‘‘యాక్సిడెంట్ అంటే బైకో, కారో రోడ్డు మీద పడడం కాదు.. ఓ కుటుంబం రోడ్డున పడడం’.. సినిమా డైలాగే కావొచ్చు.. ఇది అక్షర సత్యం. ఏదో ఒక పని మీద రోడ్ల మీదకొచ్చి.. ఇంటికి చేరుకునేలోపే ఛిద్రమవుతున్న బతుకులు ఎన్నో. మన దేశంలో ఆ సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది కూడా. తప్పేవరిదైనా.. శిక్ష మాత్రం ఆ కుటుంబాలకే పడుతోంది.
ఇరుకు రోడ్లు మొదలుకుని.. గల్లీలు, టౌన్‌లలో, రద్దీగా ఉండే సిటీ రోడ్లపైన, విశాలమైన రహదారుల్లోనూ.. ప్రమాదాలనేవి సర్వసాధారణంగా మారాయి. మనదేశంలో ప్రతీరోజూ రోడ్డు ప్రమాదాల్లో లెక్కలేనంత మంది మరణిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకునే చర్యలేవీ ఫలించినట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘సాంకేతికత’నే మరోసారి నమ్ముకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏఐ.. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(కృత్రిమ మేధస్సు). సోషల్ మీడియాలో కేవలం వినోదాన్ని అందించే సాధనంగానే చూస్తున్నారు చాలామంది. కానీ, దాదాపు ప్రతీ రంగంలోనూ ఇప్పుడు దీని అవసరం పడుతోంది. ప్రపంచం అంతటా.. ఏఐ మీద కళ్లు చెదిరిపోయే రేంజ్‌లో బిజినెస్ నడుస్తోంది. కానీ, ఇలాంటి టెక్నాలజీ సాయంతోనే రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూస్తే ఎలా ఉంటుంది?.
ప్రపంచంలో అత్యధికంగా రోడ్డు ప్రమాద మరణాలు సంభవించేది ఏ దేశంలోనో తెలుసా?
మన దేశంలో గత రెండు దశాబ్దాలుగా రోడ్ల నిర్మాణం, వాటి రిపేర్ల కోసం అయిన ఖర్చు ఘనంగానే ఉంది. అయినప్పటికీ కొన్ని సవాళ్లు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి. పెరిగిన రద్దీ, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, సురక్షిత ప్రయాణ పద్దతుల(సేఫ్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్) మీద వాహనదారుల్లో అవగాహన లేకపోవడం.. వీటితో పాటు ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలు చేయకపోవడం, పేలవమైన రోడ్ల నిర్వహణ, భద్రతా చర్యలు సరిపోకపోవడంలాంటివి నిత్యం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
2022లో.. అధికారిక గణాంకాల ప్రకారం 4,60,000 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వీటిల్లో 1,68,491 మంది మరణించగా.. 4,43,366 మంది గాయపడ్డారు.
2023లో.. 4,12,432 యాక్సిడెంట్లు జరిగితే 1,53,972 మంది మరణించారు. 3,84,448 మంది క్షతగాత్రులయ్యారు.
ఈ లెక్కల ఆధారంగా.. రోడ్డు ప్రమాదాలు 11 శాతం పెరిగితే.. మరణాలు దాదాపు 10 శాతం, గాయపడినవాళ్ల సంఖ్య 15 శాతం పెరుగుతూ వచ్చింది.
అరికట్టడం ఎలా?
సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(CRRI).. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో 2008 నుంచి 2021 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించింది. దాదాపు 30 లక్షలకుపైగా జనాభా ఉన్న నాగ్‌పూర్‌లో.. రోడ్డు ప్రమాదాల కారణంగా ఏడాదికి సగటున 200 మంది చనిపోతున్నారు. గాయపడేవాళ్ల సంఖ్య 1000కి పైనే ఉంటోంది. మహారాష్ట్రలో ఇదే అధికమని తేలింది.
ఈ అధ్యయనం ఆధారంగా.. సాంకేతికతకు ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌ను జత చేయడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గించొచ్చని చెబుతున్నారు. అదెలాగంటే.. ఏఐను ఉపయోగించి అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌ను రూపొందించడం. ఇందులోనే ఆడియో, వీడియో వ్యవస్థలను కూడా రూపొందించారు.
ఎలాగంటే.. ఈ సిస్టమ్‌ను వాహనాల విండ్ షీల్డ్(ముందు ఉండే అద్దాలకు) అమర్చడం ద్వారా ముందు ఉన్న రోడ్లను పూర్తిగా స్కాన్ చేస్తుంది. ముందు ఏదైనా ముప్పు పొంచి ఉంటే గనుక.. ఆ ఆడియో లేదంటే వీడియో అలారమ్ ద్వారా వాహనం నడిపేవాళ్లను అప్రమత్తం చేస్తుంది. అప్పుడు ప్రమాదాలను తృటిలో తప్పించుకునే అవకాశం ఉంటుంది. కేవలం కార్లు, భారీ వాహనాలకే కాదు.. ద్విచక్ర వాహనదారులకు, పాదాచారులకు, వీధుల్లో తిరిగే జంతువుల విషయంలోనూ వర్తిస్తుంది.
ఆచరణలోకి వచ్చిందా?
అవును.. నాగ్‌పూర్‌లోనే సెప్టెంబర్ 2021లో iRASTE ప్రాజెక్టు ప్రారంభమైంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, తద్వారా కొందరి ప్రాణాలైనా నిలబెట్టడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం ప్రైవేట్ వాహనాలను కాకుండా.. ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారు. నాగపూర్ అర్బన్-పెరి అర్బన్ రోడ్డు నెట్‌వర్క్‌లో నడిచే సుమారు 150 బస్సులకు ఏఐ టెక్నాలజీ కెమెరాలను అమర్చారు. కనీసం 2.5 సెకండ్ల తేడాతో ప్రమాదం జరిగే ముందు.. ఇవి డ్రైవర్లను అప్రమత్తం చేసేవి. అలా.. రెండేళ్లకు పైగా ఈ పైలట్ ప్రాజెక్టును. బ్లాక్,గ్రే పాయింట్లుగా విభజించి పరిశీలించారు.
ఫలితం ఇలా..
ఐఆర్‌ఏఎస్‌టీఈ ప్రాజెక్టు క్రమక్రమంగా మెరుగైన ఫలితం చూపించడం మొదలుపెట్టింది. సకాలంలో డ్రైవర్లు స్పందించడంతో ప్రమాదాలు జరగకుండా చూసుకోగలిగారు. అయితే ఇది 100కు వంద శాతం సక్సెస్‌ను(66%) ఇవ్వలేకపోయింది. ప్రాణనష్టం తప్పినప్పటికీ ప్రమాదాల్లో గాయపడిన వాళ్ల సంఖ్య మాత్రం అంతేస్థాయిలో కొనసాగింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. జులై 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య.. నాగ్‌పూర్ గ్రే స్పాట్స్‌లో డ్రైవర్లు సకాలంలో ప్రమాదాలు జరగకుండా చూడగలిగారు. తద్వారా.. 36 మంది ప్రాణాలు నిలబడ్డాయి.
మన దేశంలో రోడ్డు ప్రమాదాలతో కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాల మరణాలు సంభవించే దేశం మనది. 2018-2022 మధ్య తమిళనాడులో రికార్డు స్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అత్యధికంగా మరణాలు మాత్రం ఉత్తర ప్రదేశ్‌లో సంభవించాయి. 2021, 2022 సంవత్సరాల్లో 22,595.. 21,227 మంది మరణించారు. వీటిల్లో ఓవర్ స్పీడ్ మరణాలే అత్యధికంగా ఉన్నాయి.
అలాంటి దేశంలో 2030నాటికల్లా.. రోడ్డు ప్రమాదాలతో కలిగే నష్టం(ప్రాణ, వాహన నష్టం) 50 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే.. ఏఐ సంబంధిత వాహనాలను రోడ్లపైకి తేవాల్సిందేనంటున్నారు మేధావులు. ఇది ఒక తరహా ఆలోచన మాత్రమేనని.. మరిన్ని అవకాశాలను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నారు వాళ్లు. తద్వారా మరిన్ని కుటుంబాలు రోడ్డున పడకుండా చూడొచ్చని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment