
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): జిల్లాలోని ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకులోయ, చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 8.3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రోజుల వ్యవధిలోనే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో గిరిజనులు వణికిపోయారు.
పాడేరు మండలం మినుములూరులో 11డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ అంతటా పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటలకు కూడా మంచు తెరలు అలుముకుంటున్నాయి. చింతపల్లితో పాటు లంబసింగి, గూడెంకొత్తవీధి ప్రాంతాల్లో ప్రయాణికులు కూడా చలి తీవ్రతకు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు.