ఎన్నాళ్లీ ప్రమాదాలు? | Road Accidents Are Increasing Worldwide | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ ప్రమాదాలు?

Published Tue, May 14 2019 12:37 AM | Last Updated on Tue, May 14 2019 12:37 AM

Road Accidents Are Increasing Worldwide - Sakshi

‘మాట్లాడదాం... ప్రాణాలు కాపాడదాం’ అనే నినాదంతో ఐక్యరాజ్యసమితి ఈ నెల 6 నుంచి 12 వరకూ ప్రపంచ రహదారి భద్రతా వారం పాటించమని పిలుపునిచ్చింది. సరిగ్గా ఈ వారంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద ఘోర ప్రమాదం సంభవించి 16 నిండు ప్రాణాలు బలయిపోయాయి. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా రామాపురం నుంచి కొందరు బంధువులు, స్నేహితులు శనివారం ఒక వివాహాన్ని నిశ్చయం చేసుకుని వస్తుండగా అతి వేగంతో దూసుకొచ్చిన బస్సు వారిని కబళించింది. ఈ ప్రమాదంలో ఒక ద్విచక్రవాహనదారు కూడా మరణించాడు. ఆ మరుసటి రోజు తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా నుస్తులాపూర్‌ వద్ద లారీని బస్సు ఢీకొట్టడంతో బస్సులోని 20మంది ప్రయాణికులు గాయపడ్డారు. రహదారి భద్రత విష యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోమని ఎక్కడికక్కడ ప్రభుత్వాలను పౌర సమాజాలు డిమాండ్‌ చేయాలని, ఒత్తిళ్లు తీసుకురావాలని ఐక్యరాజ్యసమితి ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా  ఏటా కోటిమందికిపైగా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. దాదాపు 5 కోట్లమంది వరకూ క్షతగాత్రులవుతున్నారు. మన దేశంలో సగటున ఏటా 5 లక్షల ప్రమాదాల్లో లక్షన్నరమంది కన్ను మూస్తున్నారు.
 
మన రోడ్లు నిత్యం నెత్తుటి చరిత్రను రచిస్తున్నాయి. కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఈ ప్రమాదాల్లో అత్యధిక భాగానికి కారణమని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దేశంలో కేరళ, యూపీ, నాగాలాండ్‌ మినహా మరే రాష్ట్రమూ రహదారి భద్రతా విధానాన్ని రూపొందించుకోలేదని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నివేదిక తేల్చి చెప్పింది. ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గమనించినా ఈ సంగతి అర్ధమవుతుంది. హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారి నుంచి పక్కనున్న గ్రామాల్లోకి వెళ్లేందుకు, వాహనాలు యూటర్న్‌ తీసుకోవడానికి ఏర్పాటు చేసిన క్రాస్‌ రోడ్‌లు భీతిగొలుపుతాయి. వాటి సమీపంలో ఏటా పదులకొద్దీ ప్రమాదాలు జరగుతున్నా ఎవరికీ పట్టడం లేదు. ముఖ్యంగా వెల్దుర్తి క్రాస్‌ వద్ద రహదారి డిజైన్‌లో లోపమున్నదని సాధారణ పౌరులు సైతం ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదు. అక్కడ అండర్‌వే నిర్మించమని, సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయమని స్థానికులు అడుగుతున్నా వినిపించుకునే దిక్కు లేదు. ఇలాంటిచోట తగినన్ని స్పీడు బ్రేకర్లు నిర్మించి, అవసరమైన లైటింగ్, సిగ్నల్స్, జీబ్రా లైన్స్‌ వంటివి ఏర్పాటు చేస్తే వాహ నాల వేగానికి కళ్లెం పడుతుంది.

ఇదేచోట గతంలోనూ ప్రమాదాలు చోటుచేసుకున్నా దిద్దుబాటు చర్యలు లేవు. అత్యధిక వేగంతో వెళ్లే వాహనాలకు అనుమతులిచ్చినప్పుడే మన రహదార్ల తీరు తెన్నులపై కూలంకషంగా సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న స్పృహ ఉండాలి. నిబం ధనల ఉల్లంఘనే ప్రమాదాలకు మూలకారణమని ప్రతిసారీ అధికారులు చెబుతుంటారు. కానీ ఆ నిబంధనలు అవసరమైనంతగా ఉన్నాయో లేదో, వాటిని పాటించక తప్పని స్థితి ఏర్పరచాలంటే ఇంకేం చర్యలు అవసరమో సమీక్షించే వ్యవస్థ ఉందా? అదే ఉంటే జాతీయరహదారి పొడవునా ఉన్న గ్రామాల్లోని జనం గోడు పట్టించుకునేవారు. లక్షల కోట్లు ఖర్చుపెట్టి నాలుగు లేన్లు, ఆరు లేన్లు అంటూ విశాలమైన రహదారులు నిర్మిస్తున్నారు. వాటిపై వాయువేగంతో దూసుకుపోయే వాహనాలు కూడా వచ్చి వాలుతున్నాయి. కానీ ఈ రొదలో ఆ రోడ్లకు ఇరుపక్కలా ఉండే పల్లెటూ ళ్లలో బతుకీడ్చే సాధారణ పౌరుల భద్రతకు ఏం చేయాలో  సరిగా ఆలోచించడం లేదు. వారి ఫిర్యా దులను పరిగణనలోకి తీసుకుని లోపాలు సరిదిద్దటం లేదు.

బ్రెజిల్‌ రాజధాని బ్రెసిలియాలో నాలుగేళ్లక్రితం జరిగిన రహదారి భద్రత సదస్సులో 2020 నాటికి రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను సగానికి తగ్గించాలన్నది లక్ష్యంగా నిర్ణయించారు. వచ్చే ఏడాదికి ఆ గడువు ముగిసిపోతుండగా అంతకంతకు ప్రమాదాలు, అందులో మరణాలు పెరుగు తున్నాయే తప్ప తగ్గడం లేదు.  ముఖ్యంగా 25–29 ఏళ్లమధ్య వయస్కుల్లో జరిగే మరణాలకు కార ణమేమిటని ఆరా తీసినప్పుడు రోడ్డు ప్రమాదాలదే ప్రధాన పాత్ర అని తేలింది. ప్రభుత్వాల వైపుండే లోపాలతోపాటు అతి వేగం, ముందుండే వాహనాలను అధిగమించాలనుకోవడం, తాగి వాహనాన్ని నడపడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన హేతువులు. ఈమధ్యకాలంలో సెల్‌ఫోన్‌ వీటికి అదనంగా చేరింది.  హైదరాబాద్‌ నగరంలో మూడేళ్లక్రితం నిండా ఇరవైయ్యేళ్లు దాటని ఆరుగురు విద్యార్థులు పట్టపగలే మద్యం సేవించి పెను వేగంతో కారు నడుపుతూ వేరే కారులో ప్రయా ణిస్తున్న ముగ్గురు కుటుంబసభ్యుల్ని బలిగొన్నారు. మద్యం తాగి వాహనం నడిపేవాడు ఆత్మాహు తికి పాల్పడే ఉగ్రవాదిలాంటివాడని కొన్నేళ్లక్రితం ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది. ఈ బాపతు ఉగ్ర వాదులకు కళ్లెం వేయడంలో మన ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి.

ప్రపంచంలోని వాహనాల్లో మన దేశంవాటా ఇప్పటికీ ఒక్క శాతం మాత్రమే. కానీ రోడ్డు ప్రమాదాల్లో 10 శాతం మరణాలు మన దేశంలోనే సంభవిస్తున్నాయి. వీటి కారణంగా విలువైన మానవ వనరుల్ని కోల్పోతున్నాం. దాంతోపాటు మన ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో నష్టపోతోంది. ఈ ప్రమాదాల్లో గాయపడేవారిది వేరే కథ. వారు తాత్కాలికంగా ఉపాధికి దూరం కావడం, కొన్ని సందర్భాల్లో దాన్ని శాశ్వతంగా కోల్పోవడం... అదే సమయంలో తడిసిమోపెడయ్యే ఆసుపత్రి బిల్లులు చెల్లించాల్సి రావడం కుటుంబాలను దిగదీస్తోంది. ఇప్పుడు వెల్దుర్తి ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారంతా దళిత కుటుంబాలవారు. కడుపునిండా తినడమే కష్టమైన ఆ కుటుంబాల్లోని వారికి ఇకపై ఆసరాగా నిలిచేదెవరు? పాలకులు ఆలోచించాలి. ఆదుకోవాలి. ప్రభుత్వాలు తమ నిర్లక్ష్యాన్ని వదుల్చుకుని, పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకుని పటిష్టంగా పనిచేస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది. అంతర్జాతీయ సదస్సుల్లో హామీలివ్వడం మాత్రమే కాదు.. వాటిని ఆచరణలో అమలు చేయాలన్న దృఢ సంకల్పం కూడా ఉండాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement