హిమము.. మనము.. వేకువ దీపము..
మంచు పాడే సుప్రభాతానికి మనం తల మాత్రమే ఆడించం. ఒళ్లంతా ఒణికిస్తాం. చలి కదా. కౌగిలించుకోవడానికి వస్తుంది. మెడలో చేతులు వేస్తుంది. వద్దు.. వద్దు... కాస్త దూరం ఉండు అని దానిని దూరం పెట్టడానికి రగ్గు కప్పుకుంటాం. స్వెటర్ ధరిస్తాం. మఫ్లర్ మెడకు చుట్టుకుంటాం. తలకు ఉన్ని టోపీ ధరిస్తాం. వింటుందా శీతల పవనం? ఇది నా కాలం. నేను వచ్చి వెళ్లే కాలం. మీరు పిలిచినా పిలవకపోయినా సరే మీ ఇళ్లల్లోకి అడుగు పెట్టాల్సిందే అని తెరచిన చీకటిలో నుంచి నెర్రెలిచ్చిన గోడల లోనుంచి పగుళ్లు బారిన పైకప్పుల్లో నుంచి ఇళ్లల్లోకి వచ్చేస్తుంది. అప్పుడిక చేసేదేముంది? కుంపటి దగ్గర కూలబడటమే.
నిజానికి చలి చాలా మంచిది. అందరినీ దగ్గర చేస్తుంది. దగ్గర దగ్గరగా కూర్చొ నేలా చేసి వారి మనసుల్లో పరస్పరం వెచ్చని అభిమానం పెంచుతుంది. టీ పొగలను ముఖాన ఊదుతుంది. ఎండ విలువ తెలిసొచ్చేలా చేస్తుంది. ధాన్యాన్ని ఇంటికి తెస్తుంది. విష్ణువుకు ప్రీతికరమైన మార్గశిరాన్ని తెస్తుంది. ధనుర్మాసపు ముగ్గులను ముంగిళ్ల ముందు పరుస్తుంది. గుమ్మడిపూలు, డిసెంబరాలు, మంచులో తడిసిన ముద్దబంతులు... ఇవన్నీ చలికాలపు కానుకలు. వేడి నీళ్ల స్నానమూ వేడి వేడి భోజనమూ చలిమంటా... ఇవన్నీ ఎంత సుఖాన్ని ఇస్తాయో ఇంత చలిలో కూడా భగవంతుడా నీ మీద నా మనసు లగ్నం తప్పదు అని కోనేట మునిగి పవిత్ర స్నానం ఆచరించడం కూడా అంతే సంతృప్తిని ఇస్తాయి. బద్ధకం వల్ల నిద్ర లేవని మగవాళ్లు, స్కూళ్లకు వెళ్లడానికి మారాము చేసే చిన్నవాళ్లు, పొగమంచు పూలకుండీలు, ఆ దూరాన దేవాలయపు గంట మరెక్కడో అజా పిలుపు, ఎక్కడే వేలాడగట్టిన క్రిస్మస్ తార – ఇవన్నీ చలికాలాన కొత్త అనుభూతులు పంచే అనుభవాలు.
ఈ కాలంలో మార్నింగ్ వాక్ ఒక గొప్ప ప్రసాదం. మంచుకప్పిన ఒంటరి దారిలో అడుగులేస్తూ నడవడం ఒక ఉల్లాసం. రాత్రి పూట కిటికీలన్ని మూసి దీపాలను మందగింప చేసి రేడియో వింటే అదో పెద్ద మన్‌చాహే గీత్. అనవసర వేళలో అనవసర కాఫీ తాగడం కూడా ఈ కాలపు వైచిత్రే. పులకించే మనసు ఉండాలే కాని చలికి మించిన నెచ్చెలి ఉండదు కదా!