ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా 1.60 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని రోడ్‌సేఫ్టీ విభాగం వెల్లడించింది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి రోడ్‌సేఫ్టీ విభాగం గణాంకాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. 2019లో రోడ్డు ప్రమాదాల కారణంగా తెలంగాణలో చనిపోతున్న వారి సంఖ్య దాదాపు 6,800గా ఉంది. రోడ్డు ప్రమాదాల వల్ల సగటున రోజుకు 16 మంది మరణిస్తుండగా.. 61 మందికి గాయాలవుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు, ట్రాఫిక్, రవాణారంగ నిపుణులు చెబుతున్నా.. చాలామంది పెడచెవిన పెట్టడంతో ఇది రోజురోజుకూ విజృంభిస్తోంది.
సిరిసిల్ల జిల్లాలో జీరో మరణాలు..
కనీసం ఈ ఏడాదిలోనైనా ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని అంతా భావిం చారు. ముఖ్యంగా పోలీసులు నూతన సంవత్సరం రోజున ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ప్రమాదాల సంఖ్య తక్కువగా నమోదైంది. తరువాత వరుసగా జరిగిన పలు రోడ్డు ప్రమాదాలు గతేడాది మరణాల సగటును అందుకునేలా చేశాయి. ఈ ఏడాది జనవరిలో 1,907 ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 484 తీవ్ర ప్రమాదాలు కాగా.. 1,423 సాధారణ ప్రమాదాలు. ఇందులో 491 మంది ప్రాణాలు కోల్పోగా.. 2,143 మంది క్షతగాత్రులు అయ్యారు. జిల్లాలపరంగా రోడ్డు ప్రమాదాల మరణాలను పరిశీ లిస్తే.. రాచకొండ (53), సైబరాబాద్ (43), సంగారెడ్డి (32), వరంగల్ (29), నిజామాబాద్ (25), మెదక్ (25) తరువాత స్థానాల్లో నిలిచాయి. జనవరి నెలలో సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఒక్క మరణమూ నమోదు కాలేదు.
కేసులు, చలానాలంటే లెక్కలేదు..: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన విషయంలోనూ ప్రజలకు లెక్కలేకుండా పోయింది. అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రహదారులపై పార్కింగ్, రవాణా వాహనాల్లో మనుషుల తరలింపు, సీటు బెల్టు ధరించకపోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. వీరికి చలానాలన్నా.. కేసులన్నా లెక్కలేకుండా పోతోంది. 31 రోజుల్లో 87,608 ఓవర్‌స్పీడు కేసులు నమోదయ్యాయంటే వాహనాల దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment