సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. హత్యలు, హింసాత్మక ఘటనలు, అవినీతి కేసులు బాగా తగ్గుముఖం పట్టడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు తగ్గుతున్నాయని జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2022లో దేశంలో వివిధ నేరాల గణాంకాలను వెల్లడిస్తూ ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదికను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల నేరాలు తగ్గడంతోపాటు రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదికలోని అంశాలు సంగ్రహంగా..
అన్ని రకాల నేరాల తగ్గుదల
రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు తగ్గాయి. నేరాలకు పాల్పడితే నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కేసులు, పౌరులు చట్టబద్ధంగా వ్యవహరించేలా చేసేందుకు ప్రత్యేక స్థానిక చట్టాల కింద (స్పెషల్ లోకల్ లాస్ – ఎస్‌ఎల్‌ఎల్) నమోదు చేసే (ట్రాఫిక్ ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన వంటివి) కేసులు కూడా తగ్గడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 2022లో రాష్ట్రంలో మొత్తం 1,95,284 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఐపీసీ సెక్షన్ల కేసులు 1,56,503, ఎస్‌ఎల్‌ఎల్ కేసులు 36,737 ఉన్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య బాగా తగ్గడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఐపీసీ నేరాలు 11.72 శాతం, ఎస్‌ఎల్‌ఎల్ నేరాలు 13.73 శాతం తగ్గాయి. వెరసి రాష్ట్రం మొత్తం మీద 12.11 శాతం కేసులు తగ్గాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసింది. నేరాలకు పాల్పడేవారికి న్యాయస్థానం ద్వారా శిక్షలు విధించేలా పర్యవేక్షించడంలో పోలీసు శాఖ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. అందుకోసం సత్వరం చార్జిషీట్లు దాఖలు చేస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. 2022లో ఐపీసీ కేసుల్లో 86.5 శాతం, ఎస్‌ఎల్‌ఎల్ కేసుల్లో 96.4 శాతం కేసుల్లో నిర్ణీత వ్యవధి 60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. మొత్తం మీద 88.9 శాతం కేసుల్లో నిర్ణీత వ్యవధిలో చార్జిషీట్లు దాఖలు చేసింది.
తగ్గిన హత్యలు
అసాంఘిక శక్తుల ఆటకట్టించడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో హత్యలు తగ్గడమే అందుకు నిదర్శనం. 2021లో రాష్ట్రంలో 956 మంది హత్యకు గురికాగా.. ఆ సంఖ్య 2022లో 925కి తగ్గింది. హత్యల రేటు ఉత్తరాది రాష్ట్రాల్లో మూడుశాతనికిపైగా ఉండగా.. తెలంగాణలో 2.5 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 1.7 శాతం మాత్రమే. హత్యకేసుల్లో దేశంలో టాప్–20 రాష్ట్రాల జాబితాలో కూడా ఆంధ్రప్రదేశ్ లేదు.
ఘర్ణణలు, అల్లర్ల కట్టడి
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు అల్లరిమూకలు చేసే కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేస్తోంది. ఘర్షణలు, అల్లర్ల కేసులు గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 444 ఘర్షణలు, అల్లర్ల కేసులు నమోదు కాగా 2022లో వాటి సంఖ్య 304కు తగ్గడం శాంతిభద్రతల పరిరణక్షలో ప్రభుత్వ చిత్తశుద్ధిని వెల్లడిస్తోంది.
అత్యాచారాలు 47.72 శాతం తగ్గుదల, వరకట్న వేధింపుల కట్టడి
దిశ యాప్, దిశ వ్యవస్థ వంటి విప్లవాత్మక విధానాలతో మహిళల భద్రత కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలినిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా అత్యాచారాలు, వరకట్న వేధింపుల కేసులు తగ్గడం దీనికి నిదర్శనం. 2021లో రాష్ట్రంలో 1,188 అత్యాచారాల కేసులు నమోదు కాగా 2022లో 621 కేసులు నమోదయ్యాయి.
అత్యాచారాల కేసులు దేశంలోకెల్లా అత్యధికంగా రాష్ట్రంలో 47.72 శాతం తగ్గడం ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఇక 2021లో రాష్ట్రంలో 111 వరకట్న కేసులు నమోదు కాగా 2022లో వందకు తగ్గాయి. వరకట్న కేసుల రేటు కేవలం 0.4 శాతానికే పరిమితమైంది. ఇక యాసిడ్ దాడుల కేసులు 2021లో ఏడు నమోదు కాగా 2022కు అవి నాలుగుకు తగ్గాయి.
తగ్గిన రైతుల ఆత్మహత్యలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంది. రైతు సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు విజయవంతమవుతున్నాయి. సాగు లాభసాటిగా మారడంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 481 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో భూయజమానులైన రైతులు 359 మంది, కౌలురైతులు 122 మంది ఉన్నారు.
2022లో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 369కి తగ్గాయి. వారిలో భూయజమానులైన రైతులు 309 మంది, కౌలురైతులు 60 మంది ఉన్నారు. 2021లో 584 మంది వ్యవసాయ కూలీలు ఇతరత్రా కారణాలతో ఆత్మహత్య చేసుకోగా.. 2022లో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 548కి తగ్గాయి. మొత్తం మీద వ్యవసాయంపై ప్రత్యక్షంగా ఆధారపడేవారు 2021లో 1,065 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2022లో ఆ సంఖ్య 917కు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment