సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని కావూరు కోల్‌కతా–చెన్నై (ఎన్‌హెచ్–16)రహదారికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. టీడీపీ హయాంలో అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి గ్రామంలోని 650 ఎకరాలను స్వాధీనం చేసుకోనున్నట్టు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఈ గ్రామంలోనే ఎక్స్‌ప్రెస్ వే జంక్షన్ ఏర్పాటు చేస్తామని, అందుకు సుమారు 200 నుంచి 400 ఎకరాల వరకు తీసుకుంటామని అధికారులు రైతుల్ని భయపెట్టారు. ఇప్పుడా పరిస్థితి మారింది. ఎక్స్‌ప్రెస్ వేను ఎన్‌హెచ్–16కు సమాంతరంగా నిర్మించడానికి బదులు కావూరు సమీపంలో ఎన్‌హెచ్–16తో అనుసంధానించేలా నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో అధికారులు ఎక్స్‌ప్రెస్ వేను ఎన్‌హెచ్–16కు అనుసంధానించడం ద్వారా దూరం తగ్గేలా చూడటంతో పాటు రైతుల భూములకు ఇబ్బందులు లేకుండా చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల్ని కేంద్రం అనుమతించింది. ఫలితంగా ఈ ప్రాంతంలో 47 కిలోమీటర్లు దూరం తగ్గడంతో పాటు 741 హెక్టార్ల భూమిని సేకరించే ప్రతిపాదనలు వెనక్కి మళ్లాయి.
అలైన్‌మెంట్ మార్పుతో రూ.3,500 కోట్లు ఆదా
► రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎక్స్‌ప్రెస్ వే అలైన్‌మెంట్ మార్చడంతో ఏకంగా రూ.3,500 కోట్ల ఖర్చు తగ్గింది.
► టీడీపీ హయాంలో అనంతపురం నుంచి చిలకలూరిపేట వద్ద కావూరు నుంచి నూజెండ్ల, మేడికొండూరు, తాడికొండ మీదుగా అమరావతికి చేరేలా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు.
► 371.03 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి రూ.27,635 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో ఆర్వీ అసోసియేట్స్ సంస్థతో ప్రతిపాదనలు తయారు చేయించారు.
► వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే రైతుల నుంచి భారీగా భూములు సేకరించకుండా ఎక్స్‌ప్రెస్ వేను నేరుగా చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానిస్తే.. దూరం తగ్గడంతో పాటు ఖర్చు కూడా రూ.3,500 కోట్లు తగ్గుతుందని ప్రతిపాదించగా.. కేంద్రం అంగీకరించింది.
► ఇప్పుడు రూ.867 కోట్లతో చిలకలూరిపేట బైపాస్ నిర్మాణం ప్రారంభమైంది.
అనంతపురం–అమరావతి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ స్వరూపమిదీ
మార్గం: అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా
అంచనా వ్యయం: రూ.27,635 కోట్లు
తగ్గనున్న దూరం: 101 కిలోమీటర్లు
తగ్గనున్న ప్రయాణ సమయం: 2 గంటలు
టీడీపీ హయాంలో ప్రతిపాదించిన భూసేకరణ: 1,302.74 హెక్టార్లు (3,217.77 ఎకరాలు)
గతంలో ప్రతిపాదించిన దూరం: 81.993 కి.మీ
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ: 561.48 హెక్టార్లు
తగ్గే దూరం: మరో 47 కిలోమీటర్లు
తగ్గిన భూ సేకరణ : 741.26 హెక్టార్లు
Comments
Please login to add a commentAdd a comment