మళ్లీ చలిగుప్పెట్లోకి మన్యం
ఏజెన్సీలో ఒక్కసారిగా దిగజారిన ఉష్ణోగ్రతలు
పాడేరు ఘాట్‌లో 2, లంబసింగిలో 3 డిగ్రీలు
మినుములూరులో 5, చింతపల్లిలో 6 గా నమోదు
గజగజ వణుకుతున్న ఆదివాసీలు
పాడేరు/చింతపల్లి: మన్యం మళ్లీ చలిగుప్పెట్లోకి వెళ్లింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో కొద్ది రోజులపాటు తగ్గుముఖం పట్టింది. మామూలు వాతావరణంతో గురువారం నుంచి చలిపులి పంజా విసురుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. బుధవారం పాడేరుకు సమీపంలోని మినుములూరు కాఫీబోర్డు వద్ద 10 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా గురువారం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 5 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 2 డిగ్రీలు, చింతపల్లిలో 6 డిగ్రీలు, లంబసింగిలో 3 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో దట్టంగా మంచు పడుతోంది.
పొగమంచు కారణంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులు విలవిల్లాడిపోతున్నారు. సూర్యోదయం కూడా ఆలస్యమవుతోంది. ఉదయం 10.30 గంటల వరకు పొద్దు కనబడడం లేదు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమీపిస్తున్న కొలది చలిపుం జుకుంటుందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి.శేఖర్ తెలిపారు.