సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట రహదారులు రక్తమోడుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో, ప్రత్యేకంగా హైవేలపై ఇటీవల జరిగిన ప్రమాదాల్లో కనీసం పలువురు మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఉదయం పూట మంచు కురిసే వేళలో సరైన జాగ్రత్తలు పాటించకుండా వాహనాలు నడపడంతోనే తెల్లవారుజామున ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు రహదారి భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ఉదంతంలోనూ పొగమంచే ప్రధాన కారణమని రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడే చలికాలం మొదలైంది. మరో రెండు మూడు నెలల పాటు చలి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటే దట్టమైన పొగ మంచు కూడా కమ్ముకొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో హైవేలపై వాహనాలను నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
లైట్ ఆర్పితే అంతే సంగతులు..
►దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉన్న సమయంలో వాహనాలను నడిపేటప్పుడు కచ్చితంగా హెడ్‌లైట్‌లు వెలుగుతూనే ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది.
►ప్రధాన రహదారులపై డివైడర్ల వల్ల ఎదురెదురు వాహనాలు ఢీకొనే అవకాశం తక్కువగానే ఉండొచ్చు. కానీ సరైన వెలుతురు లేకపోవడం వల్ల డివైడర్లే మృత్యు ఘంటికలు మోగించే ప్రమాదం ఉంది. పొగమంచు కమ్ముకొని ఉన్నప్పుడు లైట్లు ఆర్పినా, కాంతి తక్కువగా ఉన్నా డివైడర్లను గుర్తించడం కష్టమవుతోంది.
►సాధారణంగా హైవేలపై కార్లు, ఇతర వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 8 గంటల వరకు 50 నుంచి 60 కి.మీ వేగం మించకుండా వాహనాలను నడపాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు.
వెనక లైట్లూ వెలగాలి..
►రోడ్డు పక్కన బండి నిలిపి ఉంచినప్పుడు హెడ్ లైట్‌లతో పాటు, వెనుక లైట్లు కూడా వెలుగుతూ ఉండాలి. దీనివల్ల ఇతర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిలిపి ఉంచిన వాహనం ఉనికిని ఈజీగా గుర్తించేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో ప్రమాదాలను నివారించవచ్చు.
►వాహనం చుట్టూ రేడియం టేప్ తప్పనిసరి. దీనివల్ల మంచు కురిసే సమయంలోనూ వాహనం ఉనికి తెలుస్తుంది. చాలా వరకు వాహనదారులు ఈ చిన్న నిబంధనను పాటించకపోవడంతోనూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ సమయాలు శ్రేయస్కరం..
చలికాలంలో పొగమంచు కారణంగా రహదారులపై ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. మంచు కారణంగా ఎదుటి వాహనాలు కనిపించక వాహనాలు ఢీకొట్టుకోవటం, రోడ్డు సరిగా కనిపించక వాహనాలు దారితప్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు వాహనదారులకు పలు సూచనలు చేశారు. రాత్రి 10.30 లోపు, ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే ప్రయాణించాలన్నారు.
రెండేళ్ల కాలంలో 50 మంది మృత్యువాత..
గత రెండేళ్లలో శీతాకాలంలో రోడ్డు ప్రమాదాల డేటాను ఆయన విశ్లేషించారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల వెంబడి కుటుంబ సబ్యులతో వాహనాల్లో ప్రయాణించడం ఇబ్బందికర విషయమన్నారు. తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణం చేయాల్సి వస్తే.. సొంత డ్రైవింగ్ కాకుండా నైపుణ్యం ఉన్న డ్రైవర్‌ను వెంట తీసుకెళ్లడం ఉత్తమం. అది కూడా డ్రైవర్‌కు తగినంత విశ్రాంతి ఇచ్చిన తర్వాతే ప్రయాణం మొదలుపెట్టాలని సూచించారు.
‘బే’లలోనే పార్కింగ్..
ట్రక్‌లు, ఇతరత్రా పెద్ద వాహనదారులు శీతాకాలంలో ఓఆర్‌ఆర్, హైవేలపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపకూడదు. రాత్రి సమయంలో విశ్రాంతి కోసం తప్పనిసరి పరిస్థితులలో వాహనాలను నిలపాల్సి వస్తే... రోడ్డు నుంచి పూర్తిగా ఎడమ వైపు తీసుకొని వాహనాలను పార్కింగ్ చేయాలి. ఓఆర్‌ఆర్, హైవేలపై కేటాయించిన పార్కింగ్ బే, లైన్‌లలోనే ఆయా వాహనాలను నిలిపివేయాలి. లేకపోతే పొంగమంచుతో ప్రయాణిస్తున్న చిన్న వాహనాలు పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ఢీకొట్టే ప్రమాదం ఉంది.
నిద్ర మత్తు వీడాలి..
► తెల్లవారుజామున జరిగే ప్రమాదాల్లో డ్రైవర్లు నిద్ర మత్తులో ఉండడం కూడా మరో కారణం. సాధ్యమైంత వరకు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు వానాలను నడపకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే డ్రైవర్ పూర్తిగా ఆరోగ్యంగా ఎలాంటి నిద్రమత్తు లేకుండా ఉండాలి.
► రెప్పపాటు క్షణంలోనే ప్రమాదాలు జరుగుతాయి. ఒకవైపు మంచు కురుస్తుండగా, మరోవైపు నిద్రమత్తుతో బండి నడిపితే రోడ్డు ప్రమాదాలకు మరింత ఊతమిచ్చినట్లవుతుందని డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment