వదిలేస్తే మానులు మటాష్..
పార్కులు, మైదానాల్లో కుప్పలుగా చెట్ల వ్యర్థాలు, మానులు
తరలింపులో తాత్సారం వాటా కావాలంటూ
జీవీఎంసీకి ఎన్‌హెచ్‌ఏఐ నోటీసు
అగ్గి పడితే బుగ్గి అవుతుందని గుబులు
విశాఖపట్నం సిటీ : భోగి పం డుగ సమీపిస్తోంది. నగరంలో ఎక్కడికక్కడే చెట్ల వ్యర్థాలు, మానులు కుప్పలుతెప్పలుగా పడి ఉన్నాయి. చలి తీవ్రత ప్రజానీకాన్ని వణికిస్తోంది. ప్రజల దృష్టి ఏ మాత్రం చెట్ల వ్యర్థాలపై పడినా మొత్తం మటాషే... వాస్తవానికి నగరంలోని ఈ చెట్ల వ్యర్థాలన్నింటినీ టింబర్ డిపో యజమానులకు రూ.4 లక్షలకు జీవీఎంసీ రెండు వారాల కిందట అమ్మేసింది. కొందరిని భయపెట్టి, ఇంకొందరిని బెదిరించి, మరి కొంతమందిని బుజ్జగించి మరీ ఈ వ్యర్థాలన్నీ తీసుకుపోవాలని జీవీఎంసీ ప్రాధేయపడింది. ఏదోలాగ చెట్ల వ్యర్థాలు తరలించుకుపోతే అదే చాలనుకుంది. కానీ ఇంత పెద్ద మొత్తంలో కలపను తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోవాలో తెలియక టింబర్ డిపో యజమానులు నెమ్మదిగా విలువైన కలపను తర లించుకుపోతున్నారు. కేవలం పొయ్యిలోకే పనికి వచ్చే కలపను మాత్రం అలాగే ఉంచి నెమ్మదిగా గ్రామీణుల చెంతకు తరలించే ప్లాన్‌లో ఉన్నారు. ఈలోగా జీవీఎంసీకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)ల నుంచి నోటీసులొస్తున్నాయి.
సేకరించిన కలప మొత్తంలో సగం వాటా తమదేనని, ఇప్పుడు ఆ కలపను తమకు సంబంధం లేకుండా అమ్మేసుకోవడమేంటని సీరియస్ అయింది. జాతీయ రహదారిని ఆనుకుని ఎక్కువగా భారీ వృక్షాలుండేవని, అవన్నీ అమ్మేసుకోవడం సరైన పద్ధతి కాదని, వచ్చిన మొత్తంలో తమ వాటా తేల్చాలని కోరింది. ఎన్‌హెచ్‌ఏఐ జారీ చేస్తున్న నోటీసులతో జీవీఎంసీ అధికారులు కంగారు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌హెచ్‌ఏఐతో గొడవ పెట్టుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. అమ్మిన మొత్తంలో సగం తమకు అందజేయాలని ఎన్‌హెచ్‌ఎఐ కోరింది. జీవీఎంసీ మనుగడ కేంద్రం నుంచి వచ్చే నిధులతో ముడిపడి ఉండడంతో ఎన్‌హెచ్‌ఏఐకు ఏం చెప్పాలో తెలియక, వాళ్లిచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వలేక జీవీఎంసీ మొద్దు నిద్ర నటిస్తోంది. కలప పార్కుల్లోనే ఉండడంతో వచ్చే భోగి పండుగకు స్థానికులంతా వాటిని పట్టుకుపోతే పరిస్థితి ఏంటని ఆలోచిస్తోంది. ఆకతాయిలు కలప యార్డుల్లోనే మంట పెడితే భారీ నష్టమే జరగవచ్చని ఆందోళన చెందుతోంది.