ప్రతీకాత్మక చిత్రం
జీవితంలో గడిచిపోయిన ప్రతి క్షణం వెలకట్టలేనిది. ఆ కాలాన్ని తిరిగి ఇవ్వాలంటే.. అది ఎవరి వల్లా కాదు.. అయితే మన దేశంలో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న నిర్దోషులు అనేక మంది ఉన్నారు. ఇంటారాగేషన్ పేరుతో ఒంట్లోని శక్తినంతా లాగేశాక.. చివరికి జీవచ్ఛవాల్లా ఉన్న వారిని నిర్దోషులుగా విడుదల చేయడం పరిపాటి. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పిన విషయాలు దేశంలో జైళ్ల పరిస్థితిని తెలియజేస్తోంది.
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 3 సంవత్సరాలలో 348 మంది పోలీసు కస్టడీలో మరణించగా.. 5221 మంది జ్యుడీషియల్ కస్టడీలో మరణించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పారు. అంతే కాకుండా ఉత్తర ప్రదేశ్‌లో పోలీసు కస్టడీలో 23 మంది చనిపోయారని, అదే సమయంలో జ్యుడీషియల్ కస్టడీలో 1295 మంది మరణించినట్లు ఆయన తెలిపారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీఆర్‌బీ గణాంకాల్లో చాలా తేడాలు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) రికార్డుల ప్రకారం గత 10 సంవత్సరాలలో, 1,004 మంది పోలీసుల కస్టడీలో మరణించారు. అందులో 40శాతం మంది సహజంగా లేదా అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోగా.. 29శాతం మంది ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ నివేదికలో దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా చనిపోయారా? లేదా పోలీసుల చిత్రహింసల కారణంగానా..? అనేది స్పష్టం చేయలేదు. అలాగే పోలీస్ కస్టడీ మరణాలపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల్లో చాలా తేడాలు ఉన్నాయి.
నిందుతులు ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే..!
దీనిపై సామాజిక కార్యకర్త సమీర్ మాట్లాడుతూ.. "ఖైదీలను హింసించడాన్ని వ్యతిరేకిస్తున్న అనేక మంది అధికారులు పోలీసు శాఖలో ఉన్నారు. పోలీసులు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరు. అందువల్ల న్యాయస్థానాల ద్వారా నేరస్తులను విచారించడానికి చట్టపరమైన నిబంధనలను ఉపయోగిస్తారు. తీహార్ జైలులో ఓ ఖైదీ హత్యకు సంబంధించి డిప్యూటీ జైలర్, ఇతర జైలు సిబ్బంది పేర్లు బహిర్గతమయ్యాయి. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇంకా తెలియాల్సి ఉంది. కానీ చట్టం అటువంటి విషయాలపై స్పష్టంగా ఉంది. నిందితులు ఏ పదవిలో ఉన్నా ప్రాసిక్యూట్ చేస్తారు.’’ అని అన్నారు.
క్రూరంగా హింసించే హక్కును ఏ చట్టమూ పోలీసులకు ఇవ్వలేదు
ఓ మానవ హక్కుల కార్యకర్త స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం.. సంబంధిత పోలీసు అధికారులపై కేసును ప్రభుత్వ అనుమతి తర్వాత మాత్రమే నమోదు చేయవచ్చు. అయితే ప్రభుత్వాలు దీనికి బహిరంగంగా అమలు చేయడానికి ఇష్టపడవు. ఇది ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా సిగ్గుచేటు. పోలీసు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను అనుమానిత నేరస్థులుగా మాత్రమే పరిగణించాలి అంతే కానీ వారిని నిర్బంధంలో క్రూరంగా హింసించే హక్కును ఏ చట్టమూ పోలీసులకు ఇవ్వదు. ఈ సమస్యపై దేశంలోని పోలీసులు, పరిపాలనా వ్యవస్థ సున్నితంగా ఉండడం అత్యవసరం’’ అని ఓ సామాజిక కార్యకర్త అన్నారు.
కాగా హిందుస్తానీ బిరదారీ వైస్ ఛైర్మన్ విశాల్ శర్మ మాట్లాడుతూ.. ఏదైనా కస్టడీ మరణంపై పోలీసు శాఖ ద్వారానే సరైన నిష్పాక్షిక విచారణ జరగాలని పేర్కొన్నారు. అలాగే ప్రమేయం ఉన్న పోలీసులను చట్ట ప్రకారం శిక్షించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment