చార్మినార్ రోడ్డులో రంజాన్ మార్కెట్
♦ ఒక చెప్పుల జోడు కేవలం రూ.50 మాత్రమే...!అమ్మకైనా... నాన్నకైనా... కొడుకుకైనా...ఇంట్లో ఎవరికైనా కేవలం యాబై రూపాయలకే ఒక జత. రండి... ఆలస్యమైతే స్టాక్ అయిపోతుందంటూ చార్‌కమాన్ వద్ద మైక్‌లో ఓ చెప్పుల వ్యాపారి..
♦ బనియన్లు...పదిహేను రూపాయలే. అందరికీ అన్ని సైజులలో..తీసుకోండి...!! అంటూ పత్తర్‌గట్టి వద్ద టేలా బండిపై చిరువ్యాపారి పిలుపు
♦ రంగు రంగుల డిజైన్ల చీరలు..అన్ని వయసుల వారికి రూ.50 మాత్రమే.! అంటూ గుల్జార్‌హౌజ్ వద్ద రోడ్డుపై చీరలు ఉంచి రమ్మంటున్న ఓ చీరెల వ్యాపారి.
♦ రెండు రూపాయలకు ఒకటి...తీసుకోండి..అంటూ చార్మినార్ వద్ద టేలాబండిపై చిన్నచిన్న ప్యాకెట్లలో వంట దినుసులను ప్యాక్ చేసి విక్రయిస్తున్నాడో టేలాబండి వ్యాపారి.
పాతబస్తీలోని రంజాన్ మార్కెట్‌లో రోజూ కనిపిస్తున్న సందడి ఇది. నాణ్యతతో కూడిన వస్తువులను కూడా అతి తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. తక్కువ లాభంతో ఎక్కువ విక్రయాలు చేపడితే నష్టం ఉండదంటున్నారు ఇక్కడి వ్యాపారులు. ఒకటంటూ కాదు.. అవసరమైన అన్ని రకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
చార్మినార్ :రంజాన్ మాసం సందర్భంగా చార్మినార్–మక్కా మసీదు ప్రధాన రోడ్డులో కొనసాగుతున్న రంజాన్ మార్కెట్ జనం రద్దీతో కళకళలాడుతోంది. రంజాన్ మాసం సందర్బంగా ఫుట్‌పాత్ విక్రయాలు రోడ్డుపైకొచ్చాయి. వినియోగదారులతో దుకాణాలన్నీ బిజీగా మారాయి. పండుగను పురస్కరించుకొని ప్రజలు పండుగ వస్తువులు ఖరీదు చేయడంలో నిమగ్నం కావడంతో పాతబస్తీ ముఖ్య వ్యాపార కేంద్రాలన్నీ సందడిగా కనిపిస్తున్నాయి. మహిళలు పండుగను పురస్కరించుకొని ముచ్చటగొలిపే రంగురంగుల గాజులను ఖరీదు చేస్తుండడంతో లాడ్‌బజార్ గాజుల దుకాణాలు మహిళల రద్ధీతో కిటకిటలాడుతున్నాయి. ముస్లిం మహిళలు రంజాన్ పండుగకు ప్రత్యేకంగా గాజులను ఖరీదు చేసి ముచ్చటగా ధరిస్తారు. పాతబస్తీ ప్రజలే కాకుండా శివారు ప్రాంతాల జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి గాజులను ఖరీదు చేస్తున్నారు. లాడ్‌బజార్, ముర్గీచౌక్, గుల్జార్‌హౌజ్, శాలిబండ తదితర ప్రాంతాలలోని అత్తర్ దుకాణాలు ప్రజల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.
కిటకిటలాడుతున్న దుస్తుల దుకాణాలు
రంజాన్ పండుగకు తప్పనిసరిగా ముస్లింలు నూతన వస్త్రాలు ధరించడం ఆనవాయితీగా వస్తుండడంతో వాటిని ఖరీదు చేయడానికి అధిక సంఖ్యలో దుస్తుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. పటేల్ మార్కెట్, మదీనా, గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టీ, రికాబ్‌గంజ్, గుల్జార్‌హౌజ్ తదితర ప్రాంతాలలోని వస్త్ర వ్యాపార కేంద్రాలు రద్దీగా మారాయి. ఖరీదు చేసిన నూతన వస్త్రాలను వెంటనే కుట్టించుకోవడానికి టైలర్ షాపులను కూడా ఆశ్రయించడంతో పాతబస్తీ టైలర్ షాపులకు కూడా గిరాకీ పెరిగింది.
కుటుంబ సభ్యులతో షాపింగ్ చేస్తూ
ఉపవాస దీక్షలను విరమించిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా షాపింగ్ చేయడానికి చాలా కుటుంబాలు సుముఖత చూపిస్తున్నాయి. కళ్లు మిరమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా రంజాన్ మార్కెట్లను సందర్శిస్తున్నారు. వివిధ రకాల గృహోపకర వస్తువులను చూస్తూ.. అవసరమైన చోట ఖరీదు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇఫ్తార్ విందుల అనంతరం మహిళలు, పురుషులు, చిన్నారులు పండుగ వస్తువులను ఖరీదు చేయడానికి వ్యాపార కేంద్రాలకు వస్తున్నారు. సంవత్సరానికోసారి రంజాన్‌ను పురస్కరించుకొని కుటుంబ సభ్యులంతా వ్యాపార కేంద్రాలకు వెళ్లడం సరదా, కాలక్షేపంగా ఉంటుందంటున్నారు. దీంతో పాతబస్తీలో ఎటుచూసినా ప్రజల రద్ధీతో ఫుట్‌పాత్‌లు, దుకాణాలు కళకళలాడు తున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఇక్కడ వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment