హైదరాబాద్లో చ..చ.. చలి
నగరం గజగజ.. ఉత్తరాది నుంచి చలిగాలులు..
విలవిల్లాడుతున్న పిల్లలు, వృద్ధులు, రోగులు
గ్రేటర్‌పై చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులకు తోడు మంచు ప్రభావంతో సిటీజనులు గజగజలాడుతున్నారు. గురువారం తెల్లవారు జామున 5.30 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 12.2 డిగ్రీలకు పడిపోయింది. ఈ శీతాకాలంలో ఇప్పటి వరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యల్పం. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు 4.4 డిగ్రీల మేర పడిపోయాయి. గరిష్ట ఉష్ణోగ్రత సైతం 28.4 డిగ్రీలకు చేరుకుంది. రాగల 24 గంటల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఇళ్లలో ఉన్నవారు సైతం చలికి వణికిపోతున్నారు.
ఎముకలు కొరికే చలితో చిన్నారులు, వృద్ధులు, చర్మ వ్యాధిగ్రస్తులు, ఆస్తమా రోగులు విలవిల్లాడుతున్నారు. గ్రేటర్ పరిధిలో గత పదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే 2005లో కనిష్ట ఉష్ణోగ్రత 8.7 డిగ్రీలకు పడిపోవడం ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఈసారి అప్పటి పరిస్థితి ఎదురవుతుందేమోనని జనం వణికిపోతున్నారు. స్వెట్టర్, మఫ్లర్, మంకీక్యాప్, జర్కిన్‌లు ధరించకుంటే బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చాదర్‌ఘాట్, నారాయణగూడ, అబిడ్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్ని, లెదర్ దుస్తుల దుకాణాలు వినియోగదారులతో సందడిగా మారాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనర్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.