Low-temperature
-
చలిః 10.5
సిటీబ్యూరో: ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులు, అనూహ్యంగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో గ్రేటర్ సిటిజన్లు గజగజలాడుతున్నారు. సోమవారం కనిష్టంగా 10.5 డిగ్రీలు, గరిష్టంగా 28.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 25 శాతానికి తగ్గింది. చలిగాలులతో చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులున్న వారు అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజామున, రాత్రివేళ అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాగల 24 గంటల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బేగంపేటలోని వాతావరణ కేంద్రం తెలిపింది. -
దయనీయం
కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో జిల్లావాసులు గజగజ వణికిపోతున్నారు. సున్నా డిగ్రీలకు పడిపోవడంతో ఏజెన్సీలో పరిస్థితి దయనీయంగా ఉంది. దట్టమైన మంచుకు చలిగాలులు తోడవ్వడంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటల వరకు మంచుతెరలు వీడడం లేదు. చలిగాలుల తీవ్రతకు తాళలేక బుధవారం మన్యంలో ఇద్దరు చనిపోయారు. ఈ పరిస్థితుల్లో కిటికీలు, తలుపులు లేని హాస్టల్ భవనాల్లో ఉంటూ సర్కారు బడుల్లో చదువుకుంటున్న విద్యార్థులు గజగజ వణికిపోతున్నారు. కిటికీలకు గోనెలు కట్టుకుని, చిరిగిపోయిన రగ్గులు కప్పుకొని ఎముకలు కొరికే చలిలో కాలం వెళ్లదీస్తున్నారు. విశాఖపట్నం : చలితీవ్రత ఎక్కువగా ఉన్న ఏజెన్సీలో 110 ఆశ్రమ పాఠ శాలలు, 11వసతిగృహాలు ఉన్నాయి. వీటిల్లో 41,735 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక 78 ఎస్సీ హాస్టళ్ల లో 6,900మంది,64 బీసీ హాస్టళ్లలో 8,200 మంది విద్యార్థులుంటున్నారు. రెండేళ్ల క్రితం వరకు ఐదు నుంచి పదోతరగతి వరకు మాత్రమే విద్యార్థులు ఈ హాస్టళ్లలో ఉండేవారు. ప్రస్తుతం మూడో తరగతి నుంచి చిన్నారులకు ప్రవేశం కల్పించారు. సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా హాస్టళ్లను ‘సాక్షి’ బృందం విజిట్చేసింది. విద్యార్థులతో గడిపి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంది. నూటికి 60 శాతం హాస్టళ్లు,ఆశ్రమ పాఠశాలలకు తలుపులు, కిటికీలు లేవు. ఇక మిగిలిన 40 శాతం వాటికి తలుపులు, కిటికీలు ఉన్నప్పటికీ చలితీవ్రతను తట్టుకునేలా లేవు. మధ్యలో విరిగిపోయి.. ఎక్కడి కక్కడ స్క్రూలు ఊడిపోయి అధ్వానంగా ఉన్నాయి. సుమారు 60కు పైగా హాస్టల్, ఆశ్రమ పాఠశాలల్లో రన్నింగ్ వాటర్ సదుపాయం లేదు. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చు కునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట కనీసం వేడినీళ్లు సరఫరా చేసేపరిస్థితి లేకపోవడంతో మంచుగడ్డలా తయారైన చన్నీటితో రెండుమూడు రోజులకోసారి కూడా స్నానాలు చేయలేకఅవస్థలు పడుతున్నారు. ఇలా ఎక్కువ శాతం మంది విద్యార్థులు చర్మరోగాలకు గురవుతున్నారు. గతేడాది సరఫరాచేసిన రగ్గులు, దుప్పట్లలో చాలా వరకు చిరిగిపోయి ఉన్నాయి. దీంతో రాత్రి పూట వాటితోనే చలిని త ట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఏ ఒక్క హాస్టల్లోనూ మంచాలు లేకపోవడం, జంబుకానాలు చిరిగిపోవడంతో కటికినేలపైనే నిద్రపోతున్నారు. దోమల దాడి నుంచి తప్పించుకోలేక వీరు నానా అగచాట్లు పడుతున్నారు. మరీ ముఖ్యంగా పదేళ్ల లోపు చిన్నారులు చలితీవ్రతను తట్టుకునేందుకు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు రాత్రి పూట ఈ హాస్టళ్లను విజిట్ చేసి విద్యార్థుల ఇబ్బందులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
దిగజారిన ఉష్ణోగ్రతలు
పాడేరు ఘాట్‌లో 0 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీలు మినుములూరులో 3, చింతపల్లిలో 5 డిగ్రీలు నమోదు పాడేరు: ఏజెన్సీలో ఎన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరుకు సమీపంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డు కార్యాలయం వద్ద బుధవారం 3 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 0 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పోతురాజుస్వామి గుడికి సమీపంలోని మినుములూరు, మోదాపల్లి, గుర్రగరువు, సంగోడి, డల్లాపల్లి ప్రాంతాల్లోని గిరిజనులంతా చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమ్మవారి పాదాల వద్ద ఉంటున్న రెండు కుటుంబాలవారు రాత్రంతా వణికించే చలితో జాగారం చేశారు. మినుములూరు కాఫీబోర్డు, ఏపీఎఫ్డీసీ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల కుటుంబాలు కూడా నరకయాతన పడ్డారు. ఈ ప్రాంతంలో సూర్యోదయం ఉదయం 10 గంటలకు అయింది. మెల్లమెల్లగా సూర్యకిరణాలు నేలను తాకడంతో పొగమంచు వీడింది. ఈ దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. కాఫీ కార్మికులు, ఉద్యోగులు వణుకుతూనే పనులకు హాజరయ్యారు. మధ్యాహ్నం కూడా చల్లటి వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. పర్యాటకులు చలిని తట్టుకోలేక సాయంత్రానికే మైదాన ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. -
చలి గుప్పిట విశాఖ
మరో నాలుగైదు రోజులు వణుకే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ఏజెన్సీలో దట్టంగా మంచు పాడేరు ఘాట్, లంబసింగిలో 6 డిగ్రీలు మినుములూరు, చింతపల్లిల్లో 9 డిగ్రీలు విశాఖపట్నం : చాన్నాళ్ల తర్వాత విశాఖ వణుకుతోంది. ఈ ఏడాది అసలు శీతాకాలంలా లేదని ఊరట చెందుతున్న తరుణంలో ఒక్కసారిగా తడాఖా చూపుతోంది. నగరవాసుల్ని అల్లాడిస్తోంది. గురువారం నుంచి మొదలైన చలి శుక్రవారానికి మరింత ఊపందుకుంది. ఏజెన్సీలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. లంబసింగి, పాడేరు ఘాట్లలో 6 డిగ్రీలు, చింతపల్లి,మినుములూరు ల్లో 9 డిగ్రీలు నమోదయ్యాయి. ఇకపై ఇది మరింత ఉధృతరూపం దాల్చనుంది. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లే వారిని మరింతగా ఇబ్బంది పెడుతోంది. ముఖాలకు స్కార్ఫ్‌లు, మాస్క్‌లు వేసుకున్నా చలి వదిలిపెట్టడం లేదు. ఉదయం తొమ్మిది గంటలైనా సూర్యుని జాడ కనిపించడం లేదు. చలి తీవ్రత తగ్గడమూ లేదు. రోజంతా చల్లని గాలులు వీస్తూనే ఉన్నాయి. రాత్రయ్యే సరికి మరింత తీవ్రతరమవుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలపై వెళ్లే వారూ అవస్థలు పడుతున్నారు. షాపులు, దుకాణాల నిర్వాహకులు ఉదయం పూట ఆలస్యంగా తెరుస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటలకే మూసివేస్తున్నారు. చాలామంది చలికి భయపడి ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు చలి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తర, ఈశాన్య గాలులు విశాఖ వైపు వీస్తున్నాయి. ఉత్తర దిక్కులో ఉన్న చత్తీస్‌గఢ్, ఈశాన్యంలో ఉన్న ఒడిశాలో చలి అధికంగా ఉంది. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా క్షీణిస్తున్నాయి. పొరుగున ఉన్న ఏజెన్సీలోనూ ఉష్ణోగ్రతలు కాశ్మీర్‌ను తలపిస్తున్నాయి. దీంతో అటు చత్తీస్‌గఢ్, ఇటు ఒడిశా, ఏజెన్సీల నుంచి వచ్చే చల్లగాలులు విశాఖ నగర వాసుల్ని వణికిస్తున్నాయి. ఫలితంగా విశాఖలోను, జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురువారం విశాఖ విమానాశ్రయంలో కనిష్ట ఉష్ణోగ్రత 21.2 డిగ్రీలు నమోదవగా, శుక్రవారం 18.8 డిగ్రీలకు దిగజారింది. ఇవి మరింతగా క్షీణించే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఏజెన్సీలో దయనీయం: పాడేరు: మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతోపాటు చలిగాలులు వీస్తున్నాయి. దట్టంగా మంచుకురుస్తోంది. గిరిజనులు విలవిల్లాడిపోతున్నారు. పొగమంచు కారణంగా శుక్రవారం సూర్యోదయం కూడా ఆలస్యమైంది. పది గంటల వరకు మంచుతెరలు వీడలేదు. పొగమంచు కారణంగా ఘాటలో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారపుసంతలకు వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను తరలించే గిరిజనులు అవస్థలు పడ్డారు. ప్రస్తుతం వరినూర్పిడి పనులు జోరందుకున్నాయి గిరిజన రైతులు చలిలో వణుకుతూనే మంచులో పనులు చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, గ్రామాల్లోని వృద్ధులు చలిగాలులకు వణికిపోతున్నారు. -
హైదరాబాద్‌లో చ..చ.. చలి
నగరం గజగజ.. ఉత్తరాది నుంచి చలిగాలులు.. విలవిల్లాడుతున్న పిల్లలు, వృద్ధులు, రోగులు గ్రేటర్‌పై చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులకు తోడు మంచు ప్రభావంతో సిటీజనులు గజగజలాడుతున్నారు. గురువారం తెల్లవారు జామున 5.30 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 12.2 డిగ్రీలకు పడిపోయింది. ఈ శీతాకాలంలో ఇప్పటి వరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యల్పం. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు 4.4 డిగ్రీల మేర పడిపోయాయి. గరిష్ట ఉష్ణోగ్రత సైతం 28.4 డిగ్రీలకు చేరుకుంది. రాగల 24 గంటల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఇళ్లలో ఉన్నవారు సైతం చలికి వణికిపోతున్నారు. ఎముకలు కొరికే చలితో చిన్నారులు, వృద్ధులు, చర్మ వ్యాధిగ్రస్తులు, ఆస్తమా రోగులు విలవిల్లాడుతున్నారు. గ్రేటర్ పరిధిలో గత పదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే 2005లో కనిష్ట ఉష్ణోగ్రత 8.7 డిగ్రీలకు పడిపోవడం ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఈసారి అప్పటి పరిస్థితి ఎదురవుతుందేమోనని జనం వణికిపోతున్నారు. స్వెట్టర్, మఫ్లర్, మంకీక్యాప్, జర్కిన్లు ధరించకుంటే బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చాదర్‌ఘాట్, నారాయణగూడ, అబిడ్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్ని, లెదర్ దుస్తుల దుకాణాలు వినియోగదారులతో సందడిగా మారాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనర్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
మంచు ముల్లె!
పల్లె మంచు ముల్లైంది.. పట్టణం వణుకుతోంది.. ఆకులపై మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నారుు.. ముట్టుకుంటే చలిగింతలు పెడుతున్నారుు.. పట్టణాల్లో ఉదయం ఎనిమిదైనా మంచుతెరలు తొలగడం లేదు.. ఏజెన్సీలో సూరీడి ఆచూకీ పదైన కానరావడం లేదు.. ఆ తర్వాత మంచుతెరలను చీల్చుకుంటూ.. నేనొస్తున్నానంటూ ఎరుపెక్కుతున్నాడు.. రాత్రి ఏడు గంటలకే తండాలు ముసుగేస్తున్నారుు.. పట్టణ రహదారులపై జనం పలుచబడుతున్నారు.. జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారి పెరిగింది. రెండు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారుు. బుధవారం ఈ ఏడాదిలోనే కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సియస్ మించడం లేదు. రెండు రోజులుగా గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో చలి గాలులు వీస్తున్నాయి. ఈ సీజన్లో నవంబర్‌లో చలి తీవ్రత 14 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. డిసెంబర్ మధ్య నుంచి ఒక్కసారిగా తీవ్రత పెరిగింది. డిసెంబర్ 1 నుంచి కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవుతున్నా.. పగటి వేళ సగటు ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో చలి తీవ్రత పెద్దగా లేదు. అయితే రెండు రోజులుగా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల మొదలైంది. ఉదయం పది గంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతోంది. డిసెంబర్ 1 నుంచి రాత్రి వేళలో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 సెల్సియస్ డిగ్రీల మధ్య నమోదవుతుండగా.. పగటి వేళ గరిష్టంగా ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో అస్తమా రోగులు, చంటిపిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. చలిబారి నుంచి రక్షణ చర్యలు తీసుకోకుంటే పిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోస సమస్యలు తలెత్తుతాయని వైద్యులు సూచిస్తున్నారు. చలి నుంచి తట్టుకోవడానికి స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు వాడుతున్నారు. ఏజెన్సీలో చలిమంటలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా నేపాలి వ్యాపారులకు గిరాకీ పెరిగింది. మరో నాలుగు రోజులపాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. -
సిటీ వణుకు
పడిపోతున్న ఉష్ణోగ్రతలు గజగజలాడుతున్న నగరవాసులు ఈ ఏడాది రికార్డు చలి 13.5 డిగ్రీలు ఈ సీజన్లో ఇదే అత్యల్పం సిటీబ్యూరో: చలి గాలులు నగరవాసులను గజగజలాడిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. చీకటి పడితే చలి తీవ్రత పెరుగుతండటంతో జనం రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు. సూర్యోదయాన మంచు ప్రభావం మరింత తీవ్రంగా ఉంటోంది. నగర శివారు ప్రాంతంలో మంచుతీవ్రత ఎక్కువగా ఉంది. శుక్రవారం కనిష్టంగా 13.5 డిగ్రీలు, గరిష్టంగా 30.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ శీతాకాలంలో ఇప్పటికి ఇదే అత్యల్ప రికార్డు. రానున్న 24 గంటల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో వాహనదారులు, ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతం. స్వెట్టర్, మఫ్లర్, మంకీక్యాప్, జర్కిన్, గ్లౌజులు, స్కార్ఫ్‌లు లేనిదే బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు పడిపోవడం సాధారణమే అయినా శీతలగాలులు, మంచు ప్రభావం కారణంగా ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో చలితీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గడచిన పదేళ్ల రికార్డులను పరిశీలిస్తే గ్రేటర్ పరిధిలో 2005లో కనిష్ట ఉష్ణోగ్రత 8.7 డిగ్రీలకు పడిపోవ డం ఇప్పటివరకు ఉన్న రికార్డు. చాదర్‌ఘాట్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో ఉన్ని, లెదర్ దుస్తులు విక్రయించే దుకాణాలు వినియోగదారులతో సందడిగా మారాయి. చర్మవ్యాధులు, అస్తమా రోగులు, చిన్నారులు, వృద్ధులు చలితీవ్రతకు పలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనర్థాలు తప్పవని చర్మ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
చలి
సిటీ గజగజ ప్రకటనలకే పరిమితమైన నైట్‌షెల్టర్లు ఉన్న వాటిలో వసతుల కొరత వినియోగానికి దూరం రాత్రి వేళల్లో జనం అవస్థలు కనిష్ట ఉష్ణోగ్రత 13.7 డిగ్రీలు ఈ సీజన్లో ఇదే అత్యల్పం గ్రేటర్ సిటీజనులను చలిపులి గజగజలాడిస్తోంది. బుధవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 13.7 డిగ్రీలకు పడిపోయాయి. 24 గంటల వ్యవధిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15.5 నుంచి ఏకంగా 13.7 డిగ్రీలకు చేరుకోవడం గమనార్హం. ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం విశేషం. నగరంలో 2007 నవంబరు 25న 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డు. సిటీబ్యూరో: నగరంపై చలి పులి దాడి చేస్తోంది. రోజురోజుకూ తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. సాయంత్రం నుంచి ఉదయం 8 గంటల వరకూ గ్రేటర్ మంచు దుప్పటి కప్పుకుంటోంది. చలి పెరుగుతుండడంతో పక్కా భవనాల్లో ఉన్న వారే గజగజలాడుతున్నారు. ఇక గూడు లేక...కనీసం కప్పుకునేందుకు దుప్పట్లు లేక... రోడ్ల పైనే పడుకునే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఇలాంటి వారు ఎముకలు కొరికే చలిలో...దట్టంగా కురుస్తున్న మంచులో వణుకుతూ... రాత్రి వేళల్లో జాగారం చేస్తున్నారు. వారిని ఆదుకునేందుకు నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలనే యంత్రాంగం ఆలోచనలు ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రస్తుతం పది కేంద్రాలు పని చేస్తున్నా .. పూర్తిగా అక్కరకు రావడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఐదు లక్షల జనాభా దాటిన నగరాల్లో ఐదు లక్షల మందికి ఒకటి చొప్పున నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు నగరంలో 14 మాత్రమే ఏర్పాటు చేశారు. వాటిలో నాలుగు మూత పడగా... ప్రస్తుతం పది నడుస్తున్నాయి. అవి కూడా అందరికీ అందుబాటులో లేకపోవడమే కాక...మౌలిక సౌకర్యాలు లేక వినియోగించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వాటి నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించినజీహెచ్ఎంసీ ఆపై పట్టించుకోవడం మానేసింది. నైట్‌షెల్టర్లు లేక అల్లాడుతున్న వారి దీనగాథలు తెలుసుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ఏడాది క్రితం దీనిపై సర్వే చేశారు. ఆస్పత్రులు, బస్ స్టాండ్లు, రైల్వేస్టేషన్ల పరిసరాల్లో ఎక్కువమంది ఉంటున్నట్లు గుర్తించారు. తొలిదశలో ఆయా ఆస్పత్రుల వద్ద నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. సంబంధిత అధికారులతో సంప్రదించి.. నైట్షెల్టర్లకు స్థలం కేటాయించాల్సిందిగా ఒప్పించడంతోనే ఏడాది గడచిపోయింది. ప్రస్తుతానికి నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు ఏడు ఆస్పత్రులు సుముఖత వ్యక్తం చేశాయి. కానీ.. ఈ చలికాలం పూర్తయ్యేలోగానైనా అవి అందుబాటులోకి వస్తాయో, లేదో అనుమానమే. నామాలగుండులో.... బౌద్దనగర్: నామాలగుండులోని మహిళల నైట్‌షెల్టర్‌ను సదుపాయాల లేమితో ఎక్కువమంది వినియోగించుకోవడం లేరు. అక్కడ ప్రస్తుతం 13 మంది మహిళలు ఉంటున్నారు. వారికి సరిపడా మంచాలు, బెడ్లు లేవు. బాత్రూమ్లు ఉన్నా వాటికి తలుపులు లేవు. దీంతో మహిళలు స్నానాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైట్‌షెల్టర్‌లో ఉండే వారికి అమన్ వేదిక సంస్థ భోజనం అందిస్తుంది. ఇందుకు రూ. 20 చెల్లించాలి. కానీ ఇక్కడకు వస్తున్న వారికి ఆ స్థోమత కూడా లేదు. జీహెచ్ఎంసీ ఇస్తున్న ఖర్చులు నిర్వహణకు సరిపోవడం లేదు. ఇక్కడి మహిళల్లో చంటి పిల్లల తల్లులు ఐదుగురు ఉన్నారు. ఏడాది పైబడిన చిన్నారుల ఆలనా పాలనా చూసేందుకు క్రెష్‌ను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. తల్లులు ఉపాధి కోసం బయటకు వెళితే పిల్లలకు తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఉప్పల్‌లో... ఉప్పల్ సర్కిల్లోని నిరాశ్రయ మహిళల కేంద్రంలో వసతులు కరువయ్యాయి. 15 మందికి పైగా మహిళలు ఉండగా.. కేవలం పది బెడ్లే ఉన్నాయి. తుప్పుపట్టిన మంచాలు, చిరిగిపోయిన బెడ్లు ఉండటంతో నిరాశ్రయ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పురాతన భవనంలో ఉప్పల్ వార్డు కార్యాలయంలో నడుస్తున్న ఈ కేంద్రంలో మహిళలు సమస్యలతో సతమతమవుతున్నారు. పడుకోవడానికి స్థలం లేక, సరిపడా బాత్రూంలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.