కూటమి కుట్ర.. GVMC స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో రసాభాసా | Gvmc Standing Committee Elections Today | Sakshi
Sakshi News home page

కూటమి కుట్ర.. జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో రసాభాసా

Published Wed, Aug 7 2024 11:01 AM | Last Updated on Wed, Aug 7 2024 6:36 PM

Gvmc Standing Committee Elections Today

సాక్షి,విశాఖపట్నం: గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ)  స్టాండింగ్‌ కమిటీ  ఎన్నికల్లో రసాభాసా నెలకొంది. పెన్సిల్‌తో మార్క్‌ చేసిన ఓట్లు చెల్లవని వైఎస్సార్‌సీపీ అభ్యంతరం చెబుతూ  కౌంటింగ్‌ను నిలిపేయాలని డిమాండ్‌ చేసింది. అదే సమయంలో తమకు అనుకూలంగా వ్యవహరించాలని కూటమి నేతలు కమిషనర్‌పై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో.. వైఎస్సార్‌సీపీ ఆందోళన, టీడీపీ కవ్వింపు చర్యలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మొత్తం పోలైన ఓట్లలో 14-16 మధ్య బ్యాలెట్‌ పేపర్లను తొలగించాకే కౌంటింగ్‌ కొనసాగించాలని వైఎస్సార్‌సీపీ పట్టుబట్టింది. దీంతో ఒకానొక తరుణంలో కౌంటింగ్‌ ప్రక్రియ నిలిచింది.అయితే.. టీడీపీ శ్రేణులు రంగ ప్రవేశం చేసి.. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై దాడికి దిగారు. దీంతో.. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కూడా ప్రతిఘటించాల్సి వచ్చింది.  దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే.. టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న టైంలో.. అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తూ ఉండిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నేపథ్యంలో.. న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు.

ఉదయం నుంచే ప్రలోభపర్వాలు
మొత్తం 10 స్టాండింగ్ కమిటీ స్థానాలకు ఎన్నిక జరిగింది. జీవీఎంసీలో 98 వార్డులుండగా 97 మంది కార్పొరేటర్లున్నారు. వీరిలో వైస్సార్‌సీపీ  నుంచి 58 మంది, టీడీపీ నుంచి 29 మంది, జనసేన నుంచి ముగ్గురు, నలుగురు స్వతంత్ర అభ్యర్థులున్నారు. సీపీఐ, సీపీఎం, బీజేపీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.  90 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక.. పోలింగ్‌కు సీపీఎం కార్పొరేటర్ గంగారావు దూరంగా ఉన్నారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌ ఆఖరి నిమిషంలో ఓటు వేశారు.

కూటమివైపు 49 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ ఓటమి భయంతో టీడీపీ క్యాంపు రాజకీయం చేసింది.  ప్రలోభాలే ఎజెండాగా టీడీపీ కుట్రలకు తెరలేపింది. విశాఖ టీడీపీ నేతలు.. కార్పొరేటర్లకు డబ్బులు ఎర చూపినట్లు సమాచారం.

టీడీపీ కుట్రలు చేస్తోంది.. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్
జీవీఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి కుట్రలు చేసిందని జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ సాక్షిటీవీతో అన్నారు. గతంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలన్నీ ప్రశాంతంగా నిర్వహించాం. జీవీఎంసీలో వైఎస్‌ఆర్‌సీపీకి సంఖ్యా బలం ఉన్నప్పటికీ కార్పొరేటర్లను కొనుగోలు చేసి గెలవాలని కూటమి ప్రయత్నాలు చేస్తోందని శ్రీధర్‌ మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement