చలి గుప్పిట విశాఖ
మరో నాలుగైదు రోజులు వణుకే
కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
ఏజెన్సీలో దట్టంగా మంచు
పాడేరు ఘాట్, లంబసింగిలో 6 డిగ్రీలు
మినుములూరు, చింతపల్లిల్లో 9 డిగ్రీలు
విశాఖపట్నం : చాన్నాళ్ల తర్వాత విశాఖ వణుకుతోంది. ఈ ఏడాది అసలు శీతాకాలంలా లేదని ఊరట చెందుతున్న తరుణంలో ఒక్కసారిగా తడాఖా చూపుతోంది. నగరవాసుల్ని అల్లాడిస్తోంది. గురువారం నుంచి మొదలైన చలి శుక్రవారానికి మరింత ఊపందుకుంది. ఏజెన్సీలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. లంబసింగి, పాడేరు ఘాట్‌లలో 6 డిగ్రీలు, చింతపల్లి,మినుములూరు ల్లో 9 డిగ్రీలు నమోదయ్యాయి. ఇకపై ఇది మరింత ఉధృతరూపం దాల్చనుంది. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లే వారిని మరింతగా ఇబ్బంది పెడుతోంది. ముఖాలకు స్కార్ఫ్‌లు, మాస్క్‌లు వేసుకున్నా చలి వదిలిపెట్టడం లేదు. ఉదయం తొమ్మిది గంటలైనా సూర్యుని జాడ కనిపించడం లేదు. చలి తీవ్రత తగ్గడమూ లేదు. రోజంతా చల్లని గాలులు వీస్తూనే ఉన్నాయి.
రాత్రయ్యే సరికి మరింత తీవ్రతరమవుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలపై వెళ్లే వారూ అవస్థలు పడుతున్నారు. షాపులు, దుకాణాల నిర్వాహకులు ఉదయం పూట ఆలస్యంగా తెరుస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటలకే మూసివేస్తున్నారు. చాలామంది చలికి భయపడి ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు చలి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తర, ఈశాన్య గాలులు విశాఖ వైపు వీస్తున్నాయి. ఉత్తర దిక్కులో ఉన్న చత్తీస్‌గఢ్, ఈశాన్యంలో ఉన్న ఒడిశాలో చలి అధికంగా ఉంది. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా క్షీణిస్తున్నాయి. పొరుగున ఉన్న ఏజెన్సీలోనూ ఉష్ణోగ్రతలు కాశ్మీర్‌ను తలపిస్తున్నాయి. దీంతో అటు చత్తీస్‌గఢ్, ఇటు ఒడిశా, ఏజెన్సీల నుంచి వచ్చే చల్లగాలులు విశాఖ నగర వాసుల్ని వణికిస్తున్నాయి. ఫలితంగా విశాఖలోను, జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురువారం విశాఖ విమానాశ్రయంలో కనిష్ట ఉష్ణోగ్రత 21.2 డిగ్రీలు నమోదవగా, శుక్రవారం 18.8 డిగ్రీలకు దిగజారింది. ఇవి మరింతగా క్షీణించే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏజెన్సీలో దయనీయం:
పాడేరు: మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతోపాటు చలిగాలులు వీస్తున్నాయి. దట్టంగా మంచుకురుస్తోంది. గిరిజనులు విలవిల్లాడిపోతున్నారు. పొగమంచు కారణంగా శుక్రవారం సూర్యోదయం కూడా ఆలస్యమైంది. పది గంటల వరకు మంచుతెరలు వీడలేదు. పొగమంచు కారణంగా ఘాటలో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారపుసంతలకు వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను తరలించే గిరిజనులు అవస్థలు పడ్డారు. ప్రస్తుతం వరినూర్పిడి పనులు జోరందుకున్నాయి గిరిజన రైతులు చలిలో వణుకుతూనే మంచులో పనులు చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, గ్రామాల్లోని వృద్ధులు చలిగాలులకు వణికిపోతున్నారు.