
సాక్షి, అమరావతి: గుంతల్లేని రహదారుల కోసం ఏపీలో రూ.303 కోట్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 వేల కి.మీ. మేర రహదారులపై గుంతల్ని పూడ్చనున్నారు. ఇందులో 2,060 కి.మీ మేర జిల్లా రహదారులకు రూ.197 కోట్లు, 940 కి.మీ. మేర రాష్ట్ర రహదారులకు రూ.106 కోట్లు కేటాయించనున్నారు. ప్రాధాన్యత క్రమంలో ట్రాఫిక్ అధికంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టనున్నారు. రోజుకు 6 వేల వాహనాలు వెళ్లే రోడ్లపై గుంతల్లేకుండా చేయనున్నారు. వర్షాకాలం సీజన్ ముగియడంతో వెంటనే పనులు చేపట్టేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరమ్మతులకు టెండర్లు పిలిచి పనులు కేటాయించనున్నారు. రూ.2,168 కోట్లతో 7,116 కి.మీ మేర రోడ్లు, వంతెనల మరమ్మతులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.
► ఏపీలో రహదారులపై గుంతల కారణంగా గతేడాది జరిగిన 96 రోడ్డు ప్రమాదాల్లో 32 మంది మృతి చెందగా, 149 మంది గాయపడ్డారు.
► మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ గణాంకాల ప్రకారం వంతెనలపై ప్రమాదాల కారణంగా 268 మంది మరణించగా, కల్వర్టుల వద్ద 121 మంది మృత్యువాత పడ్డారు.
► దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా రహదారులపై గుంతల కారణంగా రోడ్డు ప్రమాదాలు, తద్వారా మరణాలు చోటు చేసుకున్నాయి. 2,122 ప్రమాదాల్లో 1,034 మంది మరణించారు.
► ఏపీలో 1,100 వరకు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. వీటిని సరిచేసేందుకు రవాణా, పోలీస్, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తున్నారు.
► ఎన్‌హెచ్–65 (విజయవాడ–హైదరాబాద్)పై ముఖ్య కూడళ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఎన్‌హెచ్–44పై అనంతపురం జిల్లా పరిధిలో తపోవనం జంక్షన్ ప్రమాదకరంగా ఉంది. ఈ రహదారిపై పెన్నార్ భవన్ జంక్షన్, పంగల్ రోడ్, రుద్రంపేట ఫ్లై ఓవర్‌లపై ప్రమాదాలు జరుగుతున్నాయి.
► ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా రహదారి)పై అధికంగా రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఏలూరు ఆశ్రం ఆస్పత్రి, విజయవాడ–విశాఖ మధ్య ప్రమాదకర మలుపులు, జంక్షన్లు ఉన్నాయి. ఈ మేరకు ఇటీవలే రవాణా శాఖ.. రహదారి భద్రతపై ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు కమిటీకి నివేదిక సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment