దిగజారిన ఉష్ణోగ్రతలు
పాడేరు ఘాట్‌లో 0 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీలు
మినుములూరులో 3, చింతపల్లిలో 5 డిగ్రీలు నమోదు
పాడేరు: ఏజెన్సీలో ఎన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరుకు సమీపంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డు కార్యాలయం వద్ద బుధవారం 3 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 0 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పోతురాజుస్వామి గుడికి సమీపంలోని మినుములూరు, మోదాపల్లి, గుర్రగరువు, సంగోడి, డల్లాపల్లి ప్రాంతాల్లోని గిరిజనులంతా చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమ్మవారి పాదాల వద్ద ఉంటున్న రెండు కుటుంబాలవారు రాత్రంతా వణికించే చలితో జాగారం చేశారు. మినుములూరు కాఫీబోర్డు, ఏపీఎఫ్‌డీసీ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల కుటుంబాలు కూడా నరకయాతన పడ్డారు.
ఈ ప్రాంతంలో సూర్యోదయం ఉదయం 10 గంటలకు అయింది. మెల్లమెల్లగా సూర్యకిరణాలు నేలను తాకడంతో పొగమంచు వీడింది. ఈ దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. కాఫీ కార్మికులు, ఉద్యోగులు వణుకుతూనే పనులకు హాజరయ్యారు. మధ్యాహ్నం కూడా చల్లటి వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. పర్యాటకులు చలిని తట్టుకోలేక సాయంత్రానికే మైదాన ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.