మితిమీరిన వేగం.. సీటు బెల్టు ధరించడంలో నిర్లక్ష్యం.. ఇవీ స్థూలంగా కార్ల వంటి తేలికపాటి వాహన ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కారు వెనుక సీట్లో కూర్చున్నప్పటికీ సీటు బెల్టు ధరించకపోవడం వల్లే ఆయన దుర్మరణం చెందారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీటు బెల్టు వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాద సమయంలో సీటు బెల్టు పనితీరు, సీటు బెల్టు–ఎయిర్‌బ్యాగ్‌ల అనుసంధానం, ఒక్కోసారి సీటుబెల్టు పెట్టుకున్నా ప్రమాదాల్లో మృతిచెందేందుకు ఉన్న అవకాశాల వంటి వాటిపై కథనం.
సాక్షి, హైదరాబాద్: మోటారు వాహన చట్ట నిబంధనల ప్రకారం ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు.. కార్ల వంటి ఇతర వాహనదారులు సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి. కానీ దేశంలో ఎక్కడా ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు కావట్లేదు. నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల జరిమానాలకు భయపడి సీటు బెల్ట్‌లు ధరిస్తున్నా హైవేలపై ప్రయాణాల్లో మాత్రం చాలా మంది సీటు బెల్ట్‌లు పెట్టుకోవడంలేదు. కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ సీట్లో కూర్చొనే వారు మినహా మిగిలిన వారు వాటిని ఉపయోగించట్లేదు. ఫలితంగా ప్రమాదాలబారిన పడినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు.
సీటు బెల్ట్ ధరించకపోతే అలారం మోగేలా కార్ల తయారీ కంపెనీలు సాంకేతికతను అభివృద్ధి చేశాయి. దీన్ని తప్పించుకోవడానికి చాలా మంది సీట్ బెల్ట్ బకెల్‌ను దాని సాకెట్‌లో పెట్టి... బెల్ట్‌ను మాత్రం తమకు, సీటుకు మధ్య ఉంచుతున్నారు. దీని కోసం సీట్ బెల్ట్ అలారం స్టాపర్ బకెల్స్‌ను వినియోగిస్తున్నారు. వాటిని కార్ డెకార్స్ దుకాణాలు విక్రయిస్తున్నాయి. అయితే ఈ బకెల్స్ ద్వారా అలారం మోగకుండా ఆపినా ప్రమాదం జరగకుండా ఆపలేవని పోలీసులు చెబుతున్నారు.
ప్రాణాలు నిలిపిన ‘బెల్ట్’...
ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో సీటుబెల్ట్ పెట్టుకోని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోవడంతో మృత్యుంజయుడు అయ్యాడు.
బెల్ట్ వాడని ఫలితం..
వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరో ముగ్గురితో కలసి 4న అహ్మదాబాద్–ముంబై హైవేపై వెళ్తుండగా మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ హైఎండ్ కారు ప్రమాదానికి గురైంది. ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో బ్రిడ్జి రెయిలింగ్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సీటు బెల్టు ధరించిన ముందు సీట్లోని ఇద్దరు గాయాలతో బయటపడగా వెనుక సీట్లో కూర్చున్న మిస్త్రీ, మరొకరు సీటు బెల్టు ధరించకపోవడంతో మృతిచెందారు.
సీటు బెల్ట్ ధరించకుంటే..
► నిర్ణీత వేగంతో వెళ్తున్న కారులో ప్రయాణికులు స్థిరంగా కూర్చున్నప్పటికీ వాహనం దేన్నయినా గుద్దుకున్నా లేదా హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా అందులోని వారు అదే వేగంతో ముందుకు వెళ్తారు.
► ఫలితంగా వాళ్లు డ్యాష్ బోర్డ్స్ (ముందు సీట్లో వారు), ముందు సీట్లు (వెనుక కూర్చున్న వారు), ముందు సీట్ల మధ్యలో ఉన్న ఖాళీ నుంచి అద్దం తదితరాలను అత్యంత వేగంగా ఢీకొంటారు.
► ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి లేదా డోర్ ఊడిపోతే అందులోంచి బయటకు ఎగిరి పడతారు. ఫలితంగా తల, ముఖం తదితర చోట్ల తీవ్ర గాయాలై మరణిస్తుంటారు.
సీటు బెల్ట్ ధరిస్తే..
► సీటు బెల్ట్ ధరించి ప్రయాణిస్తుప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్నా లేదా కారు పల్టీలు కొట్టినా లేదా ఒక్కసారిగా బ్రేక్ వేయాల్సి వచ్చినా ప్రయాణికులు వాహనంలోంచి ఎగిరిపడిపోకుండా కాపాడుతుంది.
► ముఖ్యంగా ప్రయాణికులు డ్యాష్ బోర్డు లేదా ముందు సీట్లకు గుద్దుకోకుండా సీటు బెల్ట్ వ్యతిరేక శక్తిని ప్రయోగిస్తుంది.
► ఫలితంగా ప్రయాణికులు కేవలం గాయాలతో బయటపడేందుకు ఎక్కువ అవకాశం ఉంది.
► 2016 మే 17న ఏపీ మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్‌ఆర్ రెయిలింగ్‌ను ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఆయన సతీమణి, డ్రైవర్ అక్కడికక్కడే కన్నుమూశారు. సీటు బెల్ట్ పెట్టుకున్న వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డారు.
ఒక్కోసారి ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నా...
అత్యాధునిక భద్రతా ప్రమాణాలు ఉండే హైఎండ్ కార్లు సైతం కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల ప్రాణాలు కాపడలేవని నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన వేగమే అందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. కొన్ని ప్రమాదాల్లో ఎయిర్ బ్యాగ్స్ సెన్సర్లు యాక్టివేట్ అయి, తెరుచుకోవడానికి కొంత సమయం పడుతుందని.. సాధారణంగా ఇది 0.05 సెకన్లుగా ఉంటుందని పేర్కొంటున్నారు. వాహనం మితిమీరిన వేగంతో ఉన్నప్పుడు ఈ సమయంలోపే డ్రైవర్ స్టీరింగ్ వరకు, పక్క సీటులో ఉన్న వారు డాష్‌బోర్డ్ వరకు ప్రయాణించి బలంగా ఢీకొనడం జరిగిపోతుందని వివరిస్తున్నారు.
స్పందించేందుకు సమయం...
ప్రతి వాహనచోదకుడు వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో ఏవైనా ముప్పు కనిపించినప్పుడు స్పందించి బ్రేక్ వేయడానికో లేదా పక్కను తప్పించుకోవడానికో ప్రయత్నిస్తాడు. ఇందుకు కొంత సమయం పడుతుంది. దీన్నే సాంకేతికంగా రెస్పాన్స్ టైమ్ అంటారు. ఎదుట ఉన్న ముప్పును మెదడు గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయడానికి పట్టే సమయమింది. ఈ మధ్యలోనే వాహనం కొంత మేర ముందుకు ప్రయాణించేస్తుంది.
ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీలు అనేకం..
హైఎండ్ కార్లలో ఎయిర్ బ్యాగ్‌కు–సీట్ బెల్ట్‌కు మధ్య లింకు ఉంటోంది. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు అవి తెరుచుకోవాలంటే దానికి సంబంధించిన సెన్సర్లు యాక్టివేట్ కావాలి. ఇవి ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ (ఏసీయూ)కు అనుసంధానమై ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు ఒత్తిడి కారణంగా ఇవన్నీ యాక్టివేట్ అయి ఓ యాంగిల్ ఏర్పరుచుకుని ఏసీయూకు సందేశం ఇవ్వడంతో అది బెలూన్‌ను యాక్టివేట్ చేసి తెరుచుకునేలా చేస్తుంది. ఈ ప్రక్రియ సెకనులోపు సమయంలోనే జరిగిపోతుంది. సీటు బెల్ట్‌లు పెట్టుకోకపోతే కొన్ని వాహనాల్లో ఎయిర్ బ్యాగ్స్ యాక్టివేట్ కావు.
Comments
Please login to add a commentAdd a comment