చలి | Chills in hyderbad city | Sakshi
Sakshi News home page

చలి

Published Wed, Nov 26 2014 11:46 PM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM

చలి - Sakshi

చలి

సిటీ గజగజ
ప్రకటనలకే పరిమితమైన నైట్‌షెల్టర్లు
ఉన్న వాటిలో వసతుల కొరత
వినియోగానికి దూరం   రాత్రి వేళల్లో జనం అవస్థలు

 
కనిష్ట ఉష్ణోగ్రత  13.7 డిగ్రీలు
 
ఈ సీజన్‌లో ఇదే అత్యల్పం
 
గ్రేటర్ సిటీజనులను చలిపులి గజగజలాడిస్తోంది. బుధవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 13.7 డిగ్రీలకు పడిపోయాయి. 24 గంటల వ్యవధిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15.5 నుంచి ఏకంగా 13.7 డిగ్రీలకు చేరుకోవడం గమనార్హం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం విశేషం. నగరంలో 2007 నవంబరు 25న 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డు.
 
సిటీబ్యూరో: నగరంపై చలి పులి దాడి చేస్తోంది. రోజురోజుకూ తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. సాయంత్రం నుంచి ఉదయం 8 గంటల వరకూ గ్రేటర్  మంచు దుప్పటి కప్పుకుంటోంది. చలి పెరుగుతుండడంతో పక్కా భవనాల్లో ఉన్న వారే గజగజలాడుతున్నారు. ఇక గూడు లేక...కనీసం కప్పుకునేందుకు దుప్పట్లు లేక... రోడ్ల పైనే పడుకునే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఇలాంటి వారు ఎముకలు కొరికే చలిలో...దట్టంగా కురుస్తున్న మంచులో వణుకుతూ... రాత్రి వేళల్లో జాగారం చేస్తున్నారు.  వారిని ఆదుకునేందుకు నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలనే యంత్రాంగం ఆలోచనలు ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రస్తుతం పది కేంద్రాలు పని చేస్తున్నా .. పూర్తిగా అక్కరకు రావడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఐదు లక్షల జనాభా దాటిన నగరాల్లో ఐదు లక్షల మందికి ఒకటి చొప్పున నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు నగరంలో 14 మాత్రమే ఏర్పాటు చేశారు. వాటిలో నాలుగు మూత పడగా... ప్రస్తుతం పది నడుస్తున్నాయి. అవి కూడా అందరికీ అందుబాటులో లేకపోవడమే కాక...మౌలిక సౌకర్యాలు లేక వినియోగించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వాటి నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించినజీహెచ్‌ఎంసీ ఆపై పట్టించుకోవడం మానేసింది. నైట్‌షెల్టర్లు లేక అల్లాడుతున్న వారి దీనగాథలు తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ఏడాది క్రితం దీనిపై సర్వే చేశారు. ఆస్పత్రులు, బస్ స్టాండ్లు, రైల్వేస్టేషన్ల పరిసరాల్లో ఎక్కువమంది ఉంటున్నట్లు గుర్తించారు. తొలిదశలో ఆయా ఆస్పత్రుల వద్ద నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. సంబంధిత అధికారులతో సంప్రదించి.. నైట్‌షెల్టర్లకు స్థలం కేటాయించాల్సిందిగా ఒప్పించడంతోనే ఏడాది గడచిపోయింది. ప్రస్తుతానికి నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు ఏడు ఆస్పత్రులు సుముఖత వ్యక్తం చేశాయి. కానీ.. ఈ చలికాలం పూర్తయ్యేలోగానైనా అవి అందుబాటులోకి వస్తాయో, లేదో అనుమానమే.
 
నామాలగుండులో....

బౌద్దనగర్: నామాలగుండులోని మహిళల నైట్‌షెల్టర్‌ను సదుపాయాల లేమితో ఎక్కువమంది వినియోగించుకోవడం లేరు. అక్కడ ప్రస్తుతం 13 మంది మహిళలు ఉంటున్నారు. వారికి సరిపడా మంచాలు, బెడ్‌లు లేవు. బాత్‌రూమ్‌లు ఉన్నా వాటికి తలుపులు లేవు. దీంతో మహిళలు స్నానాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైట్‌షెల్టర్‌లో ఉండే వారికి అమన్ వేదిక సంస్థ భోజనం  అందిస్తుంది. ఇందుకు రూ. 20 చెల్లించాలి. కానీ ఇక్కడకు వస్తున్న వారికి ఆ స్థోమత కూడా లేదు. జీహెచ్‌ఎంసీ ఇస్తున్న ఖర్చులు నిర్వహణకు సరిపోవడం లేదు. ఇక్కడి మహిళల్లో చంటి పిల్లల తల్లులు ఐదుగురు ఉన్నారు. ఏడాది పైబడిన చిన్నారుల ఆలనా పాలనా చూసేందుకు క్రెష్‌ను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. తల్లులు  ఉపాధి కోసం బయటకు వెళితే పిల్లలకు తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

ఉప్పల్‌లో...

ఉప్పల్ సర్కిల్‌లోని నిరాశ్రయ మహిళల కేంద్రంలో వసతులు కరువయ్యాయి. 15 మందికి పైగా మహిళలు ఉండగా.. కేవలం పది బెడ్లే ఉన్నాయి. తుప్పుపట్టిన మంచాలు, చిరిగిపోయిన బెడ్లు ఉండటంతో నిరాశ్రయ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పురాతన భవనంలో ఉప్పల్ వార్డు కార్యాలయంలో నడుస్తున్న ఈ కేంద్రంలో మహిళలు సమస్యలతో సతమతమవుతున్నారు. పడుకోవడానికి స్థలం లేక, సరిపడా బాత్‌రూంలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement