The intensity of the cold
-
సిటీకి పల్లె కళ..
భాగ్య నగరం సిరి సంపదల పండుగకు సమాయాత్తమైంది. ఎటుచూసినా సంక్రాంతి జోష్ కనిపించింది. ఒక వైపు పట్నవాసులు పల్లెబాట పట్టగా మరో వైపు యువత, పెద్దలు అందరూ భోగి మంటలు వేసుకుని పెద్ద పండుగకు ఘన స్వాగతం పలికారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా అర్ధరాత్రి నుంచే మంటలు వేసేందుకు ఉత్సాహం చూపారు. సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తుగా హైటెక్ సిటీలో డూడూ బసవన్నలు సందడి చేశారు. -
మంచు గుప్పెట్లో మన్యం
లంబసింగిలో 1, పాడేరు ఘాట్‌లో 2, చింతపల్లి, పాడేరుల్లో 4, మినుములూరులో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు పాడేరు: విశాఖ ఏజెన్సీలో 5 రోజుల నుంచి చలిగాలులు విజృంభిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత అధికంగా ఉంది. మన్యం ప్రజలు చలిగాలులతో వణుకుతున్నారు. సోమవారం చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో 4 డిగ్రీలు, లంబసింగిలో 1 డిగ్రీ, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 2 డిగ్రీలు, మినుములూరు కాఫీ బోర్డు వద్ద 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 4 గంటల నుంచి వాతావరణం మరింత చల్లగా ఉంటుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గిరిజనులంతా తమ ఇంటి పరిసరాల్లో చలి మంటలు వేసుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి వేళల్లో చలి మరింత విజృంభిస్తుండటంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. అర్ధరాత్రి నుంచే పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటల వరకు ఏజెన్సీలో మంచు తెరలు వీడకపోవడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులు సూర్యోదయం అయ్యేంతవరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు చలిని తాళలేక అవస్థలు పడుతున్నారు. వేకువజామునే నీళ్ల సేకరణకు వెళ్లే మహిళలు కూడా వణికించే చలితో భయాందోళనలు చెందుతున్నారు. సంక్రాంతి సెలవులు రావడంతో అనేక కుటుంబాలు చలికి భయపడి మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లారు. పర్యాటకుల సంచారం కూడా తక్కువగానే ఉంది. మినుములూరు కాఫీబోర్డు, ఏపీఎఫ్డీసీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబాలు, కాఫీ తోటల్లో పనులకు వెళ్లే కార్మికులు చలికి అవస్థలు పడుతున్నారు. -
వదిలేస్తే మానులు మటాష్..
పార్కులు, మైదానాల్లో కుప్పలుగా చెట్ల వ్యర్థాలు, మానులు తరలింపులో తాత్సారం వాటా కావాలంటూ జీవీఎంసీకి ఎన్హెచ్ఏఐ నోటీసు అగ్గి పడితే బుగ్గి అవుతుందని గుబులు విశాఖపట్నం సిటీ : భోగి పం డుగ సమీపిస్తోంది. నగరంలో ఎక్కడికక్కడే చెట్ల వ్యర్థాలు, మానులు కుప్పలుతెప్పలుగా పడి ఉన్నాయి. చలి తీవ్రత ప్రజానీకాన్ని వణికిస్తోంది. ప్రజల దృష్టి ఏ మాత్రం చెట్ల వ్యర్థాలపై పడినా మొత్తం మటాషే... వాస్తవానికి నగరంలోని ఈ చెట్ల వ్యర్థాలన్నింటినీ టింబర్ డిపో యజమానులకు రూ.4 లక్షలకు జీవీఎంసీ రెండు వారాల కిందట అమ్మేసింది. కొందరిని భయపెట్టి, ఇంకొందరిని బెదిరించి, మరి కొంతమందిని బుజ్జగించి మరీ ఈ వ్యర్థాలన్నీ తీసుకుపోవాలని జీవీఎంసీ ప్రాధేయపడింది. ఏదోలాగ చెట్ల వ్యర్థాలు తరలించుకుపోతే అదే చాలనుకుంది. కానీ ఇంత పెద్ద మొత్తంలో కలపను తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోవాలో తెలియక టింబర్ డిపో యజమానులు నెమ్మదిగా విలువైన కలపను తర లించుకుపోతున్నారు. కేవలం పొయ్యిలోకే పనికి వచ్చే కలపను మాత్రం అలాగే ఉంచి నెమ్మదిగా గ్రామీణుల చెంతకు తరలించే ప్లాన్‌లో ఉన్నారు. ఈలోగా జీవీఎంసీకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ)ల నుంచి నోటీసులొస్తున్నాయి. సేకరించిన కలప మొత్తంలో సగం వాటా తమదేనని, ఇప్పుడు ఆ కలపను తమకు సంబంధం లేకుండా అమ్మేసుకోవడమేంటని సీరియస్ అయింది. జాతీయ రహదారిని ఆనుకుని ఎక్కువగా భారీ వృక్షాలుండేవని, అవన్నీ అమ్మేసుకోవడం సరైన పద్ధతి కాదని, వచ్చిన మొత్తంలో తమ వాటా తేల్చాలని కోరింది. ఎన్హెచ్ఏఐ జారీ చేస్తున్న నోటీసులతో జీవీఎంసీ అధికారులు కంగారు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్హెచ్ఏఐతో గొడవ పెట్టుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. అమ్మిన మొత్తంలో సగం తమకు అందజేయాలని ఎన్హెచ్ఎఐ కోరింది. జీవీఎంసీ మనుగడ కేంద్రం నుంచి వచ్చే నిధులతో ముడిపడి ఉండడంతో ఎన్హెచ్ఏఐకు ఏం చెప్పాలో తెలియక, వాళ్లిచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వలేక జీవీఎంసీ మొద్దు నిద్ర నటిస్తోంది. కలప పార్కుల్లోనే ఉండడంతో వచ్చే భోగి పండుగకు స్థానికులంతా వాటిని పట్టుకుపోతే పరిస్థితి ఏంటని ఆలోచిస్తోంది. ఆకతాయిలు కలప యార్డుల్లోనే మంట పెడితే భారీ నష్టమే జరగవచ్చని ఆందోళన చెందుతోంది. -
చలి గుప్పిట విశాఖ
మరో నాలుగైదు రోజులు వణుకే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ఏజెన్సీలో దట్టంగా మంచు పాడేరు ఘాట్, లంబసింగిలో 6 డిగ్రీలు మినుములూరు, చింతపల్లిల్లో 9 డిగ్రీలు విశాఖపట్నం : చాన్నాళ్ల తర్వాత విశాఖ వణుకుతోంది. ఈ ఏడాది అసలు శీతాకాలంలా లేదని ఊరట చెందుతున్న తరుణంలో ఒక్కసారిగా తడాఖా చూపుతోంది. నగరవాసుల్ని అల్లాడిస్తోంది. గురువారం నుంచి మొదలైన చలి శుక్రవారానికి మరింత ఊపందుకుంది. ఏజెన్సీలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. లంబసింగి, పాడేరు ఘాట్లలో 6 డిగ్రీలు, చింతపల్లి,మినుములూరు ల్లో 9 డిగ్రీలు నమోదయ్యాయి. ఇకపై ఇది మరింత ఉధృతరూపం దాల్చనుంది. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లే వారిని మరింతగా ఇబ్బంది పెడుతోంది. ముఖాలకు స్కార్ఫ్‌లు, మాస్క్‌లు వేసుకున్నా చలి వదిలిపెట్టడం లేదు. ఉదయం తొమ్మిది గంటలైనా సూర్యుని జాడ కనిపించడం లేదు. చలి తీవ్రత తగ్గడమూ లేదు. రోజంతా చల్లని గాలులు వీస్తూనే ఉన్నాయి. రాత్రయ్యే సరికి మరింత తీవ్రతరమవుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలపై వెళ్లే వారూ అవస్థలు పడుతున్నారు. షాపులు, దుకాణాల నిర్వాహకులు ఉదయం పూట ఆలస్యంగా తెరుస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటలకే మూసివేస్తున్నారు. చాలామంది చలికి భయపడి ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు చలి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తర, ఈశాన్య గాలులు విశాఖ వైపు వీస్తున్నాయి. ఉత్తర దిక్కులో ఉన్న చత్తీస్‌గఢ్, ఈశాన్యంలో ఉన్న ఒడిశాలో చలి అధికంగా ఉంది. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా క్షీణిస్తున్నాయి. పొరుగున ఉన్న ఏజెన్సీలోనూ ఉష్ణోగ్రతలు కాశ్మీర్‌ను తలపిస్తున్నాయి. దీంతో అటు చత్తీస్‌గఢ్, ఇటు ఒడిశా, ఏజెన్సీల నుంచి వచ్చే చల్లగాలులు విశాఖ నగర వాసుల్ని వణికిస్తున్నాయి. ఫలితంగా విశాఖలోను, జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురువారం విశాఖ విమానాశ్రయంలో కనిష్ట ఉష్ణోగ్రత 21.2 డిగ్రీలు నమోదవగా, శుక్రవారం 18.8 డిగ్రీలకు దిగజారింది. ఇవి మరింతగా క్షీణించే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఏజెన్సీలో దయనీయం: పాడేరు: మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతోపాటు చలిగాలులు వీస్తున్నాయి. దట్టంగా మంచుకురుస్తోంది. గిరిజనులు విలవిల్లాడిపోతున్నారు. పొగమంచు కారణంగా శుక్రవారం సూర్యోదయం కూడా ఆలస్యమైంది. పది గంటల వరకు మంచుతెరలు వీడలేదు. పొగమంచు కారణంగా ఘాటలో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారపుసంతలకు వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను తరలించే గిరిజనులు అవస్థలు పడ్డారు. ప్రస్తుతం వరినూర్పిడి పనులు జోరందుకున్నాయి గిరిజన రైతులు చలిలో వణుకుతూనే మంచులో పనులు చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, గ్రామాల్లోని వృద్ధులు చలిగాలులకు వణికిపోతున్నారు. -
మంచు ముల్లె!
పల్లె మంచు ముల్లైంది.. పట్టణం వణుకుతోంది.. ఆకులపై మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నారుు.. ముట్టుకుంటే చలిగింతలు పెడుతున్నారుు.. పట్టణాల్లో ఉదయం ఎనిమిదైనా మంచుతెరలు తొలగడం లేదు.. ఏజెన్సీలో సూరీడి ఆచూకీ పదైన కానరావడం లేదు.. ఆ తర్వాత మంచుతెరలను చీల్చుకుంటూ.. నేనొస్తున్నానంటూ ఎరుపెక్కుతున్నాడు.. రాత్రి ఏడు గంటలకే తండాలు ముసుగేస్తున్నారుు.. పట్టణ రహదారులపై జనం పలుచబడుతున్నారు.. జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారి పెరిగింది. రెండు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారుు. బుధవారం ఈ ఏడాదిలోనే కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సియస్ మించడం లేదు. రెండు రోజులుగా గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో చలి గాలులు వీస్తున్నాయి. ఈ సీజన్లో నవంబర్‌లో చలి తీవ్రత 14 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. డిసెంబర్ మధ్య నుంచి ఒక్కసారిగా తీవ్రత పెరిగింది. డిసెంబర్ 1 నుంచి కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవుతున్నా.. పగటి వేళ సగటు ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో చలి తీవ్రత పెద్దగా లేదు. అయితే రెండు రోజులుగా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల మొదలైంది. ఉదయం పది గంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతోంది. డిసెంబర్ 1 నుంచి రాత్రి వేళలో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 సెల్సియస్ డిగ్రీల మధ్య నమోదవుతుండగా.. పగటి వేళ గరిష్టంగా ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో అస్తమా రోగులు, చంటిపిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. చలిబారి నుంచి రక్షణ చర్యలు తీసుకోకుంటే పిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోస సమస్యలు తలెత్తుతాయని వైద్యులు సూచిస్తున్నారు. చలి నుంచి తట్టుకోవడానికి స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు వాడుతున్నారు. ఏజెన్సీలో చలిమంటలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా నేపాలి వ్యాపారులకు గిరాకీ పెరిగింది. మరో నాలుగు రోజులపాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. -
చలిగాలులు ఉధృతం
పాడేరు ఘాట్‌లో 5, లంబసింగిలో 5 డిగ్రీలు చింతపల్లిలో 8 డిగ్రీలు, మినుములూరులో 8 డిగ్రీలు నమోదు పాడేరు : ఏజెన్సీలో చలి తీవ్రత నెలకొంది. రోజు వారీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖంతో మన్యం వాసులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం పాడేరుకు సమీపంలోని మినుములూరు వద్ద 8 డిగ్రీలు, చింతపల్లిలో 8 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 5 డిగ్రీలు, పర్యాటకులు అధికంగా సంచరిస్తున్న లంబసింగిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు ప్రాంతంలో మంచు తీవ్రత లేనప్పటికి చలిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చింతపల్లి, లంబసింగి, జీకేవీధి, సీలేరు ప్రాంతంలో మాత్రం మంచు దట్టంగా కురిసింది. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు మండలాల్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. గిరిజనులు చలిగాలులను తట్టుకోలేక చలిమంటలతో వేడిమి పొందుతున్నారు. ఏజెన్సీలోని అటవీ అభివృద్ధి సంస్థలో పని చేస్తున్న కాఫీ కార్మికులు కూడా ఉదయాన్నే కాఫీ పండ్లసేకరణకు ఇబ్బందులు పడుతున్నారు. -
హుమా ఖురేషీ ఔదార్యం
సినీ ప్రముఖులంతా ‘స్వచ్ఛభారత్’హోరులో చీపురుకట్టలు చేతపట్టి చెత్తే కనిపించని వీధులను తుడుస్తూ ఫొటోలకు పోజులిస్తుంటే, హుమా ఖురేషీ మాత్రం ఎలాంటి ప్రచారం లేకుండా ఢిల్లీలోని నిరుపేదల పట్ల తన ఔదార్యాన్ని చాటుకుంటోంది. ఢిల్లీలో నిలువ నీడలేని నిరుపేదలు చాలామంది అక్కడి చలి తీవ్రతకు ఏటా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ పరిస్థితిని నివారించేందుకు హుమా ఖురేషీ, ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఢిల్లీలోని పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తోందట.