మార్కాపురం టౌన్/మద్దిపాడు(ప్రకాశం జిల్లా): హైవే రోడ్లు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రయాణికుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ మలికా గర్గ్ నేతృత్వంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ప్రతి శనివారం నేషనల్, స్టేట్ హైవేలపై నో యాక్సిడెంట్ డేగా నిర్ణయించి తనిఖీలు చేస్తున్నారు. ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ఒక వైపు ప్రజలకు ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
మరో వైపు నిబంధనలు ఉల్లంఘంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఒంగోలు–చెన్నై, ఒంగోలు–విజయవాడ ఎన్‌హెచ్ 16, ఒంగోలు–చీమకుర్తి పరిధిలోని స్టేట్ హైవే నంబర్ 39, గిద్దలూరు–విజయవాడ పరిధిలోని ఎన్‌హెచ్ 544డి, మార్కాపురం టౌన్‌లోని బోడపాడు క్రాస్ రోడ్‌లోని ఎన్‌హెచ్ 565 పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్లాక్ స్పాట్స్‌లో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు.
వీటి వద్ద బోర్డులు ఏర్పాటు చేయటంతో పాటు స్పీడ్ బ్రేకర్లను, బ్లింకింగ్ లైట్స్ సిస్టంను ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చిల్లచెట్లను తొలగిస్తున్నారు. గ్రామాలు పాఠశాలలు, మలుపుల వద్ద వాహనదారులను అలర్టు చేసేందుకు మార్కింగ్ చేశారు. గత నెల 24వ తేదీన డీఐజి త్రివిక్రమ వర్మ మద్దిపాడు మండలంలోని బ్లాక్ స్పాట్‌లను పరిశీలించి ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ఎస్పీ మలికాగర్గ్‌కు పలు సూచనలు చేశారు.
కారణాలు ఇవే
„ నేషనల్ హైవే నిబంధనల ప్రకారం హైవే రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఉండవు
„ 100 నుంచి 140 కిలో మీటర్ల మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో వాహనం అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి.
„ మద్యం తాగి వాహనం నడపటం
„ గ్రామాల వద్ద, మలుపుల వద్ద వాహనం నిదానంగా కాకుండా వేగంగా వెళ్లడం, ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించక ప్రమాదాలు జరుగుతున్నాయి.
„ హెల్మెట్ వాడకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటంతో ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
„ హైవేపై ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
గత నెలలో జరిగిన ప్రమాదాల్లో కొన్ని
అమరావతి–అనంతపురం హైవేపై కంభం రైల్వేస్టేషన్ వద్ద ఆగస్టు 8వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు.
12న కొనకనమిట్ల మండలంలో జాతీయ రహదారిపై బైక్ ఢీకొని వృద్దుడు మృతి.
16న బేస్తవారిపేట పరిధిలో బస్సును బైక్ ఢీకొని యువకుడు మృతి.
దర్శిలో బైక్‌పై వెళ్తూ బస్సును ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి.
20వ తేదీన తాళ్లూరు మండలం గంగవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో
అన్నా చెల్లెలు మృతి.
23న జే పంగులూరు మండలం కొండమంజులూరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
28వ తేదీ కొమరోలు మండలంలో బైక్‌ను ఢీకొట్టిన లారీ, బైక్‌పై ఉన్న ఇద్దరు మృత్యువాత.
2019వ సంవత్సరంలో బ్లాక్ స్పాట్‌ల వద్ద 24 మంది చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
2020లో 18 మంది ప్రమాదాల్లో చనిపోగా 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. నలుగురికి గాయాలయ్యాయి.
2021లో 22 మంది చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
2022లో ఆగస్టు వరకూ 11 మంది మృతిచెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
నివారణ చర్యలు తీసుకుంటున్నాం
జిల్లా వ్యాప్తంగా తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాం. నివారణకు మా సిబ్బంది వాహనదారులకు అవగాహన కలి్పస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. స్పీడ్ గన్‌లు ఏర్పాటు చేశాం. దీంతో హై స్పీడ్‌తో వెళ్తున్న వాహనాలను గుర్తించి జరిమానా విధిస్తున్నాం. ప్రతి శనివారం జిల్లా వ్యాప్తంగా నో యాక్సిడెంట్ డేను అమలు చేస్తున్నాం. పోలీస్ అధికారులు తమ సిబ్బందితో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు వాహనాల తనిఖీ చేపడుతున్నారు.
– మలికాగర్గ్, జిల్లా ఎస్పీ
బ్లాక్ స్పాట్‌లు
మార్కాపురం పరిధిలోని బోడపాడు క్రాస్‌రోడ్డు, కొనకనమిట్ల జంక్షన్, రాయవరం పలకల గనులు, పెద్దారవీడు సమీపంలోని హనుమాన్ జంక్షన్, నేషనల్ హైవేపై ఉన్న గొబ్బూరు, తోకపల్లి, దేవరాజుగట్టు, కంభం సమీపంలో హైవేపై ఉన్న పెట్రోల్ బంకు వద్ద, గిద్దలూరు సమీపంలోని త్రిపురాపురం క్రాస్‌రోడ్, బేస్తవారిపేట సమీపంలోని పెంచికలపాడు, యర్రగొండపాలెం పరిధిలోని గురిజేపల్లి, బోయలపల్లి, దోర్నాల సమీపంలోని చింతల, చిన్నారుట్ల మలుపు, పుల్లలచెరువు సమీపంలోని మల్లపాలెం క్రాస్‌రోడ్డు, త్రిపురాంతకం సమీపంలోని నేషనల్ హైవేపై ఉన్న గొల్లపల్లి, డీబీఎన్ కాలనీ క్రాస్ రోడ్ల వద్ద తరచుగా రోడ్డు యాక్సిడెంట్‌లు జరుగుతున్నాయి.
ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ బైపాస్ జంక్షన్, సంఘమిత్ర హాస్పిటల్ రోడ్డు, వెంగముక్కలపాలెం జంక్షన్, త్రోవగుంట, ఏడుగుండ్లపాడు, కొప్పోలు ఫ్లైఓవర్ జంక్షన్, మద్దిపాడు పరిధిలోని గ్రోత్ సెంటర్, చీమకుర్తి పరిధిలోని మర్రిచెట్లపాలెం జంక్షన్, ఈస్ట్ బైపాస్ రోడ్డు,
రెడ్డి నగర్, సంతనూతలపాడు పరిధిలోని ఒంగోలు రోడ్డు, సింగరాయ కొండ పరిధిలోని కనుమళ్ల క్రాస్‌రోడ్డు, టంగుటూరు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజి, వల్లూరమ్మ గుడి మధ్య, సూరారెడ్డిపాలెం ఐవోసీ ప్రాంతం, కొండపి ఫైవోవర్ బ్రిడ్జి దగ్గర తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment