విశ్రాంతి గదిలో ఉన్న ఇద్దరు బస్సు డ్రైవర్లను విజిలెన్స్ సిబ్బంది బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా మద్యం సేవించినట్టు తేలింది. వారు అలాగే బస్సు నడిపితే ప్రమాదమన్న ఉద్దేశంతో అధికారులు ఏకంగా ఆ ట్రిప్పునే రద్దు చేశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘటన ఇది. మహబూబ్‌నగర్ జిల్లాలో 45 మంది పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆపి పోలీసులు తనిఖీ చేయగా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు తేలింది. వెంటనే పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. పదిరోజుల క్రితం డ్రైవర్ ఘనకార్యమిది.
కొద్దిరోజుల క్రితం ఉస్మానియా వైద్య విద్యార్థులు వస్తున్న ఓ ప్రైవేటు బస్సు విజయవాడ సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. నలుగురు విద్యార్థులు మృతికి కారణమైన ఆ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. ఆ సమయంలో హడావుడిగా రవాణాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన తనిఖీలతో హోరెత్తించి ఆ తర్వాత చల్లబడ్డారు. ప్రైవేటు బస్సులెక్కితే భద్రత ఉండదని, ఆర్టీసీ బస్సులైతే సురక్షితంగా గమ్యస్థానాలకు వెళ్లొచ్చని అప్పట్లో ఆర్టీసీ గొప్పగా ప్రచారం చేసుకుంది. కానీ స్వయంగా ఆర్టీసీ డ్రైవర్లే మద్యం తాగి బస్సు లు నడుపుతున్నట్టు వెలుగు చూస్తుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కొందరు డ్రైవర్లు, కండక్టర్లు, వారిని నియంత్రించాల్సిన అధికారులు విధినిర్వహణలో మద్యం తాగినట్టు తేలటంతో సస్పెన్షన్ల పర్వం మొదలైంది.
త్వరలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ వ్యవహారం ఆయా సంఘాల నేతలకు వరంగా మారింది. వెంటనే వారు ఆయా ప్రాంతాల అధికారుల వద్ద వాలిపోయి కేసులు ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఎక్కడి బస్సులను అక్కడే స్తంభింపచేస్తామని హెచ్చరిస్తున్నారు. మద్యం తాగి బస్సులు నడిపే డ్రైవర్ల విషయంలో కఠినంగా ఉండాలని స్వయంగా హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో అలాంటివారిపై చర్యలు తీసుకోవాలో, కార్మిక నేతల హెచ్చరికలు భయపడి వదిలేయాలో అర్థం కాని పరిస్థితిలో అధికారులుండిపోయారు.