లంబసింగి వేడెక్కింది
రెండు వారాల్లో మార్పు
ఏజెన్సీలో పెరిగిన ఉష్ణోగ్రతలు అల్పపీడనం ప్రభావం
లంబసింగిలో 13, చింతపల్లిలో 16 డిగ్రీలు
ఊరట చెందుతున్న గిరిజనులు
విశాఖపట్నం : అంతలోనే ఎంత మార్పు? రెండు వారాల క్రితం ఏజెన్సీలోని లంబసింగిలో ‘0’ (సున్నా) డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వణికించే చలి. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. మంచుదుప్పటి కప్పుకున్నట్టుగా ఉండేది. సూర్యుడు ఉన్నాడో లేడోనన్న అనుమానం కలిగేది. మరి ఇప్పుడు వణికించే చలి లేదు. మంచు ముంచేస్తుందన్న భయమూ లేదు. చలి మంటల అవసరమూ లేదు. హాయిగా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. పిల్లలు బడులకు వెళ్తున్నారు. పెద్దలు పనులకు వెళ్తున్నారు. ఇదంతా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం పుణ్యమే. అల్పపీడనంతో ఆకాశంలో మేఘాలు ఏర్పడ్డాయి. మబ్బుల వల్ల చలి తీవ్రత తగ్గుతుంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 2 వరకూ అల్పపీడన ప్రభావం కొనసాగింది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రంలోనే అత్యల్ప డిగ్రీలు నమోదవుతూ రికార్డులకెక్కే జిల్లాలోని చింతపల్లి మండలం లంబసింగిలో డిసెంబర్ 21న ’0’ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. 22న ఒక డిగ్రీ, 23న రెండు, 24న ఒక్కసారిగా 11డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరిగింది. 25, 26, 27 తేదీలో 15, 28న16 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.
28 నుంచి అల్పపీడనం మొదలయ్యాక ఉష్ణోగ్రతలు నిలకడగా ఉన్నాయి. 29న 16 డిగ్రీలు రికార్డయింది. తాజాగా గురు,శుక్రవారాల్లో లంబసింగిలో 13 డిగ్రీలు, చింతపల్లిలో 16, పాడేరులో 14, ఘాట్‌లో 14 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పుడు విశాఖ ఏజెన్సీలో ఆహ్లాదకరమైన వాతావరణం కొనసాగుతోంది. మరికొద్ది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆకాశంలో మబ్బులు వెళ్లిపోతే ఉష్ణోగ్రతలు క్షీణించి శీతల ప్రభావం కనబడుతుందని,మళ్ళీ చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి.శేఖర్ తెలిపారు. మొత్తమ్మీద అల్పపీడనం వచ్చి మన్యం వాసులకు ఊరటనిచ్చింది.