ఆరు లేన్ల రోడ్ల ఏర్పాటుకు సీఆర్‌డీఏ చర్యలు
4 మార్గాల్లో ఎన్‌హెచ్–16ను కలుపుతూ నిర్మాణం
డీపీఆర్ సిద్ధం చేసిన సీఆర్‌డీఏ.. త్వరలో టెండర్లు
సీడ్ యాక్సిస్ రోడ్డును పూర్తి చేసేందుకు చర్యలు
సాక్షి, అమరావతి: రాజధాని(అమరావతి) ప్రాంతాన్ని చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి(ఎన్‌హెచ్–16)తో కలిపేందుకు సీఆర్‌డీఏ చర్యలు చేపట్టింది. ఇక్కడి గ్రామాల మీదుగా ఆరు లేన్లతో నాలుగు ప్రధాన రహదారులను నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఆరు లేన్ల రోడ్ల పనులకు సంబంధించి అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను సైతం సిద్ధం చేశారు. త్వరలో సీఎం చంద్రబాబుతో సమావేశమై నిర్ణయం తీసుకుని టెండర్లకు వెళ్లాలని సీఆర్‌డీఏ యోచిస్తోంది. రాజధాని అభివృద్ధిలో భాగంగా గతంలోనే ఈ రోడ్లకు అలైన్‌మెంట్ కూడా చేశారు. ఆ ప్రణాళిక ప్రకారమే వీటిని నిర్మించనున్నట్టు తెలుస్తోంది.
అమరావతిలోని ప్రధాన రహదారులను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రిడ్ విధానంలో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. తూర్పు నుంచి పడమరకు వెళ్లే రహదారులు ఈ–1 నుంచి ఈ–16 వరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే మార్గాలు ఎన్–1 నుంచి ఎన్–18 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ–5, ఈ–11, ఈ–13, ఈ–15 రోడ్లు నిర్మించి.. పడమర వైపు ఉన్న ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేస్తారు. కాగా, రాజధాని నుంచి గ్రామాల మీదుగా వెళ్తున్న ఈ రహదారుల నిర్మాణానికి పలుచోట్ల భూసేకరణ చేయాల్సి ఉంది.
ఈ–5 రహదారి
ఈ రోడ్డు నిర్మాణం ఉండవల్లి నుంచి ప్రారంభమవుతుంది. ఉండవల్లి, మందడం, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం మీదుగా జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు. మొత్తం 18 కి.మీలు మేర ఈ రోడ్డును నిర్మిస్తారు.
సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా ఉండే ఈ మార్గం.. గ్రామాల మీదుగా వెళ్తుంది. ఈ క్రమంలో పలుచోట్ల భూసేకరణ చేయాల్సి ఉంది.
ఈ–11 రహదారి
నీరుకొండ నుంచి నవులూరు వరకు 6.3 కి.మీ మేర.. జాతీయ రహదారితో అనుసంధానించేందుకు మరో 4.50 కి.మీ మేర ఈ రోడ్డును నిర్మిస్తారు. ఈ రోడ్డును నీరుకొండ, కురగల్లు, నవులూరు మీదుగా మంగళగిరిలోని ఎయిమ్స్ ముందు నుంచి ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేస్తారు.
ఈ–13 రహదారి
నీరుకొండ నుంచి నవులూరు వరకు 7.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తారు. అనంతరం మంగళగిరి వద్ద ఎన్‌హెచ్–16తో అనుసంధానించేందుకు మరో 2.5 కి.మీ మేర రోడ్డును విస్తరించి ఎయిమ్స్ వెనుక నుంచి జాతీయ రహదారితో కలుపుతారు. ఈ రోడ్డు నీరుకొండ డౌన్ నుంచి నిడమర్రు, ఎర్రబాలెం, నవులూరు, మంగళగిరి మీదుగా వెళుతుంది.
ఈ–15 రహదారి
నిడమర్రు నుంచి జగనన్న లేఅవుట్, నవులూరు, క్రికెట్ స్టేడియం మీదుగా ఎయిమ్స్ వద్ద ఉన్న పాత హైవేకు అనుసంధానం చేస్తారు.
సీడ్ యాక్సెస్ రోడ్డు
ప్రస్తుతం అసెంబ్లీ, సచివాలయాలకు వెళ్లేందుకు వినియోగిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు(ఈ–3)ను.. దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 21 కి.మీ.ల మేర నిర్మించతలపెట్టారు. అయితే, దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు 14 కి.మీ మేర రోడ్డు పూర్తయ్యాక అనేక వివాదాలతో పనులు నిలిచిపోయాయి.
రెండో ప్యాకేజీగా బ్యారేజీ నుంచి మణిపాల్ ఆస్పత్రి వరకు 3 కి.మీ మేర రోడ్డును నిర్మించనున్నారు. మరో 4 కి.మీ మేర మార్గంలోని రైతులను ఒప్పించి మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేయాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో ఈ నెలలోనే టెండర్లకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment