జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వివాదాస్పదం.. చెల్లని ఓట్లతో గెలుపు
టీడీపీ కార్యకర్తలా వ్యవహరించిన కమిషనర్
పోలైన ఓట్లలో చెల్లనివి ఉన్నా.. లెక్కించాలంటూ ఆదేశాలు
న్యాయపోరాటం చేస్తామన్న మేయర్, డిప్యూటీ మేయర్
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీడీపీ కూటమి కుట్ర రాజకీయాలకు తెరతీసింది. కూటమి కార్పొరేటర్లకు జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ మద్దతు పలుకుతూ.. చెల్లని ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుని.. 10కి 10 స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించినట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జీవీఎంసీలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
కార్పోరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న పోలీసులు
కుట్రలు చేసైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో.. కార్పొరేటర్లకు రూ.5 లక్షల వరకూ డబ్బులిచ్చి మరీ ఓట్లు బహిరంగంగానే కొనుగోలు చేశారు. తమకు మద్దతిస్తున్న కార్పొరేటర్లను భీమిలిలోని రిసార్టులో మంగళవారం రాత్రి మొత్తం అక్కడే బస చేయించి.. ఉ.11 గంటల సమయంలో ఓటింగ్‌కు బస్సులో తీసుకొచ్చారు. మరోవైపు.. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు నేరుగా ఫోన్లుచేసి డబ్బులు పంపిస్తున్నట్లు చెప్పి ఓట్లు కొనుగోలు చేశారు.
కన్నీటి పర్యంతమవుతున్న వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్ రోహిణి
బ్యాలెట్ పేపర్లపై కలర్ పెన్సిళ్లతో గుర్తులు..
ఇక డబ్బులు తీసుకున్న వారు తమకు ఓట్లు వేశారా లేదా అనేది తెలుసుకునేందుకు కలర్ పెన్సిళ్లతో బ్యాలెట్ పేపర్‌పై అనధికారికంగా గీతలు గీశారు. వాస్తవానికి.. బ్యాలెట్ పేపర్‌పై పెన్ను, పెన్సిల్, స్కెచ్ గీతలుంటే కచ్చితంగా ఆ ఓట్లు చెల్లుబాటు కావన్న నిబంధనలున్నా కమిషనర్ మాత్రం పూర్తిగా పక్కా టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఆ ఓట్లు చెల్లుబాటు కావని చెబుతున్నా బేఖాతరు చేస్తూ టీడీపీ కార్పొరేటర్లు 10 మందీ విజయం సాధించినట్లు ప్రకటించారు.
దీంతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కమిషనర్ తీరుపై మండిపడ్డారు. పోర్టికోలో బైఠాయించారు. ముందుగానే కుట్ర పన్ని గెలుపొందాలని స్కెచ్ వేసిన టీడీపీ పెద్దఎత్తున పోలీసు బలగాల్ని రంగంలోకి దించి.. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను జీవీఎంసీ నుంచి బయటికి పంపించేశారు. అక్రమంగా విజయం సాధించిన టీడీపీ వ్యవహారం, కమిషనర్ వ్యవహరించిన తీరుపై న్యాయపోరాటం చేస్తామని మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్, ఫ్లోర్‌లీడర్ బానాల శ్రీను, ఇతర కార్పొరేటర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment