చలిగాలులు ఉధృతం
పాడేరు ఘాట్‌లో 5, లంబసింగిలో 5 డిగ్రీలు
చింతపల్లిలో 8 డిగ్రీలు, మినుములూరులో 8 డిగ్రీలు నమోదు
పాడేరు : ఏజెన్సీలో చలి తీవ్రత నెలకొంది. రోజు వారీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖంతో మన్యం వాసులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం పాడేరుకు సమీపంలోని మినుములూరు వద్ద 8 డిగ్రీలు, చింతపల్లిలో 8 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 5 డిగ్రీలు, పర్యాటకులు అధికంగా సంచరిస్తున్న లంబసింగిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు ప్రాంతంలో మంచు తీవ్రత లేనప్పటికి చలిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
చింతపల్లి, లంబసింగి, జీకేవీధి, సీలేరు ప్రాంతంలో మాత్రం మంచు దట్టంగా కురిసింది. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు మండలాల్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. గిరిజనులు చలిగాలులను తట్టుకోలేక చలిమంటలతో వేడిమి పొందుతున్నారు. ఏజెన్సీలోని అటవీ అభివృద్ధి సంస్థలో పని చేస్తున్న కాఫీ కార్మికులు కూడా ఉదయాన్నే కాఫీ పండ్లసేకరణకు ఇబ్బందులు పడుతున్నారు.