NH 16
-
హైవేతో అమరావతి అనుసంధానం
సాక్షి, అమరావతి: రాజధాని(అమరావతి) ప్రాంతాన్ని చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి(ఎన్‌హెచ్–16)తో కలిపేందుకు సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ఇక్కడి గ్రామాల మీదుగా ఆరు లేన్లతో నాలుగు ప్రధాన రహదారులను నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఆరు లేన్ల రోడ్ల పనులకు సంబంధించి అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను సైతం సిద్ధం చేశారు. త్వరలో సీఎం చంద్రబాబుతో సమావేశమై నిర్ణయం తీసుకుని టెండర్లకు వెళ్లాలని సీఆర్డీఏ యోచిస్తోంది. రాజధాని అభివృద్ధిలో భాగంగా గతంలోనే ఈ రోడ్లకు అలైన్మెంట్ కూడా చేశారు. ఆ ప్రణాళిక ప్రకారమే వీటిని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. అమరావతిలోని ప్రధాన రహదారులను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రిడ్ విధానంలో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. తూర్పు నుంచి పడమరకు వెళ్లే రహదారులు ఈ–1 నుంచి ఈ–16 వరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే మార్గాలు ఎన్–1 నుంచి ఎన్–18 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ–5, ఈ–11, ఈ–13, ఈ–15 రోడ్లు నిర్మించి.. పడమర వైపు ఉన్న ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేస్తారు. కాగా, రాజధాని నుంచి గ్రామాల మీదుగా వెళ్తున్న ఈ రహదారుల నిర్మాణానికి పలుచోట్ల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ–5 రహదారి ఈ రోడ్డు నిర్మాణం ఉండవల్లి నుంచి ప్రారంభమవుతుంది. ఉండవల్లి, మందడం, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం మీదుగా జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు. మొత్తం 18 కి.మీలు మేర ఈ రోడ్డును నిర్మిస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా ఉండే ఈ మార్గం.. గ్రామాల మీదుగా వెళ్తుంది. ఈ క్రమంలో పలుచోట్ల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ–11 రహదారి నీరుకొండ నుంచి నవులూరు వరకు 6.3 కి.మీ మేర.. జాతీయ రహదారితో అనుసంధానించేందుకు మరో 4.50 కి.మీ మేర ఈ రోడ్డును నిర్మిస్తారు. ఈ రోడ్డును నీరుకొండ, కురగల్లు, నవులూరు మీదుగా మంగళగిరిలోని ఎయిమ్స్ ముందు నుంచి ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేస్తారు. ఈ–13 రహదారి నీరుకొండ నుంచి నవులూరు వరకు 7.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తారు. అనంతరం మంగళగిరి వద్ద ఎన్‌హెచ్–16తో అనుసంధానించేందుకు మరో 2.5 కి.మీ మేర రోడ్డును విస్తరించి ఎయిమ్స్ వెనుక నుంచి జాతీయ రహదారితో కలుపుతారు. ఈ రోడ్డు నీరుకొండ డౌన్ నుంచి నిడమర్రు, ఎర్రబాలెం, నవులూరు, మంగళగిరి మీదుగా వెళుతుంది. ఈ–15 రహదారి నిడమర్రు నుంచి జగనన్న లేఅవుట్, నవులూరు, క్రికెట్ స్టేడియం మీదుగా ఎయిమ్స్ వద్ద ఉన్న పాత హైవేకు అనుసంధానం చేస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రస్తుతం అసెంబ్లీ, సచివాలయాలకు వెళ్లేందుకు వినియోగిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు(ఈ–3)ను.. దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 21 కి.మీ.ల మేర నిర్మించతలపెట్టారు. అయితే, దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు 14 కి.మీ మేర రోడ్డు పూర్తయ్యాక అనేక వివాదాలతో పనులు నిలిచిపోయాయి. రెండో ప్యాకేజీగా బ్యారేజీ నుంచి మణిపాల్ ఆస్పత్రి వరకు 3 కి.మీ మేర రోడ్డును నిర్మించనున్నారు. మరో 4 కి.మీ మేర మార్గంలోని రైతులను ఒప్పించి మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేయాలని సీఆర్డీఏ భావిస్తోంది. ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో ఈ నెలలోనే టెండర్లకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. -
రయ్.. రయ్.. అనకాపల్లి–ఆనందపురం ఎన్‌హెచ్–16.. గంటకు 120 కి.మీ స్పీడ్..
బుల్లెట్లా దూసుకుపోవచ్చు.. మెరుపు వేగంతో సాగిపోవచ్చు.. దాదాపు పూర్తి కావచ్చిన అనకాపల్లి–ఆనందపురం ఆరు లేన్ల రహదారిపై గంటకు 120 కి.మీ వేగంతో వెళ్లవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు. మార్చి నెలాఖరుకు పూర్తి కానున్న ఈ రోడ్డు విస్తరణతో విశాఖ నగరానికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సాక్షి, అనకాపల్లి/తుమ్మపాల: సర్రున సాగిపోయేలా ఆరు లైన్ల రోడ్డు.. డివైడర్లపై ఆహ్లాదకరంగా వేలాది మొక్కల పెంపకం.. బ్రేకుతో పనిలేదు.. టోల్‌ప్లాజా వచ్చే వరకు వాహనాన్ని నిలపాల్సిన అవసరమే రాదు.. ఇవీ అనకాపల్లి–ఆనందపురం ఎన్‌హెచ్–16 జాతీయ రహదారి ప్రత్యేకతలు. విశాఖ నగరానికి రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను పరిష్కరించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగంగా అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం శరవేగంతో సాగుతోంది. రూ.2,013 కోట్లతో 50.8 కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మిస్తున్నారు. ఢిల్లీకి చెందిన మెగా ఇంజనీరింగ్ డీబీఎల్ సంస్ధ 98 శాతం పనులు పూర్తి చేసి మార్చి నెలాఖరు నాటికి జాతికి అంకితం చేసేందుకు వేగం పెంచింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంగా వాహనాలు ప్రయాణించేలా ఈ రహదారిని విస్తరించారు. టోల్‌ప్లాజా వద్ద తప్పితే మరెక్కడా ఆగాల్సిన అవసరం ఉండదు. ప్రతి రెండు కిలోమీటర్లకు సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్‌తో నిఘా ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్పీడ్ డిస్ప్లే, స్పీడ్ కంట్రోల్, ట్రాఫిక్ సిగ్నల్స్ తెలుసుకోవడం కూడా సులభంగా ఉంటుంది. చీకటిగా ఉన్న ప్రాంతాల్లో, వంతెనల జంక్షన్లలో ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి చెన్నై–కలకత్తా 16వ నంబర్ జాతీయ రహదారి అనకాపల్లి, గాజువాక, ఎన్ఏడీ, విశాఖనగరం మీదుగా సాగిపోతుంది. రవాణా, ప్రజా రవాణా తదితర వాహనాలు విశాఖ నగరం మీద నుంచి రాకపోకలు చేయడంతో నిత్యం తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యేవి. అనకాపల్లి నుంచి సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం వరకు జాతీయ రహదారిని కలుపుతూ ఈ ప్రాజెక్టు చేపట్టడంతో నగరానికి ట్రాఫిక్ సమస్య తొలగిపోనుంది. కేవలం పనులు ఉన్నవారు మాత్రమే నగరంలోకి వస్తారు. విజయవాడ నుంచి వచ్చే వాహనాలు అనకాపల్లి వద్ద బైపాస్ నుంచి సబ్బవరం మీదుగా ఆనందపురం వద్ద జాతీయ రహదారికి చేరుకుంటాయి. దీంతో నగరానికి ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. విశాఖ నగరానికి ఇది బైపాస్ రోడ్డుగా ఉపయోగపడనుంది. సబ్బవరం దగ్గర ఒక ఇంటర్ చేంజ్ సెక్షన్, పెందుర్తి దగ్గర మరొకటి ఏర్పాటు చేయడంతో విశాఖనగరానికి వెళ్లేందుకు మరిన్ని దారులు ఏర్పడ్డాయి. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఈ జాతీయ రహదారి పొడవు 50.8 కిలోమీటర్ల మేర ఉంది. రోడ్డు పొడవున ఇరువైపులా 15 వేలకు పైగా మొక్కలు నాటడం, నిత్యం వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడం చేస్తున్నారు. అదేవిధంగా రోడ్డుకు మధ్యలో 32 వేలకు పైగా మొక్కలను నాటుతున్నారు. స్ధానికులకు నో టోల్‌ట్యాక్స్ ఈ రహదారిపై మొత్తం మూడు టోల్‌ప్లాజాలను ఏర్పాటు చేయనున్నారు. క్లోజ్డ్ టోలింగ్ సిస్టమ్ ద్వారా అనకాపల్లి వద్ద మర్రిపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం ప్రాంతాలలో చేపట్టే టోల్‌ప్లాజాల వద్ద స్ధానికులు టోల్‌ఫీజు చెల్లించనక్కరలేదు. సరీ్వసు రోడ్డును ఏ టోల్‌ప్లాజాకు అనుసంధానం చేయడం లేదు. దీంతో స్ధానికులు టోల్‌ప్లాజాకు వెళ్లాల్సిన పనిలేకుండా సులభతరం చేస్తున్నారు. రూ.2,013 కోట్లతో నిర్మాణం దాదాపు 35 గ్రామాలను తాకుతూ నిర్మిస్తున్న ఈ రోడ్డుకు ప్రభుత్వం రూ.2,013 కోట్లు నిధులు వెచ్చిస్తోంది. ఈ మార్గంలో అనకాపల్లి బైపాస్ వద్ద ఒకటి, సబ్బవరం, పెందుర్తి జంక్షన్లలో మూడు ఇంటర్ చేంజ్ సెక్షన్లు, రెండు రైల్వే వంతెనలతో పాటు 21 అండర్ బ్రిడ్జిలు, 10 వంతెనలు, 52 బాక్స్ కల్వర్టులు, 44 పైప్ కల్వర్టులు, 25 గ్రామాల వద్ద అప్రోచ్ రోడ్లు, 34 బస్స్టేషన్లు, 20 జంక్షన్లను రూపొందించారు. ఫ్లైఓవర్ల వద్ద గడ్డర్లు ఏర్పాటు చేసే ప్రాజెక్టును డీబీఎల్ సంస్ధ చేపడుతుంది. మార్చి నెలాఖరుకు పనులు పూర్తి జాతీయ రహదారి విస్తరణ పనులు 98 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెలాఖరునాటికి పనులు పూర్తయ్యేలా వేగం పెంచాం. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఏర్పాటు చేసిన జాతీయ రహదారి విస్తరణ పనులతో విశాఖ నగరానికి ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. రోడ్డుపై ప్రతి రెండు కిలోమీటర్ల వద్ద సీసీ కెమెరాలు, జాతీయ రహదారి కూడలిలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశాం. ప్రమాదాలకు తావు లేకుండా ఆధునిక విధానంలో నిర్మాణం చేపట్టిన జాతీయ రహదారి ఇది. వేగంతో వెళ్లినా ప్రమాదాలకు తావు లేకుండా జాతీయ రహదారి ఉంటుంది. – ప్రమోద్‌కుమార్, ప్రాజెక్టు మేనేజర్, డీబీఎల్ సంస్ధ -
మృత్యుహైవే..37 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
మార్కాపురం టౌన్/మద్దిపాడు(ప్రకాశం జిల్లా): హైవే రోడ్లు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రయాణికుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ మలికా గర్గ్ నేతృత్వంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ప్రతి శనివారం నేషనల్, స్టేట్ హైవేలపై నో యాక్సిడెంట్ డేగా నిర్ణయించి తనిఖీలు చేస్తున్నారు. ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ఒక వైపు ప్రజలకు ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మరో వైపు నిబంధనలు ఉల్లంఘంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఒంగోలు–చెన్నై, ఒంగోలు–విజయవాడ ఎన్‌హెచ్ 16, ఒంగోలు–చీమకుర్తి పరిధిలోని స్టేట్ హైవే నంబర్ 39, గిద్దలూరు–విజయవాడ పరిధిలోని ఎన్‌హెచ్ 544డి, మార్కాపురం టౌన్‌లోని బోడపాడు క్రాస్ రోడ్‌లోని ఎన్‌హెచ్ 565 పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్లాక్ స్పాట్స్‌లో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. వీటి వద్ద బోర్డులు ఏర్పాటు చేయటంతో పాటు స్పీడ్ బ్రేకర్లను, బ్లింకింగ్ లైట్స్ సిస్టంను ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చిల్లచెట్లను తొలగిస్తున్నారు. గ్రామాలు పాఠశాలలు, మలుపుల వద్ద వాహనదారులను అలర్టు చేసేందుకు మార్కింగ్ చేశారు. గత నెల 24వ తేదీన డీఐజి త్రివిక్రమ వర్మ మద్దిపాడు మండలంలోని బ్లాక్ స్పాట్లను పరిశీలించి ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ఎస్పీ మలికాగర్గ్‌కు పలు సూచనలు చేశారు. కారణాలు ఇవే „ నేషనల్ హైవే నిబంధనల ప్రకారం హైవే రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఉండవు „ 100 నుంచి 140 కిలో మీటర్ల మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో వాహనం అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. „ మద్యం తాగి వాహనం నడపటం „ గ్రామాల వద్ద, మలుపుల వద్ద వాహనం నిదానంగా కాకుండా వేగంగా వెళ్లడం, ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించక ప్రమాదాలు జరుగుతున్నాయి. „ హెల్మెట్ వాడకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటంతో ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. „ హైవేపై ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత నెలలో జరిగిన ప్రమాదాల్లో కొన్ని అమరావతి–అనంతపురం హైవేపై కంభం రైల్వేస్టేషన్ వద్ద ఆగస్టు 8వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. 12న కొనకనమిట్ల మండలంలో జాతీయ రహదారిపై బైక్ ఢీకొని వృద్దుడు మృతి. 16న బేస్తవారిపేట పరిధిలో బస్సును బైక్ ఢీకొని యువకుడు మృతి. దర్శిలో బైక్‌పై వెళ్తూ బస్సును ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి. 20వ తేదీన తాళ్లూరు మండలం గంగవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెలు మృతి. 23న జే పంగులూరు మండలం కొండమంజులూరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 28వ తేదీ కొమరోలు మండలంలో బైక్‌ను ఢీకొట్టిన లారీ, బైక్‌పై ఉన్న ఇద్దరు మృత్యువాత. 2019వ సంవత్సరంలో బ్లాక్ స్పాట్ల వద్ద 24 మంది చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2020లో 18 మంది ప్రమాదాల్లో చనిపోగా 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. నలుగురికి గాయాలయ్యాయి. 2021లో 22 మంది చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2022లో ఆగస్టు వరకూ 11 మంది మృతిచెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నివారణ చర్యలు తీసుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాం. నివారణకు మా సిబ్బంది వాహనదారులకు అవగాహన కలి్పస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. స్పీడ్ గన్లు ఏర్పాటు చేశాం. దీంతో హై స్పీడ్‌తో వెళ్తున్న వాహనాలను గుర్తించి జరిమానా విధిస్తున్నాం. ప్రతి శనివారం జిల్లా వ్యాప్తంగా నో యాక్సిడెంట్ డేను అమలు చేస్తున్నాం. పోలీస్ అధికారులు తమ సిబ్బందితో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు వాహనాల తనిఖీ చేపడుతున్నారు. – మలికాగర్గ్, జిల్లా ఎస్పీ బ్లాక్ స్పాట్లు మార్కాపురం పరిధిలోని బోడపాడు క్రాస్‌రోడ్డు, కొనకనమిట్ల జంక్షన్, రాయవరం పలకల గనులు, పెద్దారవీడు సమీపంలోని హనుమాన్ జంక్షన్, నేషనల్ హైవేపై ఉన్న గొబ్బూరు, తోకపల్లి, దేవరాజుగట్టు, కంభం సమీపంలో హైవేపై ఉన్న పెట్రోల్ బంకు వద్ద, గిద్దలూరు సమీపంలోని త్రిపురాపురం క్రాస్‌రోడ్, బేస్తవారిపేట సమీపంలోని పెంచికలపాడు, యర్రగొండపాలెం పరిధిలోని గురిజేపల్లి, బోయలపల్లి, దోర్నాల సమీపంలోని చింతల, చిన్నారుట్ల మలుపు, పుల్లలచెరువు సమీపంలోని మల్లపాలెం క్రాస్‌రోడ్డు, త్రిపురాంతకం సమీపంలోని నేషనల్ హైవేపై ఉన్న గొల్లపల్లి, డీబీఎన్ కాలనీ క్రాస్ రోడ్ల వద్ద తరచుగా రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ బైపాస్ జంక్షన్, సంఘమిత్ర హాస్పిటల్ రోడ్డు, వెంగముక్కలపాలెం జంక్షన్, త్రోవగుంట, ఏడుగుండ్లపాడు, కొప్పోలు ఫ్లైఓవర్ జంక్షన్, మద్దిపాడు పరిధిలోని గ్రోత్ సెంటర్, చీమకుర్తి పరిధిలోని మర్రిచెట్లపాలెం జంక్షన్, ఈస్ట్ బైపాస్ రోడ్డు, రెడ్డి నగర్, సంతనూతలపాడు పరిధిలోని ఒంగోలు రోడ్డు, సింగరాయ కొండ పరిధిలోని కనుమళ్ల క్రాస్‌రోడ్డు, టంగుటూరు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజి, వల్లూరమ్మ గుడి మధ్య, సూరారెడ్డిపాలెం ఐవోసీ ప్రాంతం, కొండపి ఫైవోవర్ బ్రిడ్జి దగ్గర తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. -
గుంతల్లేని రహదారుల కోసం రూ.303 కోట్లు
సాక్షి, అమరావతి: గుంతల్లేని రహదారుల కోసం ఏపీలో రూ.303 కోట్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 వేల కి.మీ. మేర రహదారులపై గుంతల్ని పూడ్చనున్నారు. ఇందులో 2,060 కి.మీ మేర జిల్లా రహదారులకు రూ.197 కోట్లు, 940 కి.మీ. మేర రాష్ట్ర రహదారులకు రూ.106 కోట్లు కేటాయించనున్నారు. ప్రాధాన్యత క్రమంలో ట్రాఫిక్ అధికంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టనున్నారు. రోజుకు 6 వేల వాహనాలు వెళ్లే రోడ్లపై గుంతల్లేకుండా చేయనున్నారు. వర్షాకాలం సీజన్ ముగియడంతో వెంటనే పనులు చేపట్టేందుకు ఆర్అండ్బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరమ్మతులకు టెండర్లు పిలిచి పనులు కేటాయించనున్నారు. రూ.2,168 కోట్లతో 7,116 కి.మీ మేర రోడ్లు, వంతెనల మరమ్మతులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ► ఏపీలో రహదారులపై గుంతల కారణంగా గతేడాది జరిగిన 96 రోడ్డు ప్రమాదాల్లో 32 మంది మృతి చెందగా, 149 మంది గాయపడ్డారు. ► మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ గణాంకాల ప్రకారం వంతెనలపై ప్రమాదాల కారణంగా 268 మంది మరణించగా, కల్వర్టుల వద్ద 121 మంది మృత్యువాత పడ్డారు. ► దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా రహదారులపై గుంతల కారణంగా రోడ్డు ప్రమాదాలు, తద్వారా మరణాలు చోటు చేసుకున్నాయి. 2,122 ప్రమాదాల్లో 1,034 మంది మరణించారు. ► ఏపీలో 1,100 వరకు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. వీటిని సరిచేసేందుకు రవాణా, పోలీస్, ఆర్అండ్బీ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తున్నారు. ► ఎన్‌హెచ్–65 (విజయవాడ–హైదరాబాద్)పై ముఖ్య కూడళ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఎన్‌హెచ్–44పై అనంతపురం జిల్లా పరిధిలో తపోవనం జంక్షన్ ప్రమాదకరంగా ఉంది. ఈ రహదారిపై పెన్నార్ భవన్ జంక్షన్, పంగల్ రోడ్, రుద్రంపేట ఫ్లై ఓవర్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ► ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా రహదారి)పై అధికంగా రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఏలూరు ఆశ్రం ఆస్పత్రి, విజయవాడ–విశాఖ మధ్య ప్రమాదకర మలుపులు, జంక్షన్లు ఉన్నాయి. ఈ మేరకు ఇటీవలే రవాణా శాఖ.. రహదారి భద్రతపై ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు కమిటీకి నివేదిక సమర్పించింది. -
ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో రూ.3,500 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని కావూరు కోల్‌కతా–చెన్నై (ఎన్‌హెచ్–16)రహదారికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. టీడీపీ హయాంలో అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి గ్రామంలోని 650 ఎకరాలను స్వాధీనం చేసుకోనున్నట్టు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఈ గ్రామంలోనే ఎక్స్‌ప్రెస్ వే జంక్షన్ ఏర్పాటు చేస్తామని, అందుకు సుమారు 200 నుంచి 400 ఎకరాల వరకు తీసుకుంటామని అధికారులు రైతుల్ని భయపెట్టారు. ఇప్పుడా పరిస్థితి మారింది. ఎక్స్‌ప్రెస్ వేను ఎన్‌హెచ్–16కు సమాంతరంగా నిర్మించడానికి బదులు కావూరు సమీపంలో ఎన్‌హెచ్–16తో అనుసంధానించేలా నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో అధికారులు ఎక్స్‌ప్రెస్ వేను ఎన్‌హెచ్–16కు అనుసంధానించడం ద్వారా దూరం తగ్గేలా చూడటంతో పాటు రైతుల భూములకు ఇబ్బందులు లేకుండా చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల్ని కేంద్రం అనుమతించింది. ఫలితంగా ఈ ప్రాంతంలో 47 కిలోమీటర్లు దూరం తగ్గడంతో పాటు 741 హెక్టార్ల భూమిని సేకరించే ప్రతిపాదనలు వెనక్కి మళ్లాయి. అలైన్మెంట్ మార్పుతో రూ.3,500 కోట్లు ఆదా ► రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎక్స్‌ప్రెస్ వే అలైన్మెంట్ మార్చడంతో ఏకంగా రూ.3,500 కోట్ల ఖర్చు తగ్గింది. ► టీడీపీ హయాంలో అనంతపురం నుంచి చిలకలూరిపేట వద్ద కావూరు నుంచి నూజెండ్ల, మేడికొండూరు, తాడికొండ మీదుగా అమరావతికి చేరేలా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు. ► 371.03 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి రూ.27,635 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో ఆర్వీ అసోసియేట్స్ సంస్థతో ప్రతిపాదనలు తయారు చేయించారు. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రైతుల నుంచి భారీగా భూములు సేకరించకుండా ఎక్స్‌ప్రెస్ వేను నేరుగా చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానిస్తే.. దూరం తగ్గడంతో పాటు ఖర్చు కూడా రూ.3,500 కోట్లు తగ్గుతుందని ప్రతిపాదించగా.. కేంద్రం అంగీకరించింది. ► ఇప్పుడు రూ.867 కోట్లతో చిలకలూరిపేట బైపాస్ నిర్మాణం ప్రారంభమైంది. అనంతపురం–అమరావతి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ స్వరూపమిదీ మార్గం: అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా అంచనా వ్యయం: రూ.27,635 కోట్లు తగ్గనున్న దూరం: 101 కిలోమీటర్లు తగ్గనున్న ప్రయాణ సమయం: 2 గంటలు టీడీపీ హయాంలో ప్రతిపాదించిన భూసేకరణ: 1,302.74 హెక్టార్లు (3,217.77 ఎకరాలు) గతంలో ప్రతిపాదించిన దూరం: 81.993 కి.మీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ: 561.48 హెక్టార్లు తగ్గే దూరం: మరో 47 కిలోమీటర్లు తగ్గిన భూ సేకరణ : 741.26 హెక్టార్లు -
516–ఇ జాతీయ రహదారికి అటవీ అనుమతులు
సాక్షి, అమరావతి: చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16) మార్గంలో రాజమహేంద్రవరం నుంచి విజయనగరంవరకు నిర్మించే మరో జాతీయ రహదారి (516 –ఇ)కి అటవీ అనుమతులు మంజూరయ్యాయి. దీంతో రహదారి నిర్మాణ పనులు త్వరలో మొదలు కానున్నాయి. రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం, రంపచోడవరం నుంచి కొయ్యూరు, కొయ్యూరు నుంచి లంబసింగి, లంబసింగి నుంచి పాడేరు, పాడేరు నుంచి అరకు, అరకు నుంచి గౌడార్ మీదుగా శృంగవరపు కోట, విజయనగరం వరకు ఆరు ప్యాకేజీలుగా విభజించారు. మొత్తం రూ. 1,500 కోట్ల అంచనాలతో 406 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లు తయారుచేసి కేంద్రానికి సమర్పించింది. ఇందులో మొదటగా మూడు ప్యాకేజీల కింద 137 కిలోమీటర్లకు గాను రూ. 457 కోట్ల పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పనులకు మార్చిలో టెండర్లు ఖరారు చేయనున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. 2017లోనే ఈ రహదారి నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చింది. ఆ తర్వాత జాతీయ రహదారి నంబర్ 516–ఇ గా నోటిఫికేషన్ జారీ చేసింది. రహదారి నిర్మాణానికి డీపీఆర్‌లు పూర్తి చేయాలని కేంద్రం గతంలో సూచించినా.. గత టీడీపీ ప్రభుత్వం వినలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టులో పురోగతి వచ్చింది. గతేడాది అక్టోబరులో డీపీఆర్‌లు తయారుచేసి కేంద్రానికి పంపి అనుమతులు సాధించింది. అధిక శాతం ఘాట్ రోడ్డు నిర్మాణమే.. గిరిజన గ్రామాల మీదుగా ఉండే ఈ జాతీయ రహదారిలో అధిక శాతం రెండు వరుసల ఘాట్ రోడ్డు నిర్మాణమే ఉంటుంది. ప్రస్తుతం రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా) వయా.. తుని, అన్నవరం, అనకాపల్లి మీదుగా 227 కిలోమీటర్ల వరకు పొడవు ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ నిర్మించే కొత్త జాతీయ రహదారి 516–ఇ పొడవు 406 కిలోమీటర్లు ఉంటుంది. పర్యాటకంగా, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధితో పాటు మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించేందుకు కేంద్రం ఈ జాతీయ రహదారి చేపట్టినట్లు ఎన్హెచ్ఏఐ వర్గాలు పేర్కొంటున్నాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఈ రహదారికి ప్రాధాన్యత ఏర్పడనుంది. భద్రాచలంకు ఈ ఏజెన్సీ ప్రాంతాలు దగ్గరగా ఉండటంతో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వారికి ఈ జాతీయ రహదారి వెసులుబాటుగా ఉంటుంది. -
బలవంతంగానైనా భూములు లాక్కోండి
సాక్షి, అమరావతి: కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి (ఎన్‌హెచ్–16) సమాంతరంగా ఉన్న కత్తిపూడి–ఒంగోలు జాతీయ రహదారి (ఎన్‌హెచ్–216) విస్తరణ పనుల్లో భూ యజమానుల నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండు నెలల నుంచి ఆందోళనలు చేస్తున్న బాధితులు గోడు పట్టించుకోకుండానే మరింత కఠినంగా వ్యవహరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది జూలై కల్లా ఎన్‌హెచ్–216 విస్తరణ పనులు పూర్తి చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించిన నేపథ్యంలో.. భూ సేకరణకు అడ్డుపడితే కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే బలవంతంగా భూములు లాక్కోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరుకు సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌హెచ్–216 విస్తరణలో భాగంగా కాకినాడ బైపాస్ నిర్మాణానికి కేంద్రం రూ. 350.61 కోట్లు మంజూరు చేసింది. 20 కి.మీ. బైపాస్ నిర్మాణానికి 195 ఎకరాలు అవసరం కాగా, రోడ్డు అలైన్మెంట్ మార్చారని, భవనాలకు అసంబద్ధంగా రేటు నిర్ణయించి పరిహారం అతి తక్కువగా ఇస్తున్నారని స్థానికులు కొద్ది రోజుల్నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. నడకుదురు, తూరంగి గ్రామాల్లో రెండు కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మాణం ఇష్టారీతిన మలుపులు తిప్పారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల ఆందోళనపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. అవన్నీ పట్టించుకోకుండా తాజాగా ఆదేశాలివ్వడం గ్రామస్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఆది నుంచి అన్నీ అనుమానాలే ఎన్‌హెచ్–216 విస్తరణకు రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను 2012లోనే అనుమతి కోసం కేంద్రానికి పంపించారు. 2013లో 351 కిలోమీటర్ల ఈ రహదారి విస్తరణకు అనుమతి లభించింది. అయితే ఈ రహదారి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యావరణ అనుమతులు పొందాలి. సామాజిక ప్రభావ అంచనా నిర్వహించి ప్రజల అనుమతి పొందాలి. ఇవేవీ లేకుండా రహదారికి విస్తరణ పనుల్ని కాంట్రాక్టు సంస్థ చేపట్టినట్లు భూ బాధితులు ఆందోళన చేస్తున్నారు. కాకినాడ బైపాస్ రోడ్డు అలైన్మెంట్ మార్చారని ఆరోపిస్తున్నారు. 195 ఎకరాలకు రూ.101 కోట్లు డిపాజిట్ కాకినాడ బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే 195 ఎకరాలకుగాను ఎన్హెచ్ఏఐ రూ. 101 కోట్లు డిపాజిట్ చేసింది. ఈ డబ్బుతోనే భూ సేకరణ చేపట్టాల్సిందిగా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఇక్కడ గజం రూ. 4,500 ఉంటే ప్రభుత్వం గజం విలువ రూ. 300 లెక్కగట్టి దానికి మూడు రెట్లు పరిహారం పెంచి రూ. 900 చొప్పున పరిహారం చెల్లిస్తామని రెవెన్యూ యంత్రాంగం చెబుతుండటంతో భూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విస్తరణలో విచిత్రాలు
ఈయన పేరు మండా వీర వెంకట సత్యనారాయణ (బుజ్జిబాబు). దేవరపల్లి మండలం యర్నగూడెం వాసి. ఈయనకు ఆ రెవెన్యూ గ్రామంలో మూడు చోట్ల 4.25 ఎకరాల పొలం ఉంది. పోలవరం కుడి ప్రధాన కాలువ తవ్వకానికి ఇందులో 1.25 ఎకరాలు పోయింది. తాడిపూడి ఎత్తిపోతల ప్రధాన కాలువ తవ్వకం నిమిత్తం 1.25 ఎకరాలు, ఉపకాలువ తవ్వకానికి అర ఎకరం పోయాయి. ఇక ఉన్న 1.25 ఎకరాల మధ్యలోంచి ఇప్పుడు గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు విస్తరించనున్న (జీకే)జాతీయ రహదారి–16 వెళుతుంది. ఇలా ఉన్న భూమంతా భూసేకరణలో తీసేసుకుంటే ఈ రైతుకు సెంటుభూమి కూడా మిగిలే పరిస్థితి లేదు. ఇది ఈ ఒక్క రైతు సమస్య కాదు. ఇటువంటి బాధితులు ఎందరో. విస్తరణలో విచిత్రాలెన్నో.. కొందరు బోర్లు, ట్రా¯Œ్సఫార్మర్లు కోల్పోయి సాగుకు దూరమయ్యే దుస్థితి ఉంది. కొవ్వూరు : గుండుగొలను– కొవ్వూరు మధ్య విస్తరించతలపెట్టిన జాతీయ రహదారి జిల్లాలో తొమ్మిది మండలాల పరిధిలోని 22 రెవెన్యూ గ్రామాల మీదుగా వెళ్తుంది. దీనికోసం 1,111 ఎకరాల భూమి సేకరించాలని సర్కారు నోటిఫికేష¯ŒS ఇచ్చింది. కొవ్వూరు రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలో 574.95 ఎకరాలు, ఏలూరు రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలో 436.05 ఎకరాలు సేకరించనున్నారు. ప్రస్తుతం మార్కింగ్ పనులు సాగుతున్నాయి. సెప్టెంబర్ 9న భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేష¯ŒS జారీ చేసింది. అదే నెల 29 వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. నోటిఫికేష¯ŒSలో ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి సేకరిస్తున్నారో మాత్రమే ప్రకటించారు. ఏ రైతుకు చెందిన ఎంతభూమి తీసుకుంటారో స్పష్టం చేయలేదు. అభ్యంతరాలను పట్టించుకోలేదు కొవ్వూరు రెవెన్యూ డివిజ¯ŒSనుంచి 71, ఏలూరు డివిజ¯ŒS నుంచి 89 అభ్యంతరాలు అందాయి. వీటిలో ఏ ఒక్క అభ్యంతరానికీ అధికారులు స్వష్టమైన వివరణ ఇవ్వలేదు. ఒకవైపు రైతులు సర్వేకి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఎక్కడికక్కడే రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. భూములకు ధర నిర్ణయం, పొలాలకు వెళ్లె పుంతరోడ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వాలని అధికారులను రైతులు నిలదీస్తున్నారు. రైతులకు చెందిన కొంత భూమి జాతీయ రహదారికి ఒకవైపు ఉంటే మరికొంత భూమి మరో వైపు ఉండడం వల్ల సాగునీరందించే బోర్లు, ట్రా¯Œ్సఫార్మర్లను అన్నదాతలు కోల్పోతున్నారు. పొలాలకు వెళ్లే పుంతరోడ్లు మాయం కానున్నాయి. వీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నారన్నదానిపై అధికారులు నోరుమెదపడం లేదు. అక్కడక్కడ సర్వీసు రోడ్లు వేస్తారని చెబుతున్నా.. ఎక్కడెక్కడ వేస్తారన్న విషయం వెల్లడించడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ రహదారుల భూసేకరణ చట్ట ప్రకారం.. నిర్బంధ భూసేకరణకు అవకాశం ఉండడంతో రైతుల వాదనలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధరల నిర్ణయంపై అభ్యంతరాలు గోదావరి నుంచి కృష్ణానదికి నీళ్లు తరలించుకుపోయేందుకు నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం దెందులూరు మండలంలో ఎకరం బేసిక్ విలువ రూ.8లక్షలుంటే రూ.38 లక్షలు పరిహారం చెల్లించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలై 13న 262 జీవోను జారీ చేసింది. 2006లో తాడిపూడి, పోలవరం కాలువల తవ్వకం సమయంలో కొబ్బరి, ఆయిల్‌పామ్ చెట్లకు చెట్టుకు రూ.1,600 చెల్లించారు. ఇదే పోలవరం కాలువ తవ్వకంలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ కోసం ప్రభుత్వం 262 జీవో ప్రకారం కొబ్బరి, ఆయిల్‌పామ్æ చెట్టు ఒక్కంటికి రూ.9,200 చొప్పున గత ఏడాది చెల్లించారని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి భూసేకరణ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండడంతో రాష్ట్ర సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తోంది. రైతుల అభ్యంతరాలను పరిష్కరించడంలో స్థానిక ప్రజాప్రతినిధులూ శ్రద్ధ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారుల భూసేకరణ చట్టం ప్రకారం 389 జీవో సెక్ష¯ŒS 28 ప్రకారం కేవలం బేసిక్ విలువపై రెండున్నర రెట్లు మాత్రమే చెల్లిస్తామని అధికారులు అంటున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే పోలవరం, తాడిపూడి కాలువ తవ్వకం మూలంగా ఇదే ప్రాంతంలో రైతులు భూములు కోల్పోయారు. మళ్లీ దేవరపల్లి, నల్లజర్ల, భీమడోలు అదే రైతులకు చెందిన భూములను ఇప్పుడు జాతీయ రహదారి నిమిత్తం సేకరిస్తుండడంతో రైతుల్లో గుబులు మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమకు చెల్లించినట్టే నాలుగురెట్ల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేసుకుని రైతుల అభ్యంతరాలకు పరిష్కార మార్గాలు చూపిన తర్వాతే భూసేకరణ చేయాలని రైతులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి..
గొల్లప్రోలు మండలం వట్టెపూడి సెంటర్లో 16వ నెంబర్ జాతీయ రహదారిపై బైక్‌ను టాటా సుమో ఢీకొట్టి అదే వేగంతో పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న స్థానిక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. సుమోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. వీరంతా సుమోలో రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.