దయనీయం
కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో జిల్లావాసులు గజగజ వణికిపోతున్నారు. సున్నా డిగ్రీలకు పడిపోవడంతో ఏజెన్సీలో పరిస్థితి దయనీయంగా ఉంది. దట్టమైన మంచుకు చలిగాలులు తోడవ్వడంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటల వరకు మంచుతెరలు వీడడం లేదు. చలిగాలుల తీవ్రతకు తాళలేక బుధవారం మన్యంలో ఇద్దరు చనిపోయారు. ఈ పరిస్థితుల్లో కిటికీలు, తలుపులు లేని హాస్టల్ భవనాల్లో ఉంటూ సర్కారు బడుల్లో చదువుకుంటున్న విద్యార్థులు గజగజ వణికిపోతున్నారు. కిటికీలకు గోనెలు కట్టుకుని, చిరిగిపోయిన రగ్గులు కప్పుకొని ఎముకలు కొరికే చలిలో కాలం వెళ్లదీస్తున్నారు.
విశాఖపట్నం : చలితీవ్రత ఎక్కువగా ఉన్న ఏజెన్సీలో 110 ఆశ్రమ పాఠ శాలలు, 11వసతిగృహాలు ఉన్నాయి. వీటిల్లో 41,735 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక 78 ఎస్సీ హాస్టళ్ల లో 6,900మంది,64 బీసీ హాస్టళ్లలో 8,200 మంది విద్యార్థులుంటున్నారు. రెండేళ్ల క్రితం వరకు ఐదు నుంచి పదోతరగతి వరకు మాత్రమే విద్యార్థులు ఈ హాస్టళ్లలో ఉండేవారు. ప్రస్తుతం మూడో తరగతి నుంచి చిన్నారులకు ప్రవేశం కల్పించారు. సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా హాస్టళ్లను ‘సాక్షి’ బృందం విజిట్‌చేసింది. విద్యార్థులతో గడిపి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంది. నూటికి 60 శాతం హాస్టళ్లు,ఆశ్రమ పాఠశాలలకు తలుపులు, కిటికీలు లేవు. ఇక మిగిలిన 40 శాతం వాటికి తలుపులు, కిటికీలు ఉన్నప్పటికీ చలితీవ్రతను తట్టుకునేలా లేవు. మధ్యలో విరిగిపోయి.. ఎక్కడి కక్కడ స్క్రూలు ఊడిపోయి అధ్వానంగా ఉన్నాయి. సుమారు 60కు పైగా హాస్టల్, ఆశ్రమ పాఠశాలల్లో రన్నింగ్ వాటర్ సదుపాయం లేదు. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చు కునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట కనీసం వేడినీళ్లు సరఫరా చేసేపరిస్థితి లేకపోవడంతో మంచుగడ్డలా తయారైన చన్నీటితో రెండుమూడు రోజులకోసారి కూడా స్నానాలు చేయలేకఅవస్థలు పడుతున్నారు. ఇలా ఎక్కువ శాతం మంది విద్యార్థులు చర్మరోగాలకు గురవుతున్నారు.
గతేడాది సరఫరాచేసిన రగ్గులు, దుప్పట్లలో చాలా వరకు చిరిగిపోయి ఉన్నాయి. దీంతో రాత్రి పూట వాటితోనే చలిని త ట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఏ ఒక్క హాస్టల్‌లోనూ మంచాలు లేకపోవడం, జంబుకానాలు చిరిగిపోవడంతో కటికినేలపైనే నిద్రపోతున్నారు. దోమల దాడి నుంచి తప్పించుకోలేక వీరు నానా అగచాట్లు పడుతున్నారు. మరీ ముఖ్యంగా పదేళ్ల లోపు చిన్నారులు చలితీవ్రతను తట్టుకునేందుకు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు రాత్రి పూట ఈ హాస్టళ్లను విజిట్ చేసి విద్యార్థుల ఇబ్బందులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.