
సాక్షి, అమరావతి: చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16) మార్గంలో రాజమహేంద్రవరం నుంచి విజయనగరంవరకు నిర్మించే మరో జాతీయ రహదారి (516 –ఇ)కి అటవీ అనుమతులు మంజూరయ్యాయి. దీంతో రహదారి నిర్మాణ పనులు త్వరలో మొదలు కానున్నాయి. రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం, రంపచోడవరం నుంచి కొయ్యూరు, కొయ్యూరు నుంచి లంబసింగి, లంబసింగి నుంచి పాడేరు, పాడేరు నుంచి అరకు, అరకు నుంచి గౌడార్ మీదుగా శృంగవరపు కోట, విజయనగరం వరకు ఆరు ప్యాకేజీలుగా విభజించారు. మొత్తం రూ. 1,500 కోట్ల అంచనాలతో 406 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లు తయారుచేసి కేంద్రానికి సమర్పించింది. ఇందులో మొదటగా మూడు ప్యాకేజీల కింద 137 కిలోమీటర్లకు గాను రూ. 457 కోట్ల పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ఈ పనులకు మార్చిలో టెండర్లు ఖరారు చేయనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. 2017లోనే ఈ రహదారి నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చింది. ఆ తర్వాత జాతీయ రహదారి నంబర్ 516–ఇ గా నోటిఫికేషన్ జారీ చేసింది. రహదారి నిర్మాణానికి డీపీఆర్‌లు పూర్తి చేయాలని కేంద్రం గతంలో సూచించినా.. గత టీడీపీ ప్రభుత్వం వినలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టులో పురోగతి వచ్చింది. గతేడాది అక్టోబరులో డీపీఆర్‌లు తయారుచేసి కేంద్రానికి పంపి అనుమతులు సాధించింది.
అధిక శాతం ఘాట్ రోడ్డు నిర్మాణమే..
గిరిజన గ్రామాల మీదుగా ఉండే ఈ జాతీయ రహదారిలో అధిక శాతం రెండు వరుసల ఘాట్ రోడ్డు నిర్మాణమే ఉంటుంది. ప్రస్తుతం రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా) వయా.. తుని, అన్నవరం, అనకాపల్లి మీదుగా 227 కిలోమీటర్ల వరకు పొడవు ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ నిర్మించే కొత్త జాతీయ రహదారి 516–ఇ పొడవు 406 కిలోమీటర్లు ఉంటుంది. పర్యాటకంగా, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధితో పాటు మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించేందుకు కేంద్రం ఈ జాతీయ రహదారి చేపట్టినట్లు ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు పేర్కొంటున్నాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఈ రహదారికి ప్రాధాన్యత ఏర్పడనుంది. భద్రాచలంకు ఈ ఏజెన్సీ ప్రాంతాలు దగ్గరగా ఉండటంతో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వారికి ఈ జాతీయ రహదారి వెసులుబాటుగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment